AP Education: ఉన్నత విద్యకు విద్యార్థుల దూరం? కారణమిదేనా?
ABN , First Publish Date - 2023-08-21T12:03:21+05:30 IST
విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం.. విద్యార్థుల ఫీజులు చెల్లిస్తున్నాం.. పేదలను గొప్పవారిని చేయడమే ప్రభుత్వ లక్ష్యం’.. అంటూ జగన్ సర్కారు తరచూ ఊదరగొడుతోంది. అయితే రాష్ట్రంలో ఉన్నత విద్య చదివే వారి సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. ఏటా వేలాదిమంది విద్యార్థులు ఇంటర్‌తోనే చదువుకు దూరమవుతున్నారు.
ఏటా తగ్గిపోతున్న విద్యార్థుల అడ్మిషన్లు
గతేడాది 22 వేల మంది ఇంటర్‌తోనే సరి
ఈ ఏడాది ఆ సంఖ్య 50 వేలకు చేరే అవకాశం
ఇంటర్‌లో ఉత్తీర్ణత పెరిగినా తగ్గిన అడ్మిషన్లు
డిగ్రీ కాలేజీల్లో చేరిన విద్యార్థులు 1.07 లక్షలే
ఇంజనీరింగ్‌కు మరో లక్ష మంది ఆప్షన్లు
జగన్ సర్కారు విధానాలతో పొరుగుబాట
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం.. విద్యార్థుల ఫీజులు చెల్లిస్తున్నాం.. పేదలను గొప్పవారిని చేయడమే ప్రభుత్వ లక్ష్యం’.. అంటూ జగన్ సర్కారు తరచూ ఊదరగొడుతోంది. అయితే రాష్ట్రంలో ఉన్నత విద్య చదివే వారి సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. ఏటా వేలాదిమంది విద్యార్థులు ఇంటర్‌తోనే చదువుకు దూరమవుతున్నారు. ఇందుకు ప్రభుత్వ విధానాలతో పాటు వివిధ కారణాలున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలో 22 వేలమంది ఏ కోర్సులోనూ చేరకుండా ఇంటర్‌తో ఆపేశారని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముంది. గతేడాది అడ్మిషన్లు పడిపోవడానికి ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గడాన్ని ఉన్నత విద్యా శాఖ అధికారులు సాకుగా చూపించారు. కానీ ఈ ఏడాది ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. అడ్మిషన్లలో మాత్రం ఎలాంటి పెరుగుదల కనిపించడం లేదు. ఇంజనీరింగ్‌లో కొంత ఫరవాలేదనిపించినా, డిగ్రీ కోర్సుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు డిగ్రీకి దూరమయ్యారు. కానీ ఆ విద్యార్థులంతా ఇంజనీరింగ్‌కు కూడా రాలేదు. దీంతో ఆ విద్యార్థులంతా ఏం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వారంతా చదువు మానేస్తున్నారా? లేక పక్క రాష్ర్టాలకు తరలిపోతున్నారా? అన్నది అడ్మిషన్లు పూర్తయితే తెలుస్తుంది. చదువు మానేసినా, ఇతర రాష్ట్రాలకు తరలిపోయినా.. కారణం ఏదైనా రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితి దిగజారుతోందనే వాదన వినిపిస్తోంది.
ఈ ఏడాది రెట్టింపు?
