RBI MPC Meet 2023: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన.. ఈఎంఐలు మరింత భారం
ABN , First Publish Date - 2023-02-08T10:54:56+05:30 IST
బ్యాంకులకు ఆర్బీఐ (RBI) అందించే స్వల్పకాలిక రుణాలపై విధించే రెపో రేటు (Repo rate) మరో 25 బేసిస్ పాయింట్లు మేర పెరిగింది.
ముంబై: బ్యాంకులకు ఆర్బీఐ (RBI) అందించే స్వల్పకాలిక రుణాలపై విధించే రెపో రేటు (Repo rate) మరో 25 బేసిస్ పాయింట్లు మేర పెరిగింది. ఈ మేరకు ఆర్బీఐ మోనిటరీ పాలసీ కమిటీ (RBI MPC committee) నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో రెపో రేటు 6.50 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంలో భాగంగా సర్దుబాటు వైఖరిని తిరిగి కొనసాగించాలని భావించినట్టు, అందులో భాగంగానే రెపో రేటు పెంపునకు నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ (Shakthikanth Das) వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడం సబబేనని భావించినట్టు, ద్రవ్యోల్బణం విషయంలో ఆర్బీఐ మోనిటరీ కమిటీ మున్ముందు కూడా చురుకుగానే వ్యవహరిస్తుందని తెలిపారు. కాగా రెపో రేటు పెంపు ప్రభావంతో రుణగ్రహీతలపై భారం పడనుంది. ఆర్బీఐ విధించే వడ్డీ రేట్లను బ్యాంకులు రుణగ్రహీతలపై విధిస్తాయి. ఫలితంగా ఇప్పటికే ఖాతాదారులు చెల్లిస్తున్న ఈఎంఐలు మరింత పెరగే అవకాశాలున్నాయి. కాగా ఆరుగురు సభ్యుల్లో నలుగురు రెపో రేటు పెంపునకు అనుకూలంగా ఓటు వేశారు. కాగా ఆర్థిక నిపుణులు అంచనా వేసినట్టుగానే గతేడాది మే నుంచి ఇప్పటివరకు రెపోరేటు ఏకంగా 250 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది.
కాగా ఆర్థిక సంవత్సరం 2024లో రియల్ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అంచనా వేశారు. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో ఇది 7.8 శాతంగా నమోదవ్వొచ్చని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం 2023లో ద్రవ్యోల్బణం 6.50 శాతంగా ఉండొచ్చని అన్నారు. గతంలో మాదిరిగా గ్లోబల్ ఎకానమీ పరిస్థితి అంత బాగాలేదన్నారు. అంతర్జాతీయంగా బలహీనమైన డిమాండ్ కొనసాగుతోందని, ఈ పరిణామం దేశీయ వృద్ధి రేటును వెనక్కి లాగే అవకాశం ఉందన్నారు. అయితే గ్రామీణ భారతం డిమాండ్ ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంకేతమని, కార్యకలాపాలు ఊపందుకుంటున్నట్టు భావించొచ్చని వెల్లడించారు.
ఆసియాలోని ఇతర దేశాలతో పోల్చితే ఈ ఏడాది భారతీయ రూపీ అనిశ్చితి తక్కువగానే ఉందన్నారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్‌ను తిరిగి కరోనా ముందునాటి స్థాయి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించనున్నట్టు ప్రకటించారు.
విదేశాలు వెళ్లేవారికీ యూపీఐ సేవలు...
ఈ ఎంపీసీ భేటీలో ఆర్బీఐ మరిన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. విదేశాలు వెళ్లే భారతీయులకు కూడా యూపీఐ (UPI) పేమెంట్ సేవలు అందించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత జీ20 దేశాలకు వెళ్లే భారతీయులకు ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఇక ఆర్బీఐ సంవత్సరం 2022-23 రెండవ అర్ధభాగంలో కరెంట్ ఖాతా లోటు మోస్తరుగా ఉందని, సమర్థవంతంగా నిర్వహించొచ్చునని తెలిపారు.