ఎస్‌ఐ ఉద్యోగాల రాత పరీక్ష.. నిబంధనలివే..
ABN , First Publish Date - 2023-02-18T20:58:13+05:30 IST
ఎన్టీఆర్ జిల్లా (NTR district) కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరిగే ఎస్‌ఐ (SI) ఉద్యోగాల రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు వివిధ ప్రాంతాల నుంచి మొత్తం..
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా (NTR district) కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరిగే ఎస్‌ఐ (SI) ఉద్యోగాల రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 12,950 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల పరిధిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది. తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలి. మధ్యాహ్నం నుంచి పరీక్షలు రాసే అభ్యర్థులు ఒంటిగంటకే రావాలి. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించాకే కేంద్రాల్లోకి పంపుతారు. అభ్యర్థులు సెల్‌ఫోన్లు (Cell phones), ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టాప్‌వాచ్‌లు వంటివి తీసుకురాకూడదని సూచించారు. ఒకవేళ ఎవరైనా వాటిని తీసుకొస్తే డిపాజిట్ చేయడానికి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. కేంద్రాలకు చుట్టుపక్కల ఉన్న ఇంటర్నెట్, జిరాక్స్ (Internet Xerox) షాపులను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి వాహనాలను నిలుపుదల చేయొద్దని ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఇన్‌స్పెక్టర్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్షలకు గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు.