Crime: 4 నెలల క్రితం చనిపోయిన మూడేళ్ల కొడుకు గురించి తల్లికి పీడ కలలు.. ఆమె చెప్పిన నిజం విని భర్త మైండ్ బ్లాంక్!
ABN , First Publish Date - 2023-09-07T15:54:55+05:30 IST
4 నెలల క్రితం చనిపోయిన మూడేళ్ల కొడుకు గురించి ఆ తల్లికి ప్రతి రోజూ పీడ కలలు వస్తున్నాయి. దీంతో భయపడిపోయిన ఆమె భర్తతో పీడకలల గురించి చెప్పేసింది.
గ్వాలియర్: 4 నెలల క్రితం చనిపోయిన మూడేళ్ల కొడుకు గురించి ఆ తల్లికి ప్రతి రోజూ పీడ కలలు వస్తున్నాయి. దీంతో భయపడిపోయిన ఆమె భర్తతో పీడకలల గురించి చెప్పేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చెప్పిన అసలు నిజం విని భర్త మైండ్ బ్లాంక్ అయింది. తన కొడుకుది ప్రమాదవశాత్తు సంభవించిన మరణం కాదని, కావాలనే హత్య చేశారని తెలుసుకోని ఆ తండ్రి గుండె కకావికలమైపోయింది. అంతేకాకుండా తన కొడుకును చంపిది తన భార్యనే, అంటే చిన్నారి తల్లే అని తెలిసి ఆ పోలీసు గుండె చలించిపోయింది. తమ మూడేళ్ల కొడుకును తానే చంపినట్టు ఆ తల్లి భర్త ముందు అంగీకరించింది. కొడుకును హత్య చేసినట్టుగా ఆమె అంగీకరిస్తూ చెప్పిన విషయాన్ని భర్త రికార్డు చేశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో(Madhya Pradesh's Gwalior) జ్యోతి రాథోడ్(Jyoti Rathore), ధ్యాన్ సింగ్(Dhyan Singh) అనే దంపతులు ఉన్నారు. వారికి మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ధ్యాన్ సింగ్ పోలీస్ కానిస్టేబుల్‌గా(police constable) విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే పొరుగింట్లో ఉండే ఉదయ్ ఇందౌలియాతో(Uday Indauliya) జ్యోతికి వివాహేతర సంబంధం ఉంది. ఏప్రిల్ 28న ధ్యాన్ సింగ్ తన ప్లాస్టిక్ దుకాణం( plastic shop) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అతను చాలా మందిని ఆహ్వానించాడు. ఇందులో తమ పొరుగింటిలో నివసించే ఉదయ్ ఇందౌలియా కూడా ఉన్నాడు. అయితే అందరూ ప్లాస్టిక్ దుకాణం ప్రారంభోత్సవంలో బిజీగా ఉండగా.. జ్యోతి, ఉదయ్ టెర్రస్ మీద సన్నిహితంగా ఉన్నారు. తల్లి జ్యోతిని అనుసరిస్తూ ఆమె మూడేళ్ల కొడుకు కూడా టెర్రస్ మీదికి వెళ్లాడు. అక్కడ జ్యోతి, ఉదయ్ సన్నిహితంగా ఉండడాన్ని చూశాడు. నిజానికి మూడేళ్ల ఆ పసిబాలుడికి అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థమై ఉండకపోవచ్చు.
అయినప్పటికీ తన వివాహేతరం సంబంధం గురించి బాలుడు తండ్రితో చెబుతాడేమోనేని జ్యోతి భయపడిపోయింది. దీంతో తమ సంబంధాన్ని దాచేందుకు కన్న కొడుకు అని కూడా చూడకుండా టెర్రస్‌పై నుంచి తోసేసింది. దీంతో ఆ చిన్నారి తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 29న ప్రాణాలు విడిచాడు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు టెర్రస్ మీది నుంచి పడిపోయాడని మొదట్లో అంతా నమ్మారు. కానీ కొన్ని రోజుల తర్వాత జ్యోతికి కొడుకు గురించి ప్రతిరోజూ పీడకలలు రావడం ప్రారంభమైంది. దీంతో భయపోడిపోయిన జ్యోతి.. భర్త ధ్యాన్ సింగ్ ముందు తన నేరాన్ని అంగీకరించింది. ధ్యాన్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. జ్యోతి, ఆమె ప్రియుడు ఉదయ్ ఇందౌలియాను అరెస్ట్ చేశారు. మొత్తానికి పీడకలలు దోషులను పట్టించాయి.