Self motivation: ప్రిపరేషన్‌పై నిపుణులు ఏమంటున్నారంటే..!
ABN , First Publish Date - 2023-07-22T17:49:54+05:30 IST
ఏ విజయానికైనా సెల్ఫ్ మోటివేషన్ ముఖ్యం. అయితే, నిన్ను నీవు మోటివేట్ చేసుకోవటమనేది తాత్కాలికం కారాదు. ప్రతి పనిలో, చదువులో ఇది ఉండాల్సిందే. ఎవరు నిరుత్సాహపర్చడానికి ప్రయత్నించినా, అకారణంగా డీమోటివేట్ అయ్యే స్థితిని తప్పించుకోవాలంటే, సొంతంగా ప్రేరణ పొందాలి. లక్ష్యం ప్రస్ఫుటంగా కనపడే మానసిక స్థితిని ఏర్పరుచుకుంటే ఇది సాధ్యం.
ఏ విజయానికైనా సెల్ఫ్ మోటివేషన్ ముఖ్యం. అయితే, నిన్ను నీవు మోటివేట్ చేసుకోవటమనేది తాత్కాలికం కారాదు. ప్రతి పనిలో, చదువులో ఇది ఉండాల్సిందే. ఎవరు నిరుత్సాహపర్చడానికి ప్రయత్నించినా, అకారణంగా డీమోటివేట్ అయ్యే స్థితిని తప్పించుకోవాలంటే, సొంతంగా ప్రేరణ పొందాలి. లక్ష్యం ప్రస్ఫుటంగా కనపడే మానసిక స్థితిని ఏర్పరుచుకుంటే ఇది సాధ్యం.
ఎవరో మోటివేట్ చేయాలను కోవద్దు
మనల్ని ఎవరో మోటివేట్ చేయాలని అనుకోవద్దు. నేను చేయగలను - సాధించగలను, కష్టపడగలను అనుకోవాలి. అప్పుడు చదవాల్సింది కొండంత ఉన్నా నిరుత్సాహం కలగదు. ఎగ్జామ్స్‌కు సంబంధించి సిలబ్‌సను క్షుణ్ణంగా పరిశీలించుకొని ప్రిపేర్ కావాలి. నిన్ను నీవు ఉత్సాహభరితంగా, సిద్ధం చేసుకోవడమే పోటీ పరీక్షల్లో ఒక క్రతువు! నీలోని ప్రేరణ శక్తులను నీవు గుర్తించాలి. అవి-
1) ఆలోచనలు 2) తీవ్రమైన ఇష్టం
3) ఆశించేది చేయాలనే బలమైన కోరిక
ఆశించేది సాధించడం కోసం ఏవిధంగా కష్టపడాలి అనేది తెలుసుకోవాలి. కార్పొరేట్ ఉద్యోగ ఇంటర్వ్యూల్లో తరుచుగా ఒక ప్రశ్న అడుగుతుంటారు. పది లేదా ఇరవై సంవత్సరాల తరవాత నిన్ను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నావు లేదా ఏ స్థాయికి చేరుకోవాలనుకుంటున్నావు. ఇది పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకూ వర్తిస్తుంది.
కలలు కనాలి!
మీరు రాసే పరీక్ష సివిల్స్ కావచ్చు. లేదా టీచర్ పోస్టు కోసం కావచ్చు. అది వస్తే ప్రజలతో ఎలా ప్రవరిస్తారో సరదాగా చిన్నపాటి కలను కనండి. ఆ కలను నిజం చేసుకోవడానికి మీరు పోటీపరీక్షల్లో పాసవడం ఎంత అవసరమో పదే పదే మననం చేసుకోండి. మనసులో అనుకోవడంలో తప్పులేదు(పైకి అంటే మాత్రం పగటి కలలు అనుకొనే ప్రమాదం ఉంది). దానిని నిజం చేసుకోవాలనే ప్రేరణ నిత్యమూ కలుగుతుంది. లక్ష్యం ఎప్పుడూ చేరుకుంటావు అని ప్రశ్నిస్తూనే ఉంటుంది! లక్ష్యం చేరుకునే వరకు ఆ నిప్పును ఆర్పవద్దు.
