Crime News: తల్లిదండ్రులను, నాయనమ్మను చంపేసి కట్టు కథలు.. ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదంటూ కేసు.. తమ్ముడి ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ABN , First Publish Date - 2023-05-19T16:47:27+05:30 IST
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. మంచి పొజిషన్లో స్థిరపడాలని ఆశపడుతుంటారు. వారి కోసం తమ కష్టాన్ని
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. మంచి పొజిషన్లో స్థిరపడాలని ఆశపడుతుంటారు. వారి కోసం తమ కష్టాన్ని దారపోస్తుంటారు. ఇంత చేసినా కనీసం కృతజ్ఞత లేకుండా ఉంటారు కొంత మంది పిల్లలు. వృద్ధాప్యంలోకి వచ్చాక కనీసం పట్టించుకునే పరిస్థితే ఉండదు. ఇంకొందరు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వేసేస్తుంటారు. ఇంకొందరు వారిని కొట్టడం.. హింసించడం చేస్తుంటారు. ఇలా రకరకాలైన సంఘటనలు నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ కొడుకు చేసిన నిర్వాకంతో పోలీసులే నివ్వెరపోయారు.
నవమాసాలు మోసి కనీపెంచిన తల్లిదండ్రులతో పాటు నానమ్మను అత్యంత కిరాతంగా చంపేశాడు ఓ దుర్మార్గపు కొడుకు. అనంతరం కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామాలాడాడు. ఈ దారుణ సంఘటన ఛత్తీస్‌ఘడ్ (Chhattisgarh)లో చోటుచేసుకుంది.
మహాసముంద్ జిల్లాలోని పుట్కా గ్రామానికి చెందిన ప్రభాత్ భోయ్, అతడి భార్య జర్నా భోయ్, ప్రభాత్ తల్లి సులోచన కనిపించడం లేదని ప్రభాత్ కుమారుడు ఉదిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే ఉదిత్ తమ్ముడు అమిత్ ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు, నానమ్మ (parents and grandmother) కనిపించడం లేదని తెలుసుకున్నాడు. ఇంటి ప్రాంగణంలో రక్తపు మరకలు ఉండడాన్ని గమనించాడు. అలాగే ఇంటి వెనుక కర్రలు కాలిపోయి బూడిదగా ఉన్నట్లు చూశాడు. ఏం జరిగిందో తెలియక పోలీసులకు సమాచారం అందించాడు.
అమిత్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఇంటికి వచ్చి అన్నీ పరిశీలించారు. ఉదిత్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో భయపడ్డ ఉదిత్.. అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఇంట్లో ఎవరూ డబ్బులు ఇవ్వలేదని వాపోయాడు. అందుకోసమే ముగ్గుర్నీ చంపేసినట్లు ఉదిత్ పోలీసులకు తెలిపాడు. ఇక తండ్రి ప్రభాత్ భోయ్ తాగే అలవాటుతో తరచూ కోపంగా ఉండేవాడని.. ఇంటి వాతావరణం బాగుండదని చెప్పుకొచ్చాడు. మే 8వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో దాడి చేసి చంపేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. అనంతరం ఇంటి వెనుక ఉంచిన కలపను ఉపయోగించి ముగ్గురి మృతదేహాల (bodies)ను దహనం (burnt) చేసినట్లు వివరించాడు. కొసమెరుపు ఏంటంటే ముగ్గురు ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదని అనంతరం ఉదిత్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నిందితుడు కటాకటాలపాలయ్యాడు.