Education: ఏపీ సర్కార్ షాకింగ్ నిర్ణయం! ఒకేసారి 180 డిగ్రీ కాలేజీలు రద్దు!

ABN , First Publish Date - 2023-07-15T12:22:06+05:30 IST

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలపై వేటు పడింది. ఒకేసారి 180 కాలేజీలు మూతపడబోతున్నాయి. ఆ కాలేజీలకు రాబోయే మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులు ఖరారు చేయకపోవడం మూసివేతకు కారణమైంది. వాటిలో 30 కాలేజీలు ఫీజుల ప్రతిపాదనలు సమర్పించలేదని, మరో 150 కాలేజీల్లో గత మూడేళ్ల కాలంలో 25 శాతం కూడా అడ్మిషన్లు లేవని వెల్లడిస్తూ ఉన్నత విద్యాశాఖ

Education: ఏపీ సర్కార్ షాకింగ్ నిర్ణయం! ఒకేసారి 180 డిగ్రీ కాలేజీలు రద్దు!

25% కూడా అడ్మిషన్లు లేవని 150 మూత

ఫీజుల ప్రతిపాదనలు ఇవ్వని మరో 30

ఫీజులు ఖరారు చేయని ఉన్నత విద్యా మండలి

ప్రస్తుత కోర్సులు పూర్తయ్యాక పూర్తిగా మూత

25% నిబంధన ఎక్కడుంది?: యాజమాన్యాలు

న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని వెల్లడి

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలపై వేటు పడింది. ఒకేసారి 180 కాలేజీలు మూతపడబోతున్నాయి. ఆ కాలేజీలకు రాబోయే మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులు ఖరారు చేయకపోవడం మూసివేతకు కారణమైంది. వాటిలో 30 కాలేజీలు ఫీజుల ప్రతిపాదనలు సమర్పించలేదని, మరో 150 కాలేజీల్లో గత మూడేళ్ల కాలంలో 25 శాతం కూడా అడ్మిషన్లు లేవని వెల్లడిస్తూ ఉన్నత విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 నుంచి 2025-26 విద్యా సంవత్సరం వరకు మూడేళ్ల పాటు డిగ్రీ కాలేజీలకు ఫీజులు ఖరారు చేస్తూ ఉన్నత విద్యాశాఖ మూడు రోజల కిందట ఉత్తర్వులు ఇచ్చింది. ఆ జాబితాలో ఈ 180 కాలేజీలు లేవు. కాగా, వాటికి ఫీజులు ఖరారు చేయలేదనే విషయాన్ని తాజా ఉత్తర్వుల్లో నిర్ధారించింది. దీంతో ప్రస్తుతం ఆయా కాలేజీల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థుల కోర్సులు పూర్తయ్యే వరకు మాత్రమే ఆ కాలేజీలు మనుగడలో ఉండనున్నాయి. ఇక, వీటిలో 30 కాలేజీలు అసలు ఫీజుల ప్రతిపాదనలే ఇవ్వకపోవడంతో వాటిని నడిపేందుకు యాజమాన్యాలు ఆసక్తిగా లేవని అర్థమవుతోంది. కానీ, మిగిలిన 150 కాలేజీలు ప్రతిపాదనలు సమర్పించి ఆసక్తి కనబరిచినా ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌(ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ) వాటికి అవకాశం ఇవ్వలేదు. ఇదిలావుంటే, తాజా నిర్ణయంపై కాలేజీలు మండిపడుతున్నాయి. అడ్మిషన్లు తగ్గిపోతే కాలేజీలను మూసేయాలని యూజీసీ నిబంధనల్లో లేదని, వైసీపీ ప్రభుత్వం డిగ్రీ కాలేజీల అడ్మిషన్లపై 2021లో కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తూ జీవో 36 జారీ చేసిందని పేర్కొంటున్నాయి. అందులోనూ ఎక్కడా 25శాతం అడ్మిషన్లు కచ్చితంగా ఉండాలన్న నిబంధన లేదని తెలిపాయి. ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుందనేది అర్థంకావట్లేదని చెబుతున్నాయి.

దీనిపైనా కోర్టుకు

ఇప్పటికే డిగ్రీ కాలేజీల విషయంలో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. తాజాగా ఈ అంశంపై కూడా కోర్టుకు వెళ్లాలని నిర్ణయించాయి. అడ్మిషన్లు లేకపోతే యూనివర్సిటీలు అఫిలియేషన్‌ నిలిపివేయాలి తప్ప, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీకి ఫీజులు ఆపేసే అధికారం లేదనే ప్రాతిపదికన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాలేజీల ప్రతినిధులు తెలిపారు. కాగా, కొత్తగా జారీచేసిన ఫీజుల జీవో 22ను సవాలు చేస్తూ యాజమాన్యాలు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. ఒకవేళ యాజమాన్యాలకు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించినా ఫీజులు ఖరారు చేసేందుకు సమయం పడుతుంది. ఈలోగా డిగ్రీ అడ్మిషన్లు జరిగిపోతాయి. దీంతో కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్నా ఆ కాలేజీల్లో అడ్మిషన్లు ఉండవని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

జీవో 22కు నిరసనగా కాలేజీల బంద్‌

రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు శుక్రవారం స్వచ్ఛంద బంద్‌ పాటించాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవో 22కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించి ఆయా వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందించాయి. ఏపీ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోషియేషన్‌ పిలుపు మేరకు ఈ బంద్‌ పాటించాయి. కాగా, రాష్ట్రంలో నాణ్యమైన డిగ్రీ విద్య అందించాలంటే ఇప్పుడిచ్చే ఫీజులతో సాధ్యపడదని అసోషియేషన్‌ అఽధ్యక్షుడు కనుమర్ల గుండారెడ్డి అన్నారు.

డిగ్రీ కౌన్సెలింగ్‌ మళ్లీ వాయిదా

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసిన ఉన్నత విద్యామండలి.. కోర్టుల్లో కేసులను కారణంగా చూపుతూ మరోసారి వాయిదా వేసింది. షెడ్యూలు ప్రకారం శనివారం నుంచి విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. కాగా, రిజిస్ర్టేషన్ల ప్రక్రియను ఈ నెల 17 వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. 20 నుంచి విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు 1,41,300 మంది అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Updated Date - 2023-07-15T12:22:06+05:30 IST