Yamini Sharma: పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ తుంగలో తొక్కారు
ABN , Publish Date - Dec 23 , 2023 | 06:00 PM
వైసీపీ, టీడీపీ కేంద్ర పథకాలను తమ ప్రభుత్వ స్టిక్కర్లుగా వాడుకోవడం సిగ్గుచేటు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ అన్నారు.
విజయవాడ: వైసీపీ, టీడీపీ కేంద్ర పథకాలను తమ ప్రభుత్వ స్టిక్కర్లుగా వాడుకోవడం సిగ్గుచేటు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ అన్నారు. ప్రజలను ఎల్లప్పుడూ ముసుగులో ఉంచలేరని, వికసిత్ భారత్ ద్వారా వారి ముసుగులు తొలగిపోతున్నాయని, ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అర్ధమైపోయిందని ఆమె అన్నారు. కరెంట్ బిల్లులు చూస్తేనే రాష్ట్రంలో కరెంట్ షాక్ కొడుతుందని, యూజర్, ఇతరత్రా ఛార్జీలు వసూలు చేస్తుండడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ ఫ్యాన్ తిరిగితే సామాన్యుడి రెక్కలు ఫ్యాన్ ఆగిపోయే పరిస్ధితి తలెత్తిందని మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయిపై కూంబింగ్ చేసిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో అన్నం కంటే మందు, గంజాయి మాత్రం దొరుకుతుందని మండిపడ్డారు.
విద్యుత్ చార్జీలను తగ్గించాలని, గంజాయి రహిత ఏపీగా తీర్చిదిద్దేందుకు బీజేపీ ప్రజల మద్దతుతో ఉద్యమిస్తుందని, అంగన్ వాడీల జీత భత్యాలను 70 శాతం కేంద్రం ఇస్తుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన 30శాతం పెట్టకపోవడం వలనే అంగన్ వాడీ వర్కర్లు రోడ్డెక్కారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ తుంగలో తొక్కారని యామిని శర్మ విమర్శించారు.