Ukraine Indian students: ఉక్రెయిన్‌లోనూ విద్యార్థులకు కష్టాలే! పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2023-08-21T11:02:08+05:30 IST

రష్యాకు వ్యతిరేకంగా గత ఏడాది ఐక్య రాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన పలు తీర్మానాల విషయంలో భారత్‌ తటస్థంగా ఉన్న విషయం తెలిసిందే. దానికి తోడు.. యుద్ధం ఆరంభమైన తర్వాత అంతర్జాతీయంగా రష్యాను ఒంటరిని చేసే ప్రయత్నాల్లో పాశ్చాత్య దేశాలు, అగ్రరాజ్యాలు బిజీగా ఉంటే..

Ukraine Indian students: ఉక్రెయిన్‌లోనూ విద్యార్థులకు కష్టాలే! పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థుల కష్టాలు

కరెంటు తీసేస్తారు.. నీటి సరఫరా ఉండదు

పచారీ కొట్లలోనూ సరుకులూ ఇవ్వరు

రష్యా మిత్రదేశం అంటూ కస్సుబుస్సు

యుద్ధ సైరన్లతో కంటికి కునుకుండదు

ఎంబీబీఎస్‌ కోసం తిరిగెళ్లిన వారికి పాట్లు

పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

వారికి భారత్‌లో వైద్య విద్య ఉత్తమాటే!

‘‘ఇండియన్స్‌ గో బ్యాక్‌..!’’.. ‘‘రష్యా ఫ్రెండ్స్‌ గో బ్యాక్‌..!’’..

ఇవీ ఇప్పుడు యుద్ధ కల్లోల ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న నిరసనలు..! గత ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రారంభమయ్యాక.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, అష్టకష్టాలు పడుతూ.. వేర్వేరు దేశాల మీదుగా భారత్‌ చేరిన ఎంబీబీఎస్‌ విద్యార్థులు, ఇప్పుడు తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని వాపోతున్నారు. తమ వైద్య విద్యను పూర్తిచేసేందుకు గత నవంబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకు తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లిన వారు.. అడుగడుగునా సహాయ నిరాకరణను ఎదుర్కొంటున్నారు. రష్యాపై ఉక్రెయిన్‌ ఎదురుదాడి ప్రారంభించాక ఉక్రెయిన్‌ పౌరుల్లో ఈ జాఢ్యం మరింత పెరిగిందని భారత విద్యార్థులు వాపోతున్నారు.

(సెంట్రల్‌ డెస్క్‌): రష్యాకు వ్యతిరేకంగా గత ఏడాది ఐక్య రాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన పలు తీర్మానాల విషయంలో భారత్‌ తటస్థంగా ఉన్న విషయం తెలిసిందే. దానికి తోడు.. యుద్ధం ఆరంభమైన తర్వాత అంతర్జాతీయంగా రష్యాను ఒంటరిని చేసే ప్రయత్నాల్లో పాశ్చాత్య దేశాలు, అగ్రరాజ్యాలు బిజీగా ఉంటే.. భారత్‌ మాత్రం ఆ దేశం నుంచి ముందెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున చమురును కొనుగోలు చేస్తోంది. ఆయుధాల దిగుమతికి ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో.. భారతదేశం తమ శత్రుదేశమైన రష్యాకు మిత్రదేశం అని ఉక్రెయిన్‌ పౌరులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఆ కోపాన్ని ఇప్పుడు భారతీయ విద్యార్థులపై ప్రదర్శిస్తున్నారు. భారతీయ విద్యార్థులు కనిపిస్తే.. ‘‘యూ ఇండియన్స్‌.. గో బ్యాక్‌..’’ అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు.

అంతేకాదు. భారతీయ విద్యార్థులు ఉండే హాస్టళ్లకు విద్యుత్తు, నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. హాస్టల్‌ క్యాంటీన్లలో సిబ్బంది కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ‘‘విద్యుత్తు కోతలతో సతమతమవుతున్నాం. ఇంత చేసినా.. సంతృప్తిగా చదువుకునే పరిస్థితులు లేవు. నిద్రలో ఉండగా.. హాస్టల్‌ పైనుంచి హెలికాప్టర్ల శబ్దాలు.. యుద్ధ సైరన్లు.. దూరంగా క్షిపణుల శబ్దాలు..! క్షణక్షణం భయంభయంగా ఉంటోంది. నిద్ర ఉండడం లేదు. చదువు సాగడం లేదు’’ అని ఉత్తరాఖండ్‌లోని డెహ్రాదూన్‌కు చెందిన సృష్టి జైన్‌ చెబుతున్నారు. ఆమె ఉక్రెయిన్‌లోని ఎల్వీవ్‌ నేషనల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఇక పచారీ కొట్లలో సరుకులు కొనేందుకు వెళ్తే.. ఆ దుకాణాల యజమానులు ‘‘భారత్‌-రష్యా మిత్రదేశాలు. అందుకే భారతీయులకు సరుకులు ఇవ్వం’’ అంటూ తెగేసి చెబుతున్నారని లోకేశ్‌ అనే విద్యార్థి వాపోయారు. హాస్టళ్లలో కిచెన్‌లో వంట చేసుకునే అవకాశం కూడా కల్పించడం లేదని చెప్పారు.