గతేడాది ఇంటర్ రెండో సంవత్సరంలో 3,14,931 మంది ఉత్తీర్ణులయ్యారు. రెగ్యులర్‌గా 2,72,001 మంది, సప్లిమెంటరీలో మరో 42,931 మంది విద్యార్థులు ఇంటర్ పూర్తిచేశారు. ఈ ఏడాది ఇంజనీరింగ్‌కు 1.03 లక్షల మంది కౌన్సెలింగ్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోగా, వారిలో 1,00,500 మంది ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. అలాగే డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌లో 1.27 లక్షల మందికి సీట్లు కేటాయిస్తే, వారిలో 1.07 లక్షల మందే కాలేజీల్లో రిపోర్టు చేశారు. 20 వేలమంది విద్యార్థులు సీట్లు పొందినా చేరలేదు. అలాగే మెడిసిన్‌కు 5 వేలమంది, అగ్రికల్చర్ కోర్సులకు 5 వేలమంది, ఫార్మసీలో 15 నుంచి 20 వేలమంది విద్యార్థులు చేరుతారు. ఇవి కాకుండా బీటెక్ రెండో విడత కౌన్సెలింగ్, మేనేజ్‌మెంట్ కోటాలో కలిపి సుమారు 20 వేలమంది చేరే అవకాశముంది. అలాగే డిగ్రీలో మేనేజ్‌మెంట్ కోటాలోనూ 10 వేలమంది చేరొచ్చని అంచనా. ఈ లెక్కన అన్ని కోర్సుల్లో కలిపి 2.65 లక్షల మంది వరకు విద్యార్థులు ఉన్నత విద్యలో చేరే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన దాదాపు 50 వేలమంది విద్యార్థుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. గతేడాదితో పోలిస్తే ఉన్నత విద్యకు దూరమయ్యే వారి సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముంది. చాలామంది ఇప్పటికే తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల్లో ఇంజనీరింగ్‌కు వెళ్లిపోయారు. తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ముందే పూర్తి చేయడం దీనికి కారణం. ఏపీలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో జాప్యం కారణంగా పక్క రాష్ర్టాల కాలేజీలకు మేలు జరుగుతోంది. కానీ జగన్ ప్రభుత్వం ఏటా ఆలస్యంగానే కౌన్సెలింగ్ చేపడుతోంది.
డిగ్రీ కోర్సులపై అయోమయం
డిగ్రీ కోర్సుల విషయంలో జగన్ ప్రభుత్వం మితిమీరిన అత్యుత్సాహం ప్రదర్శించింది. బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే వేగంగా జాతీయ విద్యా విధానం అంటూ సింగిల్ మేజర్ డిగ్రీ విధానం ప్రవేశపెట్టింది. కేంద్రం అలా ప్రకటించగానే, ఏపీ ఉన్నత విద్యాశాఖ ఆగమేఘాలపై అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా త్రీ మేజర్ డిగ్రీ విధానం ఉంది. ఒక్కసారిగా ఒకే సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలని చెప్పడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఒక్కటే సబ్జెక్టు చదివితే పీజీకి ఆప్షన్లు తగ్గిపోతాయి. అలాగే సింగిల్ మేజర్ డిగ్రీ అమలు ఎలా ఉంటుందో తెలియదు. సింగిల్ మేజర్‌పై అవగాహన సదస్సులు పెడతామని ప్రకటించిన ఉన్నత విద్యామండలి చివరి వరకు చోద్యం చూసింది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే వరకూ అవగాహన సదస్సులు పెట్టకపోవడంతో అసలు ఈ కొత్త డిగ్రీ ఎలా ఉంటుందో విద్యార్థులకు అర్థంకాలేదు. దీంతో చాలా మంది డిగ్రీ చదవాలన్న ఆలోచనకు దూరమయ్యారు.
భారీగా ప్రైవేటు బాట
రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య నాణ్యతపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చేరడం అన్నది రెండో ఆప్షన్‌గా మారింది. తొలుత ప్రైవేటు యూనివర్సిటీలు, పక్క రాష్ర్టాల్లో ప్రయత్నించి, అక్కడ సీటు రాకపోతే ఇక్కడ చేరుదాం అన్నట్టుగా కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. మొత్తం ప్రభుత్వమే కడుతుందనే కారణంతో జగన్ ప్రభుత్వం ఫీజులు భారీగా తగ్గించేసింది. దీంతో కాలేజీలు కూడా ఫీజుల స్థాయిలోనే ప్రమాణాలు అన్నట్టుగా ఖర్చులు తగ్గించాయి. దీంతో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగం గ్యారెంటీ లేక, ఫీజు ఎక్కువైనా ప్రైవేటు యూనివర్సిటీలకు విద్యార్థులు వెళ్లిపోతున్నారు. లేదంటే హైదరాబాద్‌లోని ప్రైవేటు కాలేజీల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో విడుదల చేయకపోవడం కూడా రాష్ట్రంలో అడ్మిషన్లు తగ్గడానికి మరో కారణంగా కనిపిస్తోంది.