AP Education: పేదలకు ‘పీజీ’ దూరం! కారణమేంటంటే..!
ABN , First Publish Date - 2023-11-27T11:40:44+05:30 IST
ఏడాదికి సగటున 40 వేల మంది ఏంబీఏ, ఎంసీఏ కోర్సులు చదివితే ఈ ప్రభుత్వంలో ఆ సంఖ్య దాదాపుగా 30 వేలకు పడిపోయింది. ఇంజనీరింగ్, ఇతర కోర్సుల తరహాలో ఏటా అడ్మిషన్లు పెరగాల్సి ఉండగా జగన్ ప్రభుత్వంలో
ఎంబీఏ, ఎంసీఏల్లో తగ్గిన అడ్మిషన్లు
ఈ ఏడాది 33 వేల మందికే సీట్లు
గత ప్రభుత్వంలో సగటున 40 వేలు
జగన్ రాగానే పీజీకి రీయింబర్స్ రద్దు
యూనివర్సిటీల్లోనే చదవాలని షరతు
ఫీజులు కట్టలేక ఉన్నత విద్యకు స్వస్తి
చిన్నా చితకా పనులతోనే ఉపాధి
(అమరావతి-ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వం (Jagan Government) చర్యలతో పీజీ కోర్సుల పరిస్థితి దారుణంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేయడంతో అడ్మిషన్లు భారీగా తగ్గిపోయాయి. గత చంద్రబాబు ప్రభుత్వంలో (Chandrababu Government) ఏడాదికి సగటున 40 వేల మంది ఏంబీఏ, ఎంసీఏ కోర్సులు చదివితే ఈ ప్రభుత్వంలో ఆ సంఖ్య దాదాపుగా 30 వేలకు పడిపోయింది. ఇంజనీరింగ్, ఇతర కోర్సుల తరహాలో ఏటా అడ్మిషన్లు పెరగాల్సి ఉండగా జగన్ ప్రభుత్వంలో తగ్గుతూ వస్తున్నాయి. అధికారంలోకి రాగానే పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేయడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఖచ్చితంగా అమలు చేయడంతో పేద విద్యార్థులు ఉచితంగా చదువుకున్నారు. అయితే, జగన్ హయాంలో ఈ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తేయడంతో పేద విద్యార్థుల్లో చాలామంది పీజీ విద్యకు పూర్తిగా దూరమయ్యారు. చదివితే కేవలం యూనివర్సిటీల కాలేజీల్లోనే చదవాలని, అప్పుడే రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని జగన్ ప్రభుత్వం షరతు పెట్టడంతో, దూరా భారం వెళ్లలేక పేదలు ఉన్నత చదువులు వదిలేసుకున్నారు.
ఎంత తేడా!
2015-16లో 33,261 మంది ఎంబీఏ, ఎంసీకే కోర్సుల్లో చేరారు. ఆ తర్వాత సంవత్సరం 2016-17లో ఏకంగా 50,321 మంది అడ్మిషన్లు పొందారు. మళ్లీ 2017-18లో ఆ సంఖ్య 38,269కి తగ్గింది. 2018-19లో 37,334 మంది చేరారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే 2019-20లో 29,714కు అడ్మిషన్లు పడిపోయాయి. 2020-21లో 40,913కు పెరిగినా, ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు ప్రభావంతో 2021-22లో 30,428కి మళ్లీ అడ్మిషన్లు పడిపోయాయి. ఇక ఈ ఏడాది 33,173 మందికి సీట్లు కేటాయించారు. చివరికి వారిలో ఎంతమంది కాలేజీల్లో చేరతారనేది చూడాలి. మొత్తంగా టీడీపీ ప్రభుత్వంలో సగటున 40 వేల మంది ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చదివితే ఈ ప్రభుత్వంలో అది 30 వేలకు పడిపోవడం గమనార్హం.
