Viveka Case : మరికొద్ది సేపట్లో చంచల్‌గూడ జైలుకు గంగిరెడ్డి తరలింపు
ABN , First Publish Date - 2023-05-05T14:09:28+05:30 IST
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగి రెడ్డి కోర్టులో లొంగిపోయాడు. ఎర్ర గంగిరెడ్డికి జూన్ 2వ తేదీ వరకూ నాంపల్లి సీబీఐ కోర్టు రిమాండ్ విధించింది.
హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగి రెడ్డి కోర్టులో లొంగిపోయాడు. ఎర్ర గంగిరెడ్డికి జూన్ 2వ తేదీ వరకూ నాంపల్లి సీబీఐ కోర్టు రిమాండ్ విధించింది. ఎర్ర గంగి రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. వివేకాను హత్య చేస్తే నాలుగు కోట్లు ఇస్తామని దస్తగిరికి ఎర్ర గంగి రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. నాలుగు కోట్ల రూపాయల వ్యవహారం వెనుక భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ చేయనుంది. ఎర్ర గంగి రెడ్డి బెయిల్ పై బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. మరి కొద్ది సేపటిలో చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ఎర్ర గంగి రెడ్డిని 72 సార్లు సీబీఐ విచారించింది.
వివేకా హత్య కేసులో గంగిరెడ్డిని ఏపీ పోలీసులు 2019 మార్చి 28న అరెస్టు చేశారు. ఆ తర్వాత 90 రోజులు గడచినా చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో అదే ఏడాది జూన్ 27న గంగిరెడ్డికి డీఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఏపీ పోలీసుల దర్యాప్తు ఆశించిన స్థాయిలో లేదని.. కేసును సీబీఐకి ఇవ్వాలని వివేకా కుమార్తె ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు సీబీఐకి అప్పటించింది. తదనంతరం గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరగా... కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తీవ్ర నేరారోపణలు ఉన్న కేసుల్లో స్పష్టమైన ఆధారాలు ఉంటే డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ పిటిషన్‌పై మెరిట్ ఆధారంగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలంటూ కేసును మళ్లీ ఏపీ హైకోర్టుకు రిమాండ్ చేసింది. తదనంతర పరిణామాల్లో వివేకా హత్య కేసు దర్యాప్తు తెలంగాణకు బదిలీ అయింది. ఈ క్రమంలోనే ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు.. అక్కడి నుంచి తాజాగా తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయింది. బదిలీ అయిన తర్వాత కేసు విచారణ ఊపందుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డికి ఐదో తేదీ లోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.