Adani Group: అదానీ గ్రూప్ దందాలు నిజమే!
ABN , First Publish Date - 2023-08-29T04:13:07+05:30 IST
అదానీ గ్రూప్(Adani Group)అడ్డంగా దొరికిపోయింది. హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలు(Hindenburg Report charges) అబద్దమని గగ్గోలు పెట్టిన అదానీ గ్రూప్ డొల్లతనాన్ని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ దర్యాప్తు (SEBI investigation)బట్టబయలు చేసింది.
అడ్డగోలుగా నిబంధనలకు పాతర.. సంబంధిత పార్టీలతో లావాదేవీలు
ఆఫ్‌షోర్ ఫండ్స్ ద్వారానూ దందా.. నిజాలు నిగ్గు తేల్చిన సెబీ దర్యాప్తు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్(Adani Group)అడ్డంగా దొరికిపోయింది. హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలు(Hindenburg Report charges) అబద్దమని గగ్గోలు పెట్టిన అదానీ గ్రూప్ డొల్లతనాన్ని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ దర్యాప్తు (SEBI investigation)బట్టబయలు చేసింది. ఒకటి కాదు, రెండు కాదు.. సంబంధిత పార్టీలతో ఏకంగా 13 లావాదేవీలు జరిపిందని సెబీ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో ‘సంబంధిత’ పార్టీలతో అదానీ గ్రూప్ కంపెనీలు లావాదేవీలు జరిపాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలు పూర్తిగా అబద్దమని, ఒకవేళ ఏవైనా చిన్నచిన్న లావాదేవీలు జరిగినా.. వెంటనే వాటిని గుర్తించి నిబంధనల ప్రకారం ఆ వివరాలు సెబీకి వెల్లడించామని అదానీ గ్రూప్ అప్పట్లో అడ్డగోలుగా వాదించింది. అయితే సెబీ దర్యాప్తులో ఈ వాదన నిజం కాదని తేలినట్టు తెలుస్తోంది. సెబీ ఇంకా ఈ నివేదికను అధికారికంగా వెల్లడించలేదు.
ఆఫ్‌షోర్ ఫండ్స్ పాత్ర: ఆఫ్‌షోర్ ఫండ్స్ (Offshore Funds)ద్వారా అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్లను అడ్డగోలుగా పెంచుకుందన్నది హిండెన్‌బర్గ్ నివేదిక మరో ఆరోపణ. ఇది కూడా కుట్రపూరిత ఆరోపణ అని అదానీ గ్రూప్ అప్పట్లో కబుర్లు చెప్పింది. ఈ ఆరోపణ కూడా నిజమనేందుకు అవసరమైన ఆధారాలు సెబీకి లభించినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం ఆఫ్‌షోర్ ఫండ్స్ ఏవీ భారత లిస్టెడ్ కంపెనీల ఈక్విటీలో ఎఫ్‌పీఐల ద్వారా 10 శాతం వాటాకు మించి కొనుగోలు చేయరాదు. అంతకు మించితే ఆ విషయాన్ని వెంటనే సంబంధిత కంపెనీ వెంటనే రెగ్యులేటరీ సంస్థలకు తెలియజేయాలి. అప్పుడు ఆ పెట్టుబడులను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)గా పరిగణిస్తారు. ఈ విషయంలోనూ అదానీ గ్రూప్ నిబంధనలను అడ్డగోలుగా తుంగలో తొక్కినట్టు సెబీ గుర్తించింది.
నేడు విచారణ: మరోవైపు సుప్రీంకోర్టులో మంగళవారం అదానీ గ్రూప్ పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల కేసు విచారణకు వస్తోంది. దీనిపై తమ దర్యాప్తు కూడా దాదాపు పూర్తయిందని సెబీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో సెబీ, సుప్రీం కోర్టు.. అదానీ గ్రూప్ అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్న ఆతృత నెలకొంది. కాగా అదానీ గ్రూప్ మాత్రం ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.