3,400 మంది విద్యార్థులు

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రారంభమైనప్పటికి అక్కడ 18 వేల మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేవారు. భారత ప్రభుత్వం వారందరినీ విడతల వారీగా ‘ఆపరేషన్‌ గంగ’లో భాగంగా భారత్‌కు రప్పించింది. మరికొందరు భారతీయ విద్యార్థులు ప్రాణభయంతో సరిహద్దు దేశాలకు వెళ్లి.. అక్కడ నుంచి అష్టకష్టాలు పడుతూ నాలుగైదు నెలల తర్వాత భారత్‌కు చేరారు. అప్పట్లో ఉక్రెయిన్‌లో చదువుకునే భారతీయ విద్యార్థులకు మన దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీని రాష్ట్రాలు, వర్సిటీలు బుట్టదాఖలు చేయడంతో తమ విద్యను కొనసాగించేందుకు ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చిందని ఫరీదాబాద్‌కు చెందిన వైశాలీ సేథియా అనే విద్యార్థిని వాపోయారు. ఆమె ఉక్రెయిన్‌లోని టెర్నోపిల్‌ నేషనల్‌ వర్సిటీలో ఎంబీబీఎస్‌ చేస్తున్నారు. ఉక్రెయిన్‌ నుంచి ‘ఆపరేషన్‌ గంగ’లో భాగంగా భారత్‌ తిరిగి వచ్చిన విద్యార్థుల్లో చాలా మంది తిరిగి వెనక్కి వెళ్లలేదు. వారిలో జూనియర్లు ఇక్కడి వర్సిటీల్లో మళ్లీ మొదటి నుంచి ఎంబీబీఎస్‌ చదవడమో.. తమ కలలను చంపుకోవడమో చేస్తున్నారు.

బిహార్‌కు చెందిన దీపక్‌ కుమార్‌ అనే విద్యార్థి భారత్‌కు తిరిగి వచ్చాక మళ్లీ వైద్య విద్య జోలికి వెళ్లలేదు. ‘‘భారత్‌లో వైద్య విద్యతో పోలిస్తే.. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చవక. మూడోవంతు ఫీజుతో కోర్సు పూర్తవుతుంది. ఉన్న కొంత పొలాన్ని అమ్మి మా నాన్న నన్ను ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదివేందుకు పంపారు. యుద్ధంతో తిరిగి వచ్చాను. ఇప్పుడు మళ్లీ వెళ్లే పరిస్థితి లేదు. ఇక్కడా చదివే పరిస్థితి లేదు’’ అని దీపక్‌ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థతో అన్నారు. 18 వేల మంది విద్యార్థులు భారత్‌కు తిరిగి వస్తే.. గత ఏడాది నవంబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకు 3,400 మంది విద్యార్థులు మాత్రమే వైద్యవిద్యను కొనసాగించేందుకు తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లారు. వీరంతా ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న వారే..! 2021లో భారత వైద్య మండలి(ఎంసీఐ) సవరించిన నిబంధనలతో.. విదేశాల్లో ఒకే వర్సిటీలో వైద్య విద్యను పూర్తిచేయాలి. యూనివర్సిటీ మారడానికి వీల్లేదు. ఈ కారణంతో ఫైనలియర్‌ విద్యార్థులు చాలా వరకు ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లారు. ఇప్పుడు అక్కడ ఉక్రెయిన్‌ పౌరులు సహాయ నిరాకరణకు దిగుతూ.. భారతీయ విద్యార్థులపై కారాలు, మిరియాలు నూరుతుండడంతో తమ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు.

ukrine.jpg

మా విద్య ఓ సవాలుగా మారింది

మాది ఉత్తరప్రదేశ్‌లోని కన్నోజ్‌. ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ చదువుతున్నాను. గత ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమయ్యాక.. బిక్కుబిక్కుమంటూ సరిహద్దు దేశాలకు వెళ్లాం. ఎలాగోలా భారత్‌కు చేరుకున్నాం. వైద్యవిద్యను పూర్తిచేసేందుకు గత ఏడాది నవంబరులో తిరిగి ఉక్రెయిన్‌కు వచ్చాను. కానీ, ఇప్పుడు చదువుకునే పరిస్థితులు కనిపించడం లేదు. నిత్యం భయంభయంగా గడపాల్సి వస్తోంది. కంటికి కునుకు కూడా ఉండడం లేదు. ఎప్పుడు కరెంటు తీసేస్తారో తెలియదు. త్వరగా వైద్యవిద్యను పూర్తిచేసుకుని, ఇంటికి రావాలని ఉంది.

- రిషి ద్వివేది, ఎల్వీవ్‌ నేషనల్‌ యూనివర్సిటీ

భారత్‌కు రావడానికి ఐదు నెలలు

మాది ఢిల్లీ శివార్లలోని ఫరీదాబాద్‌. టెర్నోపిల్‌ వర్సిటీలో ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. గతేడాది యుద్ధం ప్రారంభమయ్యాక.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయా ణం సాగించాను. మార్చిలో హంగేరి సరిహద్దులు దాటాను. నవంబరులో భారత్‌కు వచ్చా ను. ఐదు నెలల తర్వాత వచ్చాక.. భారత ప్రభు త్వం చెప్పినట్లు సొంత దేశంలోని వర్సిటీల్లో వైద్య విద్యను కొనసాగించే అవకాశం కల్పించలేదు. దాంతో జనవరిలో తిరిగి ఉక్రెయిన్‌కు వచ్చాను. ఎంసీఐ తన మార్గదర్శకాలను సడలించి, వర్సిటీ మార్పునకు అవకాశమివ్వాలి.

- వైశాలి సెథియా, టెర్నోపిల్‌ నేషనల్‌ వర్సిటీ

Updated Date - 2023-08-21T11:02:08+05:30 IST