Tesla: భారత్‌లో కారు ఫ్యాక్టరీ ఏర్పాటుకు టెస్లా చర్చలు.. కారు ప్రారంభ ధర ఎంతో తెలుసా...?

ABN , First Publish Date - 2023-07-13T11:48:11+05:30 IST

లగ్జరీ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా (Tesla) విస్తరణలో భాగంగా భారత్‌లోనూ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు పెట్టుబడుల ప్రతిపాదనపై భారత ప్రభుత్వంతో చర్చిస్తోంది. ఏడాదికి 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీ ఏర్పాటు చర్చిస్తున్నట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ రిపోర్ట్ పేర్కొంది.

Tesla: భారత్‌లో కారు ఫ్యాక్టరీ ఏర్పాటుకు టెస్లా చర్చలు.. కారు ప్రారంభ ధర ఎంతో తెలుసా...?

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా (Tesla) విస్తరణలో భాగంగా భారత్‌లోనూ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు పెట్టుబడుల ప్రతిపాదనపై భారత ప్రభుత్వంతో చర్చిస్తోంది. ఏడాదికి 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీ ఏర్పాటు చర్చిస్తున్నట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ రిపోర్ట్ పేర్కొంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధర 24,400 డాలర్లతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని రిపోర్ట్ పేర్కొంది. అంటే భారతీయ కరెన్సీలో రూ.20 లక్షలుగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా గురువారం ఒక రిపోర్ట్‌ను ప్రచురించింది. అయితే ఈ రిపోర్టులపై టెస్లా స్పందించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటివల అమెరికా పర్యటనలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన నేపథ్యంలో తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది.

కాగా భారత్‌లో పెద్ద సంఖ్యలో కార్లు ఉత్పత్తి చేయాలనుకుంటున్న టెస్లా.. భారత్‌ బేస్‌‌గా ఎగుమతులు కూడా చేయాలనుకుంటోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు భారత్ నుంచే ఎగుమతి చేయాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇక భారత్‌లో పన్నులు చాలా ఎక్కువగా ఉంటాయని గతంలో పలు సందర్భాల్లో ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. తొలుత కొన్ని కార్లు విక్రయించి.. ఆదరణకు అనుగుణంగా ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంపై ఓ నిర్ణయానికి వస్తామని ఎలాన్ మస్క్ చెప్పారు. అయితే భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుపై క్లారిటీ ఇస్తే పన్నులపై ఆలోచిస్తామని కేంద్ర ప్రభుత్వవర్గాలు అప్పట్లో తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-07-13T11:59:23+05:30 IST