Secunderabad: షిర్డీ ఎక్స్ప్రెస్లో పొగలు.. ఘట్‌కేసర్ వద్ద 20 నిమిషాల పాటు నిలిపివేత
ABN , First Publish Date - 2023-10-26T08:41:01+05:30 IST
షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైల్లో(Shirdi Express Train) పొగలు వెలువడ్డాయి. కాకినాడు పోర్టు నుంచి సాయినగర్ (షిర్డీకి)
ఘట్‌కేసర్(సికింద్రాబాద్), (ఆధ్రజ్యోతి): షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైల్లో(Shirdi Express Train) పొగలు వెలువడ్డాయి. కాకినాడు పోర్టు నుంచి సాయినగర్ (షిర్డీకి) బయలుదేరిన షిర్డీ ఎక్స్ ప్రెస్ రైలు బుధవారం సికింద్రాబాద్(Secunderabad)కు వస్తుండగా మార్గమధ్యంలో పొగలు వ్యాపించాయి. బీ-4 ఏసీ త్రీటైర్ బోగీ చక్రాల్లోంచి పొగలు వ్యాపించడంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన లోకో పైలెట్లు ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి పరిశీలించారు. రైలు చక్రాల వద్ద బ్రేక్‌లైనర్లు పట్టేయండంతో పొగలు వ్యాపించినట్లు గుర్తించి వాటికి మరమ్మత్తులు చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు రైలును నిలిపివేశారు. ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత అధికారులు రైలును పంపించారు.