Daughter of retired SI: ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి.. ఉన్నదంతా పోగొట్టుకొని.. రిటైర్డ్ ఎస్‌ఐ కుమార్తె అడ్డదారులు
ABN , Publish Date - Dec 28 , 2023 | 11:05 AM
పెద్ద కుమార్తె చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆన్‌లైన్ గేమ్(Online game)లకు అలవాటు పడింది. లక్షల ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. దీంతో లిఫ్ట్ అడిగి దోపిడీ చేసేందుకు సిద్ధమైంది.
- లిఫ్ట్ అడిగి దోపిడీ.. అరెస్టు
బంజారాహిల్స్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): పెద్ద కుమార్తె చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆన్‌లైన్ గేమ్(Online game)లకు అలవాటు పడింది. లక్షల ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. దీంతో లిఫ్ట్ అడిగి దోపిడీ చేసేందుకు సిద్ధమైంది. బంజారాహిల్స్‌లో ఓ వ్యక్తి వద్ద డబ్బు లాగిన ఆమెను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితురాలు విశ్రాంత ఎస్‌ఐ కుమార్తె(Daughter of retired SI) కావడం గమనార్హం. బేగంపేట రసూల్‌పురలో నివాసముండే గుత్తి జంగయ్య గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఈ నెల 24న ద్విచక్రవాహనంపై ఆఫీసుకు వెళ్లాడు, విధులు ముగించుకొని గచ్చిబౌలి(Gachibowli) నుంచి ఇంటికి బయలు దేరాడు. ఎస్‌ఎన్‌టీ చౌరస్తాకు రాగానే ఓ మహిళ లిఫ్ట్ కావాలని కోరింది. దీంతో జంగయ్య ఆమెను ఎక్కించుకొని బంజారాహిల్స్ ముగ్ధా షోరూమ్ వరకు వచ్చి వాహనం ఆపాడు. కిందకు దిగిన మహిళ తనకు డబ్బులు కావాలని అడిగింది. జంగయ్య రూ.50 తీసి ఇచ్చాడు. మహిళ వినిపించుకోకుండా అతడి సెల్‌ఫోన్, ద్విచక్రవాహనం తాళం తీసుకుంది. డబ్బులు ఇవ్వకపోతే దుస్తులు చించుకొని అరుస్తానంటూ బెదిరించింది. చేసేది లేక సమీపంలోని బ్యాంక్ ఏటీఎం నుంచి రూ.5వేలు తీసి ఇచ్చాడు. మహిళ ఇంకా కావాలని అడగడంతో రెండుసార్లు పది వేల చొప్పున డ్రా చేసి ఇచ్చాడు.
మహిళ ఇంకా కావాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. బ్యాంక్ ఖాతాలో డబ్బు అయిపోయిందని జంగయ్య చెప్పడంతో వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు చెప్పిన ముఖ కవళికలు, సీసీ కెమెరాలను పరిశీలించి, ఏటీఎం వద్ద సెల్‌ఫోన్ డంప్ ద్వారా నిందితురాలి ఫోన్ నెంబర్‌ను గుర్తించారు. దాని ద్వారా దోపిడీ చేసింది బొడిగె అర్చనగా తేలింది. ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా రెండు సంవత్సరాల క్రితం పెద్ద కుమార్తె మరణించినప్పటి నుంచి మానసికంగా కుంగిపోయి అందులో నుంచి బయటపడేందుకు ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడింది. సుమారు పది లక్షల రూపాయలు పోగొట్టుకుంది. అయినప్పటికీ గేమ్‌లు ఆడే అలవాటు వదలలేక లిఫ్ట్ నాటకం ఆడి దోపిడీలకు పాల్పడడం మొదలు పెట్టింది. నగరంలో సుమారు 35 మంది నుంచి ఇలా దోపిడీ చేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకుంది. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.