పాస్ అయ్యారు సరే.. అసలు టాస్క్ ఇప్పుడే..! ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..!

ABN , First Publish Date - 2023-05-17T15:43:58+05:30 IST

టెన్త్‌ నుంచి ఇంటర్‌ ఆపై సాధారణ డిగ్రీ, ఇంజనీరింగ్‌ తదితర డిగ్రీల ఫలితాలు ఒకటి తరవాత మరొకటి

పాస్ అయ్యారు సరే.. అసలు టాస్క్ ఇప్పుడే..! ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..!
colleges

టెన్త్‌ నుంచి ఇంటర్‌ ఆపై సాధారణ డిగ్రీ, ఇంజనీరింగ్‌ తదితర డిగ్రీల ఫలితాలు ఒకటి తరవాత మరొకటి వెలువడుతున్నాయి. తదుపరి కోర్సులు చేయాలనుకునే విద్యార్థులు సదరు కాలేజీ ఎంపికలో కనీసం కొన్ని విషయాలైనా సరి చూసుకోవాలి. అలాంటి జాగ్రత్తల్లో ఏవి కీలకమో ఒకసారి చూద్దాం.

మ న దేశంలో వెయ్యికిపైగా వర్సిటీలు, యూభై అయిదు వేలకు మించి వివిధ విద్యా సంస్థలు ఉన్నాయి. మూడున్నర వేల వరకు ఇంజనీరింగ్‌ కాలేజీలు, ఆరువేల వరకు ఎంబిఏ విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యారంగంలో నెలకొన్న పోటీ వాతావరణం దృష్ట్యా సంస్థలు వేటికవి తమ గొప్పలు చెప్పుకోవడాన్ని కూడా గమనిస్తున్నాం. సందేహం లేదు, కొంత గందరగోళం నెలకొంది. కోరుకున్న కోర్సునుబట్టి విద్యాసంస్థను ఎంపిక చేసుకోవడం నిజంగా హెర్క్యులస్‌ టాస్కే. ఈ నేపథ్యంలో..

మన వృత్తిగత జీవితాన్ని ప్రభావితం చేయబోయే కోర్సును ఎక్కడ చదివితే మంచిది అన్న ఆలోచన విద్యార్థుల్లో సహజంగానే ఉంటుంది. అందులో భాగంగా మొదట విద్యా సంస్థ ఎంపికను కీలక నిర్ణయంగానే భావించాల్సి ఉంటుంది. ఒక కాలేజీ ఎంపికలో నిజానికి అనేకానేక అంశాలు ఇతోధిక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా...

  • ఒక కాలేజీ పూర్తి స్థాయిలో మౌలిక వసతులను సమకూర్చుకునేందుకు కొద్ది సంవత్సరాలు పడుతుంది. అందుకే విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు కాలేజీ స్థాపించిన సంవత్సరాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి.

  • టీమ్‌ అంటే కాలేజీ వ్యవస్థాపకులు, ప్రమోటర్లు, ప్రమోటర్ల ప్రొఫైల్స్‌, క్రెడిబిలిటీ చూడాలి.

  • పెడగాగి కూడా ముఖ్యమే. సంస్థను బట్టి టీచింగ్‌, లెర్నింగ్‌ విధానాలు మారుతుంటాయి. అది విద్యార్థులు పొందే నాలెడ్జ్‌ నుంచి క్వాలిటి చివరకు నైపుణ్యాలపై ప్రభావం చూపుతుంది.

  • కోర్సును అనుసరించి కొన్ని మౌలిక సదుపాయాలు ఉండాలి. అలాగే కాలేజీకి మరికొన్ని అవసరం. సాధారణంగా ఆసుపత్రి/ప్రయోగశాల, లైబ్రరీ, తరగతి గదులు, సెమినార్‌ హాళ్ళు/ డిస్కషన్‌ రూమ్స్‌, హాస్టల్‌/ క్యాంటీన్‌, క్రీడలకు సదుపాయాలు, పరిశుభ్రత, చుట్టూ వాతావరణం వంటివి కూడా చెక్‌ చేసుకోవాలి.

  • ఇండస్ట్రీతో కొలాబిరేషన్‌ కూడా ముఖ్య అంశమే. లెర్నింగ్‌ ప్రాసె్‌సలో ఇండస్ట్రీ ఇన్‌పుట్స్‌ కూడా కలిస్తే జాబ్‌ మార్కెట్‌కు అనుగుణంగా ఎదిగే వీలు ఉంటుంది.

  • నిరుద్యోగం మితిమీరి ఉన్న ఈ రోజుల్లో ప్లేస్‌మెంట్‌ రికార్డు ఎలా ఉందన్నదీ చూడాలి. ప్లేస్‌మెంట్‌ ప్రాసె్‌సలో కాలేజీ అనుసరిస్తున్న పద్ధతులు, విధానాలు తెలుసుకోవాలి. సంఖ్యపరంగా, పర్సంటేజ్‌ రూపంలో ప్లేస్‌మెంట్‌ రికార్డ్‌ ఎలా ఉందన్నది చూడాలి.

  • కాలేజీ లొకేషన్‌ ఏమిటన్నదీ పట్టించుకోవాలి. ఆ పరిసరాల్లో ఉన్న సంబంధిత పరిశ్రమలూ కీలకమే.

  • ఒక సంస్థకు అది ఆఫర్‌ చేసే కోర్సుకూ వివిధ అనుమతులు అవసరం. అవన్నీ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి.

