TSPSC: గ్రూప్-1 మెయిన్స్‌లో ఆదివాసి - గిరిజన పోరాటాల గురించి ఇలా..
ABN , First Publish Date - 2023-03-13T15:35:53+05:30 IST
భారత (India) సమాజంలో ఆదివాసీలు మూలవాసులు. ఒక ప్రత్యేక జీవన విధానంలో, సమాజంలోని ప్రధాన జన జీవన స్రవంతికి దూరంగా నివసిస్తున్న మానవ సముదాయం. ఆదివాసీలను, గిరిజనులను గుర్తించేందుకు ఇంగ్లీష్ భాషలో
భారత (India) సమాజంలో ఆదివాసీలు మూలవాసులు. ఒక ప్రత్యేక జీవన విధానంలో, సమాజంలోని ప్రధాన జన జీవన స్రవంతికి దూరంగా నివసిస్తున్న మానవ సముదాయం. ఆదివాసీలను, గిరిజనులను గుర్తించేందుకు ఇంగ్లీష్ భాషలో ట్రైబ్, ట్రైబల్స్ అనే పదాలను ఉపయోగిస్తారు. ఈ పదం లాటిన్ మూలాలు ఉన్న ‘ట్రైబుస్’ నుంచి వచ్చింది. సాధారణంగా డిక్షనరీ అర్థంలో ప్రధాన జన జీవన సముదాయానికి దూరంగా, ప్రత్యేక ఆచారాలు, అలవాట్లు, భాష, సంస్కృతితో జీవనం సాగించే మానవ బృందాలు ఆదివాసీలు, గిరిజనులుగా గుర్తింపు పొందుతున్నారు.
భారతదేశం అతిపురాతన మానవ సముదాయాలను కలిగిన దేశం. భిన్న జాతులకు, సంస్కృతులకు ఈ దేశం నిలయం. మనదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రధానంగా అటవీ ప్రాంతాల్లో వీరి జీవన విధానం తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. భారత దేశ ఆదివాసుల్లో గోండులు, ఛీల్స్, సంతాల్, ముంద్ర, ఖాసీ, గోరా, బుటియా, చెంచు, కోడబ, గ్రేట్ అండమానీస్ ముఖ్యులు. వీరితోపాటు అనేక ప్రాంతాల్లో ప్రత్యేక జీవన శైలి, ఆదివాసీ జీవన విధానం గల అనేక ప్రాంతీయ తెగలు ఉన్నాయి. తరవాతి కాలాల్లో ప్రధానంగా గిరి ప్రాంతాల్లో, మైదానాల్లో నివసించే ప్రత్యేక జీవన సంస్కృతుల ప్రజలు ట్రైబల్స్‌గా గుర్తింపుపొందారు. స్వాతంత్య్రం అనంతరం ప్రభుత్వాలు వీరికి ఆదివాసులతో పాటు ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు కల్పించారు.
పోటీ పరీక్షలకు సంసిద్ధం అవుతున్న అభ్యర్థులు ట్రైబల్ జనసముదాయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలి. భారతీయ మూలవాసులుగా, ప్రత్యేక అస్తిత్వం ఉన్న జనవాహినిగా వీరిపై ప్రత్యేక అధ్యయనం అవసరం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు భారతీయ ఆదివాసులు, గిరిజనులతో పాటు తెలంగాణ తెగల జనసముదాయాలపై మెటీరియల్, నోట్స్ తయారు చేసుకోవాలి.
భారతదేశంలో దాదాపు 705 తెగలకు సంబంధించిన ప్రత్యేక ప్రజలు ఉన్నారు. వీరిలో సంతాల్ అతి పెద్ద ఆదివాసి జన సముదాయం కాగా, ఇండో-భుటానియన్ తెగ అతి చిన్నది. ఆదివాసీ తెగలు తమ అస్తిత్వ రక్షణ కోసం అనేకసార్లు బ్రిటిష్ ప్రభుత్వంతో వీరోచిత పోరాటాలు చేశారు. స్వాతంత్య్రం అనంతరం కూడా వారి స్వీయ పాలన, హక్కుల రక్షణ కోసం పోరాటాలు అక్కడక్కడ, అప్పుడప్పుడూ నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ భూమికగా వీరి పోరాటాలు, సమస్యలపై అవగాహన కోసం ఆదివాసీలు, గిరిజనుల అంశాలను సిలబ్‌సలో చేర్చారు.
