IRCTC: భక్తులకు గుడ్‌న్యూస్.. రూ.14వేలకే ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం

ABN , First Publish Date - 2023-07-13T17:00:06+05:30 IST

ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ ప్యాకేజీలో భాగంగా తమిళనాడులోని అరుణాచలం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తంజావూరు.. కేరళలోని తిరువనంతపురం ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఆగస్టు 9న ఈ యాత్ర ప్రారంభం అవుతుందని.. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా రైలు ప్రయాణిస్తుందని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.

IRCTC: భక్తులకు గుడ్‌న్యూస్.. రూ.14వేలకే ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం

దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని భావించే భక్తులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ అందించింది. తమిళనాడు, కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కేవలం రూ.14వేలు మాత్రమే చెల్లించి దర్శించుకోవచ్చని సూచించింది. ఈ మేరకు దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరుతో ప్రత్యేకంగా ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు కొనసాగుతుందని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.

ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ ప్యాకేజీలో భాగంగా తమిళనాడులోని అరుణాచలం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తంజావూరు.. కేరళలోని తిరువనంతపురం ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఆగస్టు 9న ఈ యాత్ర ప్రారంభం అవుతుందని.. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా రైలు ప్రయాణిస్తుందని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. సికింద్రాబాద్‌లో బయలుదేరనున్న ఈ రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌ల మీదుగా వెళ్తుందని తెలిపింది. ఈ టూర్ ప్యాకేజీ కింద ప్రయాణించేవారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందని పేర్కొంది. మూడు ప్యాకేజీల కింద టూర్ ఉంటుందని.. ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీల కింద ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ సూచించింది. ఎకానమీలో పెద్దలకు టిక్కెట్ ధర రూ.14,300, చిన్నారులకు టిక్కెట్ ధర రూ.13,300 ఉంటుందని.. స్టాండర్డ్‌లో పెద్దలకు టిక్కెట్ ధర రూ.21,900, చిన్నారులకు టిక్కెట్ ధర రూ.20,800.. కంఫర్ట్‌లో పెద్దలకు టిక్కెట్ ధర రూ.28,500, చిన్నారులకు టిక్కెట్ ధర రూ.27,100 చెల్లించాలని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Health Tips: ఈ బామ్మ వయసు వందేళ్లు.. ఉద్యోగానికీ వెళ్తోంది.. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ బామ్మ చెప్పిన చిట్కా ఏంటంటే..!

ఆగస్టు 9న మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక రైలు ప్రారంభం అవుతుంది. రెండో రోజు ఉదయం 7 గంటలకు భక్తులు అరుణాచలం చేరుకుంటారు. అక్కడి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకుని మధురై వెళ్తారు. మూడోరోజు ఉదయం 8 గంటలకు మధుర మీనాక్షి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం బస్సులో రామేశ్వరం చేరుకుంటారు. ఆరోజు రాత్రి అక్కడే బస చేస్తారు. నాలుగో రోజు ఉదయం రామేశ్వరం ఆలయాన్ని దర్శించుకుని ఆ తర్వాత తిరిగి మధురై చేరుకుంటారు. అక్కడి నుంచి రైలులో కన్యా్కుమారి వెళ్తారు.

ఐదోరోజు కన్యాకుమారిలో త్రివేణి సంగమాన్ని సందర్శించి అక్కడి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆరోజు రాత్రికి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం రైలులో తిరువనంతపురం వెళ్తారు. ఆరో రోజు ఉదయం పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత కోవలం బీచ్‌కు చేరుకుంటారు. అనంతరం తిరువనంతపురం రైల్వేస్టేషన్ నుంచి తిరుచిరాపల్లికి వెళ్తారు. ఏడోరోజు ఉదయం శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుని అక్కడి నుంచి తంజావూరు చేరుకుంటారు. 8వ రోజు ఉదయం అక్కడి బృహదీశ్వరాలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత తంజావూరు నుంచి 9వ రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. కాగా ఈ టూర్ ప్యాకేజీలో ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఐఆర్‌సీటీసీనే సమకూరుస్తుంది. ప్యాకేజీని బట్టి ప్రయాణానికి వాహనం సమకూరుస్తారు. పర్యాటక ప్రదేశంలో ప్రవేశ టిక్కెట్ ఛార్జీలను యాత్రికులే భరించాలి.

Updated Date - 2023-07-13T17:02:46+05:30 IST