YSRCP: వైసీపీకి ఎందుకు ఓటు వేయకూడదో ఒక్క మాట చెప్పండి: బొత్స సత్యనారాయణ
ABN , Publish Date - Dec 14 , 2023 | 06:14 PM
వైసీపీకి ఎందుకు ఓటు వేయకూడదో ఒక్క మాట చెప్పాలని ఏపీ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అనేక పథకాలు, హాస్పిటల్స్, పాఠశాలల్లో మార్పలు చూస్తే తమ పాలన ఏంటో తెలుస్తుందని అన్నారు.
విజయవాడ: వైసీపీకి ఎందుకు ఓటు వేయకూడదో ఒక్క మాట చెప్పాలని ఏపీ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అనేక పథకాలు, హాస్పిటల్స్, పాఠశాలల్లో మార్పలు చూస్తే తమ పాలన ఏంటో తెలుస్తుందని అన్నారు. విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని అన్నామని, బెల్ట్ షాప్స్ లేవని, పేద వాడికి మద్యం అందకుండా షాక్ కొట్టేలా రేట్ పెంచామని బొత్స అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగం అని జగన్ అన్నారుగా అని మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. వైసీపీ మార్చిన 11 మంది అభ్యర్థుల్లో 2 సీట్లు కొత్తవారికి ఇచ్చామని, ఇద్దరు కూడా బీసీ అభ్యర్థులేనని అన్నారు. ఆశా వర్కర్స్‌కి తమ ప్రభుత్వంలో మంచి లబ్ది జరిగిందని, వాళ్ల నిరసన పట్ల ఒకసారి వాళ్లే అర్థం చేసుకోవాలని అన్నారు. తుపానుల సమయంలో ప్రజల రక్షణ అనేది ప్రభుత్వం చేయాల్సిన మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాత నష్టాలు, ఇతర విషయాలు గురించి పట్టించుకుంటామని మంత్రి బొత్స చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు..
మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై మంత్రి బొత్స సత్యానారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెల్లని నాణెం చంద్రబాబు గతంలో 175 మంది పోటీ చేస్తే ఏం అయిందో చూశామని దురుసు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట నెలబెట్టుకోలేదు కాబట్టే చంద్రబాబు ఓడిపోయారని, తమ పాలనలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇంకో మూడునెలలు తర్వాత టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండదన్నారు. చంద్రబాబు సీటుకే దిక్కు లేదని, ఇక టీడీపీ 175 ఎక్కడ గెలుస్తుందని విమర్శించారు. ఓడిపోతాడు కాబట్టి చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేస్తున్నాడని అన్నారు. పొలిటికల్ పరిస్థితి వలన ప్రతిపార్టీలో మార్పులు జరగడం కామన్ అని, పార్టీలో కొత్త ఇంచార్జ్‌ని పెట్టారు కాబట్టి కొంతమంది వైసీపీ వాళ్లు వేరే పార్టీలోకి వెళ్లారని, వైసీపీలో నాయకులు చాలా సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇంకో 20 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. అదృష్టం బాగుంటే తాను మంత్రిగా ఉంటానేమోనని, బీఆర్ఎస్ పార్టీకి తమకు ఏం సంబంధమని, రాష్టం వేరని అన్నారు.