Rupee falls: రూపాయి విలువ భారీగా పతనం.. ఏ స్థాయికి క్షీణించిందంటే..
ABN , First Publish Date - 2023-07-05T17:32:47+05:30 IST
దేశీయ కరెన్సీ రూపాయి విలువ (Rupee fall) నష్టాల బాటలో కొనసాగుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలపడడం, క్రూడాయిల్ ధరలు కూడా భారీగా పెరగడం రూపీ విలువ క్షీణతకు ప్రధాన కారణాలయ్యాయి. బుధవారం ఒక్క రోజే ఏకంగా 22 పైసలు మేర పతనమయ్యి డాలర్ మారకంలో 82.23 వద్ద ముగిసింది.
ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి విలువ (Rupee fall) నష్టాల బాటలో కొనసాగుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలపడడం, క్రూడాయిల్ ధరలు కూడా భారీగా పెరగడం రూపీ విలువ క్షీణతకు ప్రధాన కారణాలయ్యాయి. బుధవారం ఒక్క రోజే ఏకంగా 22 పైసలు మేర పతనమయ్యి డాలర్ మారకంలో 82.23 వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్లు కూడా స్వల్ప నష్టాల్లో ముగియడం, దేశ స్థూలఆర్థిక డేటా కూడా నిరాశాజనకంగా ఉండడం కరెన్సీ విలువ తగ్గుదలకు పరోక్ష కారణాలయ్యాయి. బుధవారం ఇంట్రాడేలో రూపాయి విలువ గరిష్ఠంగా 82.05 తాకగా... కనిష్ఠంగా 82.25 స్థాయిని చవిచూసింది. ఆ తర్వాత స్వల్పంగా రికవరీ అయ్యి 82.23 వద్ద ముగిసింది. మొత్తంగా క్రితం సెషన్‌తో పోల్చితే 22 పైసల నష్టపోయినట్టయ్యింది. కాగా మంగళవారం సెషన్‌లో రూపీ వ్యాల్యూ 82.01 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. మరోవైపు గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ ‘బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్’ 0.22 శాతం క్షీణించి బ్యారెల్ 76.08 డాలర్లుగా ఉంది.
రూపాయి పతనంపై షేర్‌ఖాన్ సంస్థ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి విశ్లేషిస్తూ.. దేశీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కనిపిస్తుండడం, దేశ స్థూల ఆర్థిక డేటా నిరుత్సాహకరంగా ఉండడం కారణమన్నారు. జూన్‌లో భారతీయ సేవలు, పీఎంఐ సూచీలు బలహీనంగా ఉన్నాయని చెప్పారు. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ సూచీ మే నెలలో 61.2 శాతంగా ఉండగా జూన్‌లో ఇది 58.5కి పడిపోయిందని ప్రస్తావించారు.