AP Teachers: ప్రమోషన్లు మాకొద్దు! వద్దనడం ఇదే మొదటిసారి

ABN , First Publish Date - 2023-10-07T12:39:34+05:30 IST

ఏ ఉద్యోగి అయినా పదోన్నతి పొందడం ద్వారా వృత్తి జీవితంలో ఎదగాలనే కోరుకుంటారు. అందులోనూ ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ప్రమోషన్‌కు డిమాండ్‌ మరీ ఎక్కువ. ఎందుకంటే టీచర్లకు పదోన్నతులు చాలా

AP Teachers: ప్రమోషన్లు మాకొద్దు! వద్దనడం ఇదే మొదటిసారి

  • పీజీటీ పోస్టులను తిరస్కరిస్తున్న టీచర్లు

  • పదోన్నతులు వద్దనడం ఇదే మొదటిసారి

  • హోదా లేదు... ఆర్థిక ప్రయోజనాలూ నిల్‌

  • సాంకేతికంగా ఇప్పటికీ స్కూల్‌ అసిస్టెంట్లే

  • ఉత్తుత్తి ప్రమోషన్లు ఎందుకని విముఖత

  • 231 మంది పీజీటీల కోసం కొత్తగా ఉత్తర్వులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఏ ఉద్యోగి అయినా పదోన్నతి పొందడం ద్వారా వృత్తి జీవితంలో ఎదగాలనే కోరుకుంటారు. అందులోనూ ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ప్రమోషన్‌కు డిమాండ్‌ మరీ ఎక్కువ. ఎందుకంటే టీచర్లకు పదోన్నతులు చాలా తక్కువగా వస్తుంటాయి. సర్వీసు బాగా ఎక్కువ ఉంటే తప్ప ప్రధానోపాధ్యాయులు కూడా కాలేరు. చాలామంది టీచరు గానే రిటైర్‌ అవుతుంటారు. అలాంటి టీచర్లు ఇప్పుడు ప్రభుత్వం ప్రమోషన్‌ ఇస్తామన్నా తీసుకోవడం లేదు. మాకొద్దీ పదోన్నతులు అంటూ తిరస్కరిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలల్లో బాలికలకు ఇంటర్‌ విద్యను ప్రారంభించింది. స్కూల్‌ అసిస్టెంట్లలో సీనియారిటీ ఉన్నవారికి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ టీచర్లు(పీజీటీ)గా పదోన్నతులు ఇస్తామనే హామీ ఇచ్చి వారితో ఇంటర్‌ బోధన చేయించింది. మొత్తం 253 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌ విద్య ప్రారంభించగా బోధనకు 1,746 మంది అవసరమయ్యారు. కానీ వారిలో 1,515 మంది మాత్రమే విధుల్లో చేరారు. మరో 231 మంది తమకు ప్రమోషన్‌ అవసరం లేదంటూ ముందుకు రాలేదు. దీంతో ఆ ఖాళీల భర్తీ కోసం పాఠశాల విద్యాశాఖ మళ్లీ కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది.

పేరుకే ప్రమోషన్‌

పదోన్నతులు ఇస్తామని చెప్పిఆ వాటితో టీచర్లకు పెద్దగా ప్రయోజనాలు లభించడం లేదు. మామూలుగా ప్రమోషన్‌ ఇస్తే రెండు ఇంక్రిమెంట్లు రావాలి. కానీ కేవలం ఒక్క ఇంక్రిమెంట్‌ మాత్రమే ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్క ఇంక్రిమెంటే ఇస్తే అది సాంకేతికంగా పదోన్నతి కిందకు రాదు. అందుకే ఏడాదికి పైగా పీజీటీ హోదాలో పనిచేస్తున్నా ఇప్పటికీ కేడర్‌ స్ర్టెంత్‌లో వారిని స్కూల్‌ అసిస్టెంట్లుగానే చూపిస్తున్నారు. ఇక గత విద్యాసంవత్సరంలో పీజీటీ హోదాల్లో పనిచేసిన వారికి నెలకు రూ.2,500 అదనంగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వారు పది నెలలు పనిచేయగా ఇంతవరకూ ఆ నగదు విడుదల చేయలేదు. అలాగే ఈ ఏడాది నుంచి రెగ్యులర్‌ ఇంక్రిమెంట్‌ ఇస్తామని చెబుతున్నా అది బేసిక్‌లో కలవదని ప్రభుత్వం పేర్కొంది. అంటే ఆ ఇంక్రిమెంట్‌పై టీఏ, డీఏ, ఇతర ప్రయోజనాలు వర్తించవు. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలైనా ఇంతవరకూ వారి హోదా ఏమిటో తేల్చలేదు. ఇటీవల ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ... పీజీటీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. దానికి ఆర్థికశాఖ ఆమోదం లభించలేదు. ప్రమోషన్‌ వచ్చినా వారికి లభించే ప్రయోజనాలు పెద్దగా కనిపించడం లేదు. దీంతో పేరు గొప్ప కోసం ఇచ్చే ఈ పదోన్నతి తమకు వద్దని టీచర్లు తేల్చి చెబుతున్నారు. కనీసం హోదా అయినా పెరుగుతుందని విధుల్లో చేరినవారికి ఆ ఆశ కూడా నెరవేరలేదు. అటు హోదా లభించక, ఇటు ఆర్థిక ప్రయోజనాలు లేక ఆ ప్రమోషన్‌ ఎందుకని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.

దూరం వెళ్లలేక చేరికలు

ఇంటర్‌ బోధన విధుల్లో చేరినవారిలో కూడా అత్యధిక శాతం టీచర్లు కేవలం దూరాభారాన్ని తగ్గించుకోవడం కోసమే పీజీటీ హోదాల్లోకి వచ్చారు. మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్‌లు పడినవారు, పీజీటీల రూపంలో పట్టణాలకు దగ్గరగా వచ్చారు. ప్రభుత్వం ఇంటర్‌ తరగతులు ప్రారంభించిన ఉన్నత పాఠశాలలు ఎక్కువగా జిల్లా కేంద్రాలకు సమీపంలోనే ఉన్నాయి. అందువల్లే ఆ మాత్రం పోస్టులైనా భర్తీ అయ్యాయని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం ఇవ్వదల్చుకుంటే రెగ్యులర్‌ పదోన్నతులు ఇవ్వాలని, లేదంటే పాత స్థానాల్లోనే ఉంచాలని టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఇలా ఇంటర్‌ బోధన చేస్తున్న 1,515 మంది టీచర్లకు గత మూడు నెలల జీతాలు అందలేదు. బదిలీల పేరుతో వేలాది మందికి జీతాలు నిలిపివేయగా అందులో వీరు కూడా ఉన్నారు. మూడు నెలల బిల్లులను సెప్టెంబరులో జనరేట్‌ చేశారు. కానీ ఇప్పటికీ చాలామందికి జీతాలు అందలేదు.

Updated Date - 2023-10-07T12:39:34+05:30 IST