RBI: రూ.2 వేల నోటు ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు...
ABN , First Publish Date - 2023-06-26T19:03:35+05:30 IST
ఉన్నపళంగా రూ.2 వేల నోటు ఉపసంహరించడం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏమైనా ప్రభావం చూపుతుందా?.. అనే ప్రశ్నకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shakthikanth Das) సమాధానమిచ్చారు. పెద్ద నోటు ఉపసంహరణ నిర్ణయం ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే మూడింట రెండొంతుల రూ.2000 నోట్లు వ్యవస్థలోకి వచ్చిచేరాయని తెలిపారు.
ముంబై: ఉన్నపళంగా రూ.2 వేల నోటు ఉపసంహరించడం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏమైనా ప్రభావం చూపుతుందా?.. అనే సందేహాలకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shakthikanth Das) సమాధానమిచ్చారు. పెద్ద నోటు ఉపసంహరణ నిర్ణయం ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే మూడింట రెండొంతుల రూ.2000 నోట్లు వ్యవస్థలోకి వచ్చిచేరాయని తెలిపారు. ఇది అకస్మాత్తు నిర్ణయమే అయినప్పటికీ... క్లీన్ నోట్ పాలసీలో భాగంగా మే 19న నిర్ణయాన్ని ప్రకటించామని స్పష్టతనిచ్చారు. కాగా మార్చి 31, 2023 నాటికి రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయని చెప్పారు.
గతవారం సగం నాటికి మూడింట రెండొంతుల పైగా లేదా రూ.3.62 లక్షల కోట్లలో రూ.2.41 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు వ్యవస్థలోకి వచ్చాయని వివరించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయనీ విషయాలు తెలిపారు. రూ.2 వేల నోట్ల మార్పిడీకి సెప్టెంబర్ 30, 2023 చివరి తేదీ అయినప్పటికీ ఈ నోట్ల మార్పిడికీ జనాలు ఎగబడుతున్నారని చెప్పారు.
ఇక రెండు వేల నోట్ల ఉపసంహరణ ద్రవ్య స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. వ్యయాలు భారీగా పెరగనున్నాయంటూ ఇటివల వెలువడిన ఓ రిపోర్ట్ విశ్లేషణను ఆయన తోసిపుచ్చారు. ఆర్బీఐ ఆర్థిక పురోగతికి తోడ్పడుతుందని, వృద్ధి రేటు అంచనా 6.5 శాతానికి మించి ఉండొచ్చని లెక్కగట్టారు.
మార్చి 31 నాటికి ఉన్న నోట్లలో తిరిగొచ్చినవి 50 శాతమని తెలిపారు. తిరిగి వ్యవస్థలోకి వచ్చిన నోట్లలో 85 శాతం డిపాజిట్లు కాగా మిగతావి నోట్ల మార్పిడి జరిగిందని ఆర్బీఐ డేటా తెలిపింది. జూన్ 8న మోనిటరీ పాలసీ భేటీ నాటికి రూ.1.8 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు సర్క్యూలేషన్‌లోకి వచ్చాయని సమాచారమిచ్చిన విషయం తెలిసిందే.