HCL Foundation: హెచ్‌సీఎల్ గ్రాంట్ గ్రహీతల వెల్లడి
ABN , First Publish Date - 2023-02-27T21:09:14+05:30 IST
తమ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన హెచ్‌సీఎల్ గ్రాంట్ 2023 ఎడిషన్ కోసం ఎన్జీవోలను ఎంపిక చేసినట్టు హెచ్‌సీఎల్ ఫౌండేషన్(HCL Foundation) ప్రకటించింది
న్యూఢిల్లీ: తమ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన హెచ్‌సీఎల్ గ్రాంట్ 2023 ఎడిషన్ కోసం ఎన్జీవోలను ఎంపిక చేసినట్టు హెచ్‌సీఎల్ ఫౌండేషన్(HCL Foundation) ప్రకటించింది. దేశంలో పర్యావరణ అనుకూల గ్రామీణాభివృద్ధికి హెచ్‌సీఎల్ గ్రాంట్ అందిస్తుంది. ఇందులో భాగంగా మూడు ఎన్జీవోలు.. ప్లానెట్ ఎర్త్, ఇన్నోవేటర్స్ ఇన్ హెల్త్ (IIH) ఇండియా, మేఘ్‌శాల ట్రస్ట్‌లు ఒక్కోదానికి రూ. 5 కోట్ల చొప్పున హెచ్‌సీఎల్ గ్రాంట్ ఎండోమెంట్ కింద తమ ప్రాజెక్టులను అందుకున్నాయి. 15 వేల సంస్థలు పంపిన దరఖాస్తుల నుంచి ఈ ఏడాది విజేతలను ఎంపిక చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య 80 శాతం పెరగడం గమనార్హం.
ఈ సందర్భంగా హెచ్‌సీఎల్ టెక్ బోర్డు సభ్యురాలు, హెచ్‌సీఎల్ గ్రాంట్ జ్యూరీ చైర్ పర్సన్ రాబిన్ అన్ అబ్రామ్స్ మాట్లాడుతూ.. ఈ సంస్థలు, వాటి ప్రాజెక్టులు హెచ్‌సీఎల్ ఫౌండేషన్ దృష్టి సారించిన అత్యంత కీలకమైన విభాగాలైన పర్యావరణం, ఆరోగ్యం, విద్యకు అనుగుణంగా ఉన్నట్టు చెప్పారు. వారి కార్యకలాపాలు గ్రామీణ సమాజంలో ఆరోగ్య సంరక్షణ పరంగా అసమానతలను తొలగించడం, మంచినీటి పొదుపులో సహాయపడటం, బీద వర్గాల ప్రజలకు విద్యను అందించడం ద్వారా అతి ముఖ్యమైన జీవనాధారాన్ని అందిస్తుందని తాము విశ్వసిస్తున్నట్టు చెప్పారు.
హెచ్‌సీఎల్ గ్రాంట్ ప్రోగ్రామ్ 8 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ. 130 కోట్లను ఎన్జీవోలకు హెచ్‌సీఎల్ అందించింది. ఫలితంగా 1.8 మిలియన్ల మంది లబ్ధిదారులు, దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 25వేల గ్రామాలకు చేరుకోగలిగింది. వర్చువల్‌గా నిర్వహించిన అవార్డుల ఫంక్షన్‌కు హెచ్‌సీఎల్ ఫౌండేషన్, గ్లోబల్ సీఎస్‌ఆర్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నిధి పున్ధీర్, పలువురు ఎన్‌జీఓల ప్రతినిధులు, హెచ్‌సీఎల్, హెచ్‌సీఎల్ టెక్, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. అవార్డు గ్రహీతలకు వాటిని గ్రాంట్ థోరంటన్-ఆడిటెడ్ ప్రక్రియలో అందించారు.