  • వ్యయాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫర్‌ చేసే ప్రయోజనాలు - పెడుతున్న వ్యయాన్ని బేరీజు వేసుకోవాలి.

అసె‌స్‌మెంట్స్‌

ఒక కాలేజీ ఎలాంటిది అన్నది తెలుసుకునేందుకు ఈ రోజు పలు ర్యాంకింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వేర్వేరు సంస్థలు కాలేజీలను మూల్యాంకన చేస్తున్నాయి. ఆ వివరాలు వెబ్‌సైట్ల నుంచి బిజినెస్‌ హౌసెస్‌ పబ్లికేషన్స్‌, మేగజైన్లు, ఎడ్యుటెక్‌ కంపెనీల నుంచి లభిస్తున్నాయి. అయితే ఈ ర్యాంకింగ్‌లను పూర్తిగా విశ్వసించలేం. అసె్‌సమెంట్‌లో పాల్గొన్న సంస్థలను మాత్రమే అవి ర్యాంకింగ్‌లోకి తీసుకుంటాయి. కొన్ని సంస్థలు మంచివే అయినప్పటికీ వాటికి ఉన్న అపోహలు, అంచనాలు, ప్రయోజనాల దృష్ట్యా ర్యాంకింగ్స్‌ పోటీలో పాల్గొనవు. అలాంటప్పుడు సదరు సంస్థలు గొప్పవైనప్పటికీ మనం వెతికే ర్యాంకింగ్స్‌లో కనిపించవు. జడ్జ్‌ చేయడం కష్టం. ఒక వేళ జడ్జ్‌ చేసినప్పటికీ అది వాస్తవానికి దగ్గర ఉండదు.

అయితే కొన్ని ర్యాంకింగ్స్‌ అలా కావు. ఒక మేర వివక్ష ఉన్నప్పటికీ వాటికి ప్రాముఖ్యం ఉంటుంది. ఉదాహరణకు కేంద్ర విద్యామంత్రిత్వశాఖ పరిధిలోని నేషనల్‌ ర్యాంకింగ్‌ ఇన్ఫర్మేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌). 2016 నుంచీ ర్యాంకింగ్స్‌ను మం జూరు చేస్తోంది. అయిదు పరామితులు - టీచింగ్‌, లెర్నింగ్‌ అండ్‌ రిసోర్సెస్‌, రీసెర్చ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌, ఔట్‌రీచ్‌ అండ్‌ ఇన్‌క్లూజివిటీ, గ్రాడ్యుయేషన్‌ ఔట్‌కమ్‌, పెరసెప్షన్‌కు తోడు 22 కీ ఫ్యాక్టర్స్‌ను పరిగణనలోకి తీసుకుని ర్యాంకింగ్స్‌ను మం జూరు చేస్తుంది. ఇలా పలు సంస్థల స్టడీ సమాచారం ఈ రోజల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండటమే కాదు, ఇన్‌స్టిట్యూట్‌ ఎంపికలో తోడ్పడుతున్నాయి.

మరికొన్ని

  • ర్యాంకింగ్స్‌ మాత్రమే కాకుండా మరి కొన్ని అంశాలు సైతం ఇన్‌స్టిట్యూట్‌ ఎంపికలతో తోడ్పడుతున్నాయి.

  • వెబ్‌సైట్స్‌: చక్కగా డిజైన్‌ చేసిన, యూజర్‌ ఫ్రెండ్లీ వెబ్‌సైట్‌లో మౌలిక సదుపాయాలు సహా సమస్త వివరాలు ఉంటాయి. అన్ని సోర్సుల నుంచి సమాచారం తీసుకోవడానికి, ర్యాంకింగ్స్‌కు ఇలాంటి వెబ్‌సైట్స్‌ అనువుగా ఉంటాయి.

  • అలూమ్నీ: సంస్థ పాత విద్యార్థులు ఉండే సంఘాలు అలూమ్ని పరిధిలోకి వస్తాయి. వారినుంచి మంచి ఫీడ్‌బ్యాక్‌ లభిస్తుంది. ఇంటర్న్‌షిప్స్‌, ప్రాజెక్టులు, ప్లేస్‌మెంట్స్‌కు ఇవి తోడ్పడతాయి. అయితే ఒపీనియన్‌ ఆధారిత ఫీడ్‌బ్యాక్‌ విషయంలో మాత్రం మరింత లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంటుంది.

  • లింక్డిన్‌ తదితర ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌లతో కనెక్ట్‌ అయితే ఇండస్ట్రీ ఫీడ్‌ బ్యాక్‌ తెలుస్తుంది. ప్లేస్‌మెంట్స్‌ కోసం తాము రెగ్యులర్‌గా సందర్శించే కాలేజీలకు సంబంధించిన ఫీడ్‌బ్యాకును వారు వాటిలో ఉంచుతారు. ఆ సమాచారం కూడా కాలేజీ ఎంపికకు తోడ్పడుతుంది.

  • చివరగా, కాలేజీ సందర్శన చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వేర్వేరు మార్గాల్లో ఆరా తీయడం ఒక ఎత్తు. స్వయంగా పరిశీలించడం, అక్కడ ఫ్యాకల్టీ, సీనియర్‌ విద్యార్థులతో మాట్లాడటం మరో ఎత్తు. తుది వడపోతలో తేలిన కొన్ని కాలేజీలనైనా సం దర్శించి, ఒక అంచనాకు రావడం మంచిది. అలా చేస్తే ఎంచుకున్న కెరీర్‌లో ఎదుగుదలకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Updated Date - 2023-05-17T15:43:58+05:30 IST