Burgampad: పోలీసుల అదుపులో నకిలీ విలేకరులు

ABN , First Publish Date - 2023-09-15T11:06:13+05:30 IST

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను డబ్బులు డిమాండ్‌ చేసిన ముగ్గురు నకిలీ విలేకరులను గురువారం బూర్గంపాడు పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.

Burgampad: పోలీసుల అదుపులో నకిలీ విలేకరులు

- ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి డబ్బులు డిమాండ్‌

బూర్గంపాడు(భద్రాద్రి కొత్తగూడెం): ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను డబ్బులు డిమాండ్‌ చేసిన ముగ్గురు నకిలీ విలేకరులను గురువారం బూర్గంపాడు పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. బాధితుల తెలిపిన వివరాలు ప్రకారం.... బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక పంచాయతీలో గల లెనిన్‌నగర్‌ ఎంపీపీ పాఠశాలకు బుధవారం ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. విలేకరులమని పాఠశాలలోని ఉపాధ్యాయులను డబ్బులు డిమాండ్‌ చేశారు. ప్రముఖ చానళ్లలో పని చేస్తున్నామని తమకు హైదారాబాద్‌(Hyderabad)లో జరిగే సమావేశానికి వెళ్లడానికి పలు పాఠశాలలోని ఉపాధ్యాయులు ఆర్థికసాయం చేశారని మీరు కూడా డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సదరు ఉపాధ్యాయురాలు ప్రస్తుతం తమ వద్ద డబ్బులు లేవని తెలపడంతో ఆన్‌లైన్‌ ట్రాన్స్‌పర్‌ చేయాలని ఫోన్‌ఫే నెంబరును ఇచ్చి వెళ్లినట్లు ఉపాధ్యాయురాలు తెలిపారు. సాయంత్రం సమాయానికి డబ్బులు పంపకపోవడంతో వారు ఉపాధ్యాయురాలికి ఫోన్‌ చేశారు.

అనుమానం వచ్చిన ఉపాధ్యాయురాలు స్థానికుల దృష్టికి తీసుకెళ్లింది. డబ్బులను ట్రాన్స్‌పర్‌ చేయకపోవడంతో వారు ఇద్దరు పాటు మరో వ్యక్తి కలిసి మొత్తం ముగ్గురు గురువారం పాఠశాలకు వెళ్లారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని వారిని ఆదుపులోకి తీసుకుని విచారించారు. ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లా ఎటపాక మండలం గుండాలకు చెందిన బుయ్యన వీరబాబు, ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వేలేరు గ్రామానికి చెందిన సత్యనారాయణ విలేకరులుగా భద్రాచలానికి చెందిన యాస జయబాబు ఓ పార్టీ నాయకుడిగా వచ్చినట్లు తెలుసుకున్నారు. వారి వద్ద ఉన్న కార్డులను స్వాదీనం చేసుకున్నారు. పోలీసుస్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన ముగ్గురు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కూడా పలుమార్లు ఈ ముగ్గురు బూర్గంపాడు, భద్రాచలం, పాల్వంచ, అశ్వాపురం మండలాల పరిధిలో వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది.

Updated Date - 2023-09-15T11:06:13+05:30 IST