AP News: జగనన్న నవరత్నాలను దోచుకున్న నలుగురు అధికారులపై వేటు
ABN , First Publish Date - 2023-06-20T11:54:10+05:30 IST
జగనన్న నవరత్నాలను దోచుకుంటూ పట్టుబడ్డ నలుగురు ప్రభుత్వ అధికారులపై వేటు పడింది. నూజివీడు మండలంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదలందరికి ఇళ్ళు పధకంలో భారీ స్కామ్‌కు పాల్పడిన నలుగురు గృహనిర్మాణశాఖ అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఏలూరు: జగనన్న నవరత్నాలను (Jagananna Navaratnalu) దోచుకుంటూ పట్టుబడ్డ నలుగురు ప్రభుత్వ అధికారులపై వేటు పడింది. నూజివీడు మండలంలో జగన్ ప్రభుత్వం (Jagan Government) ప్రవేశపెట్టిన పేదలందరికి ఇళ్ళు పధకంలో భారీ స్కామ్‌కు పాల్పడిన నలుగురు గృహనిర్మాణశాఖ అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నూజివీడు మండలం పల్లెర్లమూడి, మీర్జాపురం, దేవరగుంట గ్రామాల్లో జగనన్న ఇళ్ళను నిర్మించకుండానే బిల్లులు విడుదల చేశారు. నకిలీ లబ్ధిదారుల పేర్లను సృష్టించి గృహా నిర్మాణ సామాగ్రి సిమెంట్, స్టీల్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించి హౌసింగ్ అధికారులు సొమ్ములు చేసుకున్నారు. సుమారుగా రూ.2 కోట్ల వరకు ప్రభుత్వ సొమ్మును కాజేసినట్టుగా సమాచారం.
అవినీతికి పాల్పడిన హౌసింగ్ డీఈని ట్రాన్స్‌ఫర్ చేసిన గృహా నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఏఈ, వర్క్ ఇన్స్‌పెక్టర్, గౌడౌన్ ఇంచార్జ్, విలేజ్ అసిస్టెంట్ ఇంజనీర్‌లను విధుల నుంచి తొలగించింది. అలాగే ఈ స్కాంపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ చేపట్టారు. విజిలెన్స్ విచారణలో నూజివీడు నియోజకవర్గ పరిధిలో కొందరు పైస్థాయి అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే విషయం బయటకు పొక్కనివ్వకుండా రాష్ట్ర స్థాయి అధికారుల బృందం దర్యాప్తు చేపట్టింది. స్టీల్, సిమెంట్ స్కామ్ స్వాహాలో హౌసింగ్ అధికారులతో గ్రామ వైసీపీ నాయకులు చేతులు కలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పేరుతో ప్రవేశపెట్టిన జగనన్న ఇళ్ళ పధకానికి ప్రభుత్వ అధికార యంత్రాంగం, వైసీపీ నాయకులే తూట్లు పొడవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.