Education: విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే.. కాలేజీ గుర్తింపు రద్దు!
ABN , First Publish Date - 2023-03-07T11:12:18+05:30 IST
విద్యార్థులను (Students) వేధించే ఇంటర్మీడియట్ కాలేజీలకు (Intermediate Colleges) ఇకపై చెక్ పడనుంది. విద్యార్థుల ఇబ్బందులకు
వేధించినా, అవమానించినా క్రిమినల్ కేసులు
మార్కుల కోసం ఒత్తిడి చేయొద్దు..
వారంలో ఇంటర్ బోర్డు పూర్తి మార్గదర్శకాలు
హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను (Students) వేధించే ఇంటర్మీడియట్ కాలేజీలకు (Intermediate Colleges) ఇకపై చెక్ పడనుంది. విద్యార్థుల ఇబ్బందులకు గురిచేసే కాలేజీ సిబ్బంది, యాజమాన్యాలపై కఠిన చర్యలకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. విద్యార్థులను వేధించినా, అవమానించినా సిబ్బందితో పాటు కాలేజీ మేనేజ్‌మెంట్‌పై క్రిమినల్ కేసులు (Criminal cases) పెట్టడంతో పాటు.. విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆ కాలేజీ గుర్తింపును కూడా రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వారం రోజుల్లో విడుదల చేయనున్నారు. ఐదు రోజుల క్రితంనార్సింగ్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది ప్రవర్తన కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సదరు విద్యార్థి లేఖలో పేర్కొన్నాడు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యల్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సోమవారం రాష్ట్రంలోని 14 విద్యా సంస్థల ప్రతినిధులతో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారు. అలాగే పలు నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నార్సింగ్‌లోని ప్రైవేట్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ కాలేజీలో ఇప్పటికే విద్యార్థులు చదువుతున్నందున, వచ్చే సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇక విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి వీలుగా పలు చర్యల్ని తీసుకోవాలని అధికారులు కాలేజీల ప్రతినిధులకు సూచించారు. ముఖ్యంగా విద్యార్థులకు కనీసం 8 గంటల నిద్ర ఉండేలా ఆయా కాలేజీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి కాలేజీలో ఒక మానసిక నిపుణుడిని అందుబాటులో ఉంచాలని, విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఒకవేళ విద్యార్థి ప్రవర్తనలో ఏమైనా భిన్నమైన లక్షణాలను కనిపిస్తే.. వెంటనే తగిన చర్యల్ని తీసుకోవాలన్నారు. మార్కుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయొద్దని సూచించారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి, ఆయా కాలేజీల్లో తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయి మార్గదర్శకాలను వారంలో విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే.. ఈ అంశంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి మూడు రోజుల గడువు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Couple: కోర్టు మెట్లెక్కిన కొత్త పెళ్లి జంట.. మా ప్రాణాలతో వాళ్లు చెలగాటం ఆడారు.. రూ.40 కోట్ల నష్టపరిహారం ఇప్పించండంటూ..