దక్షిణ భారతదేశంలో అతి ఎక్కువ ఆదివాసి, గిరిజన ప్రజలు ఉన్న రాష్ట్రం తెలంగాణ.
2011 జనాభా లెక్కలను అనుసరించి ఐదు లక్షల గిరిజన కుటుంబాలు(27,50,000 జనాభాతో) ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర జనాభాలో వీరు తొమ్మిది శాతం. కోయ, గోండు, నాయక్‌పోడ్, మన్నేవార్, గుత్తికోయ, అంద్‌లకు చెందిన ఆదివాసీలు తెలంగాణలో ఉన్నారు.
1977లో ఇందిరాగాంధీ..లంబాడ, ఎరుకల, సుగాలి జాతులను ఎస్టీ జాబితాలో చేర్చారు.
తెలంగాణలో గిరిజనులు, ప్రధానంగా ఆదివాసీలు. దారిద్య్రరేఖకు దిగువన జీవితాలను నేటికీ కొనసాగిస్తున్నారు.
స్వాతంత్ర్యానికి పూర్వం గిరిజన చట్టాలు
1857లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అడవులపై కాంట్రాక్ట్ విధానాన్ని అవలంభించింది. అడవుల నరికివేతకు పాల్పడింది. ఈ చర్యలకు వ్యతిరేకంగా రోహిల్లాల సహాయంతో బ్రిటిషువారిపై రాంజీగొండు నిర్మల్ కేంద్రంగా తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో అతన్ని, అతని అనుచరులను ఊడల మర్రిపై ఉరితీశారు.
బ్రిటిష్ చట్టాలకు అనుకూలంగా నిజాం రాజు 1865, 1878, 1894లో చట్టాలను రూపొందించారు. సైమన్ కమిషన్ నివేదికను అనుసరించి అడవులపై అధికారం రాష్ట్రాలకు ఇచ్చారు. ఈ విషయాన్ని 1935 చట్టంలో చేర్చారు. ఈ చట్టానికి అనుగుణంగా 1937లో అడవులపై ఆదివాసీల హక్కులను పరిమితం చేస్తూ మరొక చట్టాన్ని నిజాం ప్రభుత్వం చేసింది. ఈ చట్టానికి వ్యతిరేకంగానే కొమరంభీం ‘జల్-జంగిల్, జమీన్’ నినాదంతో తిరుగుబాటు చేశాడు. భీం అమరత్వం అనంతరం హైమెన్‌డార్ఫ్ సూచనలతో గిరిజన చట్టాలలో మరికొన్ని మార్పులను, సంస్కరణలను నిజాం ప్రభుత్వం చేపట్టింది. వీటికి అనుగుణంగానే 1948లో మరికొన్ని చట్టాలు చేశారు.
స్వాతంత్య్రం అనంతర పరిస్థితి
భారత రాజ్యాంగంలో 244(1)ని అనుసరించి రాష్ట్రపతి షెడ్యూల్ ప్రాంతాలను నిర్ణయిసారు.
(ఎ) ఆదివాసీలు అధికంగా నివసించే ప్రాంతం
(బి) ఆదివాసీ చట్టాలు చేసేందుకు అనువైన ప్రాంతం
(సి) ఆర్థికంగా వెనుకబడిన ఆదివాసీలు ఉన్న ప్రాంతం
రాజ్యాంగాన్ని అనుసరించి, మధ్య భారతదేశంలో ఉన్న ఆదివాసీలను 5వ షెడ్యూల్‌లో, ఈశాన్య భారత్‌లోని ఆదివాసీలను 6వ షెడ్యూల్‌లో చేర్చారు. మధ్య భారతదేశంలోని షెడ్యూల్ ఏరియాలోనే తెలంగాణ ప్రాంతాన్ని చేర్చారు.
తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలోని 1504 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి.
1959 అటవీ చట్టం
ఈ చట్టాన్ని అనుసరించి ఆదివాసీ ప్రాంతాల్లోని ఆస్తులను అమ్మడం కాని, కొనడం కాని నిషేధం.
ఆదివాసీ భూములను గిరిజన సహకార సంస్థలో తప్ప మరెవ్వరికీ బదిలీ చెయ్యరాదు.
1959 చట్టంపై సుప్రీంకోర్టు ‘సమత’ అనే సంస్థ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ చట్టాన్ని సమర్థిస్తూ కొన్ని సూచనలు చేసింది. ఈ సూచనలకు అనుగుణంగా 1/70 చట్టం చేశారు.
1. 1/70 యాక్ట్‌ను అనుసరించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భూమిపై సంపూర్ణ హక్కు ఆదివాసీలదే.
2. ఆదివాసి సహకార సంస్థల్లో 100 శాతం ఆదివాసీలే ఉండాలి.
3. భూ బదలాయింపు అంటే అమ్మకం, కౌలుకు ఇవ్వడం, బహుమతిగా ఇవ్వడం...ఇవేవీ కూడా చెల్లవు.
4. ఒకవేళ భూములు అమ్మాల్సి వస్తే ప్రభుత్వమే కొని భూమిలేని గిరిజనులకు పంచి ఇవ్వాలి.
5. గిరిజనుల ఇండ్లను అద్దెకు గాని, ఇతరులకు వారసత్వంగా గాని ఇవ్వకూడదు
6. ఒకవేళ గిరిజనేతరులకు స్థిరాస్తులు ఉంటే, అవి తమవే అని నిరూపించుకునే బాధ్యత వారిదే.
7. ‘మహళ్లు’పై పూర్తి హక్కు గిరిజనులదే. వసూళ్లు అంటే సామాజిక భూములు, పొరంబోకు భూములు, పచ్చిక బయళ్లు, లంక భూములు, అటవీ భూములు, గనులు, క్వారీలు, వాగులు, కుంటలు, చెరువులు.
8. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం1998
ఈ చట్టాన్నే ‘పీసా’ చట్టం అని కూడా అంటారు. ఈ చట్టాన్ని అనుసరించి షెడ్యూల్ ప్రాంతాల్లో అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులకు భూసేకరణ జరగాలంటే గ్రామ సభల అభిప్రాయాన్ని తీసుకోవాలి.
2006 చట్టం
ఈ చట్టాన్ని పార్లమెంట్ (Parliament) చేసింది. ఈ చట్టాన్ని అనుసరించి 2015 డిసెంబరు 13 నాటికి అటవీ భూములపై ఆదివాసీలకు ఇప్పుడున్న భూములన్నింటిని గ్రామసభలు స్వాధీనం చేసుకుని గిరిజనులకు వాటిపై పట్టాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గిరిజనులతో స్వయం పాలక మండళ్లు ఏర్పాటు చేయాలి.
తెలంగాణలో ఆదివాసీల సమస్యలు
గోదావరిలోయ అంతా ఆదివాసీల నివాస ప్రాం తం. తరవాత కాలంలో ఈ ప్రాంత భూము లు కోస్తాంధ్రుల చేతుల్లోకి వెళ్లాయి. 1920 నిజాంసాగర్ నిర్మాణం నుంచే ఇది మొదలైంది.
ఆదివాసీల నుంచి భూబదలాయింపు జరిగింది.
కోస్తాంధ్ర సంస్కృతికి లోనయ్యారు.
ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు విస్తరించాయి ఖమ్మం జిల్లాలో విషజ్వరాలు, ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కలరా గిరిజనుల మరణాలకు కారణమయ్యాయి.
పాత ఖమ్మం జిల్లాలో ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం; పాత వరంగల్ జిల్లాలో తాడ్వాయి, పస్రా, గోవిందరావు పేట, మంగపేట; పాత కరీంనగర్ జిల్లాలో మంథని, ఎల్లవరం; పాత ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు, ఖానాపూర్; పాత నిజామాబాద్ జిల్లాలో మంజీరా నదీ తీరం ఎక్