MLA Akbaruddin: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసు నమోదు
ABN , First Publish Date - 2023-11-23T08:33:27+05:30 IST
విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరించిన కేసులో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై
సంతోష్‌నగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరించిన కేసులో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష్ నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 21వ తేదీన రాత్రి మోయిన్‌బాగ్‌లో జరిగిన బహిరంగసభలో చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని పాటించాలని, మోడల్‌కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం సమయం మించిపోతున్నందున ఆయన ప్రసంగాన్ని ఆపాలని సంతోష్ నగర్ ఇన్‌స్పెక్టర్ పూసపాటి శివచంద్ర కోరారు. విధి నిర్వహణలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌పై అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను సైగ చేస్తే ఈ ప్రదేశం నుంచి పరిగెత్తవలసి వస్తుందని హెచ్చరించారు. తాను ప్రసంగించడానికి ఇంకా ఐదు నిమిషాలు మిగి లి ఉందని, ఎవరూ నన్ను ఆపలేరు అని అన్నారు. దీంతో సంతోష్ నగర్ ఇన్‌స్పెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సుమోటో కేసు కింద అక్బరుద్దీన్ ఒవైసీపై కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇన్‌స్పెక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు
అక్బరుద్దీన్ ఒవైసీ బహిరంగసభ ప్రసంగానికి ఆటంకం కలిగించిన సంతోష్ నగర్ ఇన్‌స్పెక్టర్ శివచంద్రపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ఎంఐఎం సామాజిక కార్యకర్త మహ్మద్ ఇమాద్ హుస్సేన్ సంతోష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఆర్వో అనుమతి తీసుకొని బహిరంగ సభ ఏర్పాటు చేశామని, సభలో ప్రజా సమస్యలను ఉద్దేశించి అక్బరుద్దీన్ ప్రసంగిస్తుండగా ఇన్‌స్పెక్టర్ శివచంద్ర తన సిబ్బందితో కలిసి సభకు ఆటంకం కలిగించారన్నారు.