MP horror: నాలుగో తరగతి విద్యార్థిపై క్లాస్‌మేట్ల ఘాతుకం.. జామెట్రీ కంపాస్‌తో 108 సార్లు దాడి
ABN , First Publish Date - 2023-11-27T17:52:09+05:30 IST
నాలుగో తరగతి విద్యార్థిపై క్లాస్‌రూమ్‌లోనే తోటి విద్యార్థులు పాశవికంగా దాడికి దిగారు. జామెట్రీ కాంపాస్‌తో 108 సార్లు పొడవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.
ఇండోర్: నాలుగో తరగతి విద్యార్థిపై క్లాస్‌రూమ్‌లోనే తోటి విద్యార్థులు పాశవికంగా దాడికి దిగారు. జామెట్రీ కాంపాస్ (Geometry compass)తో 108 సార్లు పొడవడంతో (Stabbed) బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మధ్యప్రదేశ్ (Madhya pradesh)లోని ఇండోర్ (Indore)లో జరిగింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) తక్షణమే విచారణ జరపాలని పోలీసులను కోరింది.
ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేటు స్కూలులో నవంబర్ 24న పిల్లలు ఘర్షణ పడినప్పుడు ఈ ఉదంతం చోటుచేసుకున్నట్టు తెలిసిందని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ పల్లవి పోర్వాల్ తెలిపారు. ఈ ఘటన తమకు దిగ్భ్రాంతి కలిగించిందని, ఇత చిన్న వయసులో పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు కారణాలేమిటో తెలుసుకోవాలని పోలీసులను కోరామని చెప్పారు. పిల్లలు, పిల్లల తల్లిదండ్రులకు తాము కౌన్సిలింగ్ ఇచ్చి, పిల్లలు హింసాత్మక ఘటనలున్న వీడియో గేమ్స్ ఆడుతున్నారా అనే విషయాన్ని తెలుసుకోనున్నామని అన్నారు.
కాగా, నవంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తన కుమారుడిపై దాడి జరిగిందని, పలుచోట్ల గాయాలయ్యాయని బాలుడి తండ్రి తెలిపాడు. తన కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన ఘటన గురించి చెప్పాడని, తోటి విద్యార్థులే ఇంతటి హింసకు ఎందుకు పాల్పడ్డారో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని అన్నారు. క్లాస్‌రూమ్‌లో సీసీటీవీ ఫుటేజ్ గురించి తాను అడిగినప్పటికీ పాఠశాల యాజమాన్యం ఇవ్వలేదని చెప్పారు. ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ సింఘ్ చౌహాన్ మాట్లాడుతూ, ఫిర్యాదు అందగానే బాధితుడిని వైద్య పరీక్షకు పంపినట్టు తెలిపారు. దాడికి పాల్పడిన విద్యార్థులంతా పదేళ్ల లోపు వారేనని, చట్టపరంగా వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.