ఎప్పుడైనా నిరుత్సాహంగా అనిపించినపుడు ఇష్టమై న సంగీతాన్ని వినడం అలవాటు చేసుకోండి. కాసేపు పక్కనే ఉన్న పార్కుకో లేదా ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి ప్రశాంతంగా కూర్చొని పరికించి చుట్టూ చూడండి. పిల్లలూ - జంటలూ - పెద్దలూ కనపడుతుంటారు. జీవితం నిరంతర ప్రవాహం. సంగీతం, ప్రకృతీ పునరుత్సాహానికి తోడ్పడతాయన్న సంగతి మర్చిపోకండి.
ప్రిపరేషన్‌లో ప్రయారిటీ
లక్ష్యం చేరుకోవడానికి పోటీపరీక్షల్లో సంబంధించిన విషయాలను ప్రయారటైజ్ చేసుకోవాలి. అతి ముఖ్యం - ముఖ్యంగా విభజించుకోవాలి. ముఖ్యం కానివి కూడా ఆ జాబితాలోనే ఉన్నా తప్పలేదు. జీవితంలో నాకు కలిగిన ప్రేరణ గురించి చెబుతాను. పోలీసు వృత్తిలోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కనీసం ఎన్.సి.సి.లో కూడా చేరలేదు. సోషల్ సర్వీస్ కాడెట్‌గా మాత్రం అప్పుడప్పుడూ పనిచేశాను.
పీజీ పరీక్షలు రాసిన తరవాత మా ఊరికి వెళ్లాను. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న మా ఊరు కాలక్రమేణా తగాదాల గ్రామంగా మారింది. మునుల కొండ అనే పేరున్న మా గ్రామం ముదిగొండగా మారింది. ఇది ముదిగొండ చాణుక్యుల రాజధాని అని కూడా చరిత్రకారులు చెబుతారు. నేను యూనివర్సిటీలో పరీక్షలు రాస్తున్నప్పుడు మా ప్రత్యర్థులు నన్ను ఒక కేసులో ఇరికించారు. కింది స్థాయి పోలీసు అధికారులకు నా ఎబిలిటీని చెప్పినా పట్టించుకోలేదు. ఎస్‌పీని కలుద్దాం అని వెళితే అవకాశ ఇవ్వలేదు. చివరకు ధైర్యం చేసి నిర్ణయం తీసుకున్నాను. ఒక కాలేజీ సభలో మాట్లాడడానికి ఎస్‌పీ వస్తున్నాడని తెలిసి మీటింగ్‌లో శ్రోతగా కూర్చున్నాను. ఆయన ఉపన్యాసం అయిన తరవాత ఏమన్నా సందేహాలు ఉన్నాయా అని అడిగారు. వెంటనే నేను లేచి సార్ మీరు బాగా చెప్పారు. కానీ ఒక కంప్లయింట్‌తో మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తే కలవనివ్వడం లేదని చెప్పాను. ఆయన ఆశ్చర్యంగా చూసి బందోబస్తులో ఉన్న పోలీసును పిలిచి ఆ బాబును మీటింగ్ కాగానే నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత ఎస్‌పీగారికి కేసు పూర్వాపరాలు వివరిస్తే కింది పోలీసులపై యాక్షన్ తీసుకుని, నన్ను ఆ గండం నుంచి గట్టెక్కించారు. నేను డిసిపిగా హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆయన సిపిగా ఉండటం కాకతాళీయం. కింద స్థాయి పోలీసులు ఏవైనా తొందరపాటు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే ఆయన నా పూర్వవృత్తాంతాన్ని ఉదాహరణగా చెప్పి పరిస్థితి చక్కదిద్దేవారు.
ఆ సంఘటనే పోలీసు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేసేలా పురికొల్పింది. పోలీసు ఉద్యోగం స్వీకరించడానికి కూడా మా గ్రామ సంఘటనలే నన్ను ప్రేరేపించాయి. మోటివేషన్ అనేది ఎటునుంచి, ఎప్పుడు ఏర్పడుతుందో చెప్పలేం!