అక్రమాల నెపం
వైసీపీ అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో మార్పులు చేసింది. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లిస్తామని ప్రకటించి, ఆ వెంటనే పీజీకి మాత్రం అసలు ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు 2020లో ప్రైవేటు కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ‘విద్యా దీవెన’ రద్దు చేస్తూ జీవో జారీచేసింది. ప్రైవేటు కాలేజీల పీజీ కోర్సుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, చాలా చోట్ల విద్యార్థులు కాలేజీలకు వెళ్లకుండానే రీయింబర్స్‌మెంట్ పొందుతున్నారని ఆరోపిస్తూ.. విజిలెన్స్ విచారణ చేపట్టింది. దీంతో యూనివర్సిటీలకు దగ్గర్లో ఉన్నవారు మాత్రం పీజీ కోర్సులు చేస్తుంటే, దూరంగా ఉన్నవారు డిగ్రీలతోనే ఆగిపోయారు. ఆర్థిక పరిస్థితి బాగున్నవారు ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు చెల్లిస్తూ చదువుకుంటున్నారు. ఈ ప్రభావం ఎంబీఏ, ఎంసీలతో పాటు ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులపైనా పడింది. అన్ని పీజీ కోర్సుల్లోనూ అడ్మిషన్లు సగానికి సగం పడిపోయాయి. ఫీజులు లేకపోవడంతో పీజీ సెట్ల ప్రవేశ పరీక్షలు రాసేవారు కూడా తగ్గిపోయారు. మరోవైపు గత ప్రభుత్వంలో పీజీలో చేరిన విద్యార్థులకు సంబంధించిన రీయింబర్స్‌మెంట్ నగదును ఈ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దాదాపు రూ.450 కోట్ల మేర బకాయిలు చెల్లించలేదు. అప్పట్లో పీజీ కోర్సుల్లో అవకతవకలు జరిగాయనే కారణంతో ఈ మేరకు నిధులు నిలిపివేసింది. కాగా, రూ.450 కోట్లలో ఎంత వదులుకుంటారంటూ ఇటీవల సెటిల్‌మెంట్ చేసే ప్రయత్నం కూడా చేయడం గమనార్హం.
చిన్నా చితకా ఉద్యోగాలతో సరి!
పీజీ చదివే స్తోమత లేని పేద విద్యార్థులు గత నాలుగేళ్లుగా పీజీ కోర్సులు చేయకుండా చిన్నా చితకా ఉద్యోగాలు చూసుకుంటున్నారు. ఇటీవల బీటెక్‌కు డిమాండ్ పెరిగింది. రీయింబర్స్‌మెంట్ ఉన్నప్పుడు ఇంజనీరింగ్ వైపు వెళ్లలేనివారు, ఇంటికి సమీపంలో కాలేజీలుంటే చదవాలనుకునేవారు పీజీ కోర్సుల్లో చేరేవారు. ఇప్పుడు అలాంటి వారంతా పీజీ అనే ఆలోచన వదిలేసి డిగ్రీ కోర్సుల ఆధారంగా వచ్చిన పనిలో రాజీ పడుతున్నారు. అవీ రానివారు వ్యవసాయం, ఇతరత్రా చేతివృత్తులు చేసుకుని జీవించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు ఎన్నికల ఎత్తు?
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద విద్యార్థులకు పీజీని దూరం చేసిన జగన్.. ఎన్నికల వేళ కొత్త ఎత్తు వేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పీజీ చదువుతున్న విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోయినా ఇటీవల వారి ఆర్థిక స్థితి వివరాలను సేకరిస్తున్నారు. పీజీకి రీయింబర్స్‌మెంట్ లేకపోవడంతో చాలా మంది చదువులు మానేస్తున్నారని, ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిందని ప్రభుత్వంలో అంతర్గత చర్చ జరుగుతోంది. దీంతో ఎన్నికల ముందు మళ్లీ పీజీకి రీయింబర్స్‌మెంట్‌ను పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చివర్లో పథకాన్ని తిరిగి తీసుకొచ్చినా నాలుగేళ్లలో లక్షల మంది విద్యార్థులు పీజీకి దూరమై నష్టపోయారన్న విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలని, వారికి అన్యాయం చేసినట్టేనని నిపుణులు చెబుతున్నారు.
పేద విద్యార్థులు బాగా చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని తన ప్రసంగాల్లో దంచికొట్టే సీఎం జగన్.. అదే పేదలకు తన నిర్ణయాలతో ఉన్నత విద్యను దూరం చేశారు. పీజీ కోర్సుకు ఫీజు రీయింబర్స్‌ను రద్దు చేసి.. పేద విద్యార్థుల ఉన్నత విద్య ఆశలపై నీళ్లు కుమ్మరించారు. ఫలితంగా పీజీ కోర్సులు చదవాలనుకునే పేద కుటుంబాలకు చెందిన వారు ఫీజులు చెల్లించలేక చదువులు నిలిపివేశారు. ఉన్నత చదువుకు ఖర్చుపెట్టలేక.. ఉన్న చదువుతోనే చిన్నపాటి పనులు చేసుకుంటున్నారు. సీఎం జగన్ తమకు తీరని వేదన మిగిల్చారని ఆవేదన చెందుతున్నారు.
మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి