Education: అన్ని సదుపాయాలు ఉన్నా విద్యార్థులు లేరు.. టీచర్లు మాత్రం 9 మంది ఉన్నారు! ఈ విచిత్రం ఎక్కడంటే..!
ABN , First Publish Date - 2023-07-04T12:13:32+05:30 IST
తరగతి గదిలో ఇద్దరే పిల్లలకు ఓ ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నారేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఒక్క ఉపాధ్యాయుడికి ఈ ఇద్దరు విద్యార్థులైనా ఉన్నారు.. ఇదే బడిలో ఉన్న మిగతా ఎనిమిది మంది ఉపాధ్యాయులకు కలిపి ఉన్నది మరో ఇద్దరు పిల్లలే! ఈ విచిత్ర పరిస్థితి.. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనిది! ఈ బడిలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకునే వీలుంది
నలుగురు పిల్లలు.. 9 మంది టీచర్లు!
ఆరు, పదో తరగతుల్లో ఇద్దరు చొప్పున విద్యార్థులు
నల్లగొండ జిల్లా శాలిగౌరారం పాఠశాలలో విచిత్ర స్థితి
కస్తూర్బా, గురుకులాలు, ప్రైవేటు బడులకు పిల్లలు మారడంతోనే
మండలంలోని మిగతా పాఠశాలల్లోనూ పిల్లల సంఖ్య అంతంతే
శాలిగౌరారం, జూలై 3: తరగతి గదిలో ఇద్దరే పిల్లలకు ఓ ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నారేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఒక్క ఉపాధ్యాయుడికి ఈ ఇద్దరు విద్యార్థులైనా ఉన్నారు.. ఇదే బడిలో ఉన్న మిగతా ఎనిమిది మంది ఉపాధ్యాయులకు కలిపి ఉన్నది మరో ఇద్దరు పిల్లలే! ఈ విచిత్ర పరిస్థితి.. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనిది! ఈ బడిలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకునే వీలుంది. అంటే ఐదు క్లాసులకు కలిపి నలుగురంటే నలుగురు పిల్లలే ఉండగా వీరి కోసం తొమ్మిది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఆరో తరగతిలో ఇద్దరు, పదో తరగతిలో ముగ్గురు విద్యార్థులు నమోదై ఉన్నారు. పదో క్లాసు చదువుతున్న వారిలో ఓ అబ్బాయి బడికే రావడం లేదు. ఐదేళ్ల క్రితం దాకా ఈ బడిలో 300 మంది విద్యార్థులు ఉండేవారు. నిరుడు అన్ని తరగతులకు కలిపి మొత్తం 18 మంది పిల్లలు ఉంటే ఈసారి ఆ సంఖ్య ఐదులోపునకు పడిపోయింది. ఈ మండలంలోని మిగతా బడుల స్థితి కూడా దాదాపు ఇదే రకంగా ఉంది. మండలంలోని 12 ఉన్నత పాఠశాలలు, తొమ్మిది ప్రాథమిక పాఠశాలల్లో 50 మంది లోపు విద్యార్థులే ఉన్నారు. బహుశా సరైన వసుతులు లేవేమో.. అందుకే ఈ బడుల్లోకి పిల్లలు రావడం లేదేమో అనుకునేరు! అన్ని బడుల్లోని తరగతుల్లోనూ సరిపడా వసతులున్నాయి. ఉపాధ్యాయులూ ఉన్నారు. కానీ కస్తూర్బా, గురుకుల, మోడల్, ప్రైవేట్ స్కూళ్లకు విద్యార్థులు వెళ్లడంతో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఫలితంగా మండలంలోని ఐదు ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేశారు.
విలీనం చేస్తాం: మేక నాగయ్య, ఎంఈవో, శాలిగౌరారం
ప్రభుత్వ పాఠశాలలో రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న విషయం వాస్తవమేనని ఎంఈవో మేక నాగయ్య పేర్కొన్నారు. పదిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలను సమీపంలోని పాఠశాలలో విలీనం చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తామని వెల్లడించారు.