పోటీ పరీక్షలకు సంబంధించి మరో ఉదాహరణ చెబుతాను. ఆ ఉదాహరణ పేరు ఉత్కర్ష ద్వివేది. 2021లో సివిల్స్‌లో ఐదో ర్యాంకర్. ఎలా మోటివేట్ చేసుకోవాలో చెప్పాడు. నిరుత్సామైన పరిస్థితులను ఏవిధంగా అధిగమించవచ్చు అనేది అతను చక్కగా వివరించాడు.
సివిల్స్ పరీక్షలు వెలువడే సమయంలో అతను హరిద్వార్‌లో ఉన్నాడు. అక్కడ ఉన్న కారణాన్ని కూడా బాగా వివరించాడు. 2021లో రాసిన అటెంప్ట్ అతనికి మూడోది. క్రితం సారి ఫెయిల్ అయినప్పుడు తల్లి తప్ప పక్కన ఎవరూ లేరు. హరిద్వార్‌లో మా బంధువులు ఉన్నారు. అంతమందిలో ఉంటే ఒకవేళ విచారం కలిగించే వార్తవచ్చినా చుట్టూ ఉన్నవారు ఊరడింపు మాటలు చెబుతారు. నిబ్బరం కోల్పోకుండా చేస్తారన్నాడు. ఇది చూసేవారికి సాధారణంగా కనిపించవచ్చు. కానీ దెబ్బతిన్నప్పుడు నలుగురిలో ఉంటే వచ్చే మనోనిబ్బరం గొప్పగా ఉంటుంది.
2018లో మెకానికల్ ఇంజనీర్ కోర్సు పూర్తికాగానే అతను సివిల్స్ పరీక్షలకు సిద్దం కావడానికి ఢిల్లీకి వెళ్లాడు. కాలేజీ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే కోరికతో చదువుకునే సమయంలోనే ప్రిపరేషన్ మొదలు పెట్టలేదు. గ్రాడ్యుయేషన్ కాగానే ఇందులోకి దిగాడు. మోడల్ పరీక్షలు రాయడమే తన స్ర్టాటజీగా చెబుతాడు. ప్రిపరేషన్ మొదలు పెట్టిన సంవత్సరం నుంచి ఈ టెస్ట్‌లు ఉత్కర్ష చదువులో భాగమయ్యాయి.
యూపీఎఎస్సీ పరీక్షల్లో మన ఇంట్యూషన్‌పై ఆధారపడి సాల్వ్ చేసే ప్రశ్నలు కూడా ఉంటాయి. రీడింగ్ రిసోర్సెస్ కోసం స్పెక్ట్రమ్, ఎన్‌సీఈఆర్‌టి లాంటి వాటిపై ఆధారపడ్డాను అంటాడు ఉత్కర్ష. ఎగ్జామ్‌కు అటెండ్ అయ్యేనాటికి కొన్ని వందల టెస్ట్‌లు సాల్వ్ చేశాడు. అంతేకాదు, జవాబుల విశ్లేషణ కూడా చేసుకునే వాడు. తప్పు, ఒప్పు జవాబులను లోతుగా విశ్లేషిస్తేనే మంచి ఫలితాలు వస్తారుని అతని భావం. పోటీ పరీక్షలు రాసేవారు జీకే కోసం హిందూ, ఎక్స్‌ప్రెస్ లాంటి పేపర్లు చదువుతారు. దీనితోపాటు మెంటర్ కానీ, అనుభవం ఉన్న సంస్థలు గానీ వ్యక్తుల విజయానికి సహాయపడతాయన్న విషయాన్ని మరువద్దు అని సలహా ఇస్తాడు. ఫైనల్‌గా అతను తేల్చేది ఏమంటే విజయానికి షార్ట్‌కట్స్ ఉండవు అనే. సంకల్పంతోపాటు ఇష్టంగా చదవడం, - ప్రతి నిమిషం మోటివేట్ చేసుకోవడం అవసరం అంటాడు ఉత్కర్ష.
-రావులపాటి సీతారామారావు
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి