Sensex Nifty: బుల్ రంకెలు.. తొలిసారి సెన్సెక్స్@64K, నిఫ్టీ@19K
ABN , First Publish Date - 2023-06-28T15:53:20+05:30 IST
బుల్ రంకెలేస్తోంది... నయా రికార్డులను సృష్టిస్తూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది... గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ ఫండ్స్ వెల్లువ ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ (BSE Sensex) చరిత్రలో తొలిసారి 64 వేల మార్క్‌ను తాకింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ మొట్టమొదటిసారి 19 వేల మార్క్‌ను ముద్దాడింది.
ముంబై: బుల్ రంకెలేస్తోంది... నయా రికార్డులను సృష్టిస్తూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది... గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ ఫండ్స్ ఇన్‌ఫ్లో వెల్లువ ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ (BSE Sensex) చరిత్రలో తొలిసారి 64 వేల మార్క్‌ను తాకింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ మొట్టమొదటిసారి 19 వేల మార్క్‌ను ముద్దాడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బడా స్టాక్స్‌లో కొనుగోళ్లు ఊపందుకోవడం కూడా మార్కెట్ల వృద్ధికి దోహదపడింది. క్రితం రోజు లాభాలను కొనసాగింపుగా బుధవారం 63,151 పాయింట్ల వద్ద ఓపెన్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 945.42 పాయింట్లు లేదా 1.50 శాతం మేర లాభపడింది. చివరికి 63,915 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తొలసారి 64 వేల మార్క్‌ను సూచీ తాకింది. నిఫ్టీలోనూ ఇదే దూకుడు కనిపించింది. ఉదయం 18,748 పాయింట్ల వద్ద ఓపెన్ అయిన సూచీ 280.90 పాయింట్లు లేదా 1.50 శాతం మేర వృద్ధి చెంది 18,972 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తొలిసారి 19 వేల మార్క్‌ను తాకడం గమనార్హం.
సంస్థాగత, రిటైల్/హెచ్‌ఎన్‌ఐ విభాగాల్లో కొనుగోళ్ల ఊపందుకోవడం. అమెరికా ఆర్థిక డేటా మెరుగవ్వడం, చైనా మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకోబోతోందని సంకేతాలు మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా సెన్సెక్స్ ప్యాక్‌లో ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, టైటాన్, ఎల్అండ్‌టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్ గ్రిడ్ అత్యధికంగా లాభపడిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. కాగా విప్రో స్వల్పంగా లాభపడగా, టెక్ మహింద్రా షేర్లు స్వల్ప నష్టంలో ముగిసింది.
కాగా గ్లోబల్ మార్కెట్ల విషయానికి వస్తే ఏసియాలో టోక్యో, హాంగ్‌కాంగ్ మార్కెట్లు లాభాల్లో ముగియగా.. సియోల్, షాంఘై సూచీలు మాత్రం నష్టాల్లో ముగిశఆయి. ఇక యూరోపియన్ మార్కెట్ల లాభాల్లో పయనించగా. యూఎస్ మార్కెట్లు మంగళవారం గణనీయ లాభాలతో ముగిశాయి.
ఇక 0.08 శాతం స్వల్ప పెరుగుదలతో గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 72.32కు చేరింది. ఎక్స్చేంజ్ డేటా ప్రకారం.. ఎఫ్ఐఐలు (Foreign institutional investors) మంగళవారం ఒక్క రోజే ఏకంగా రూ.2,024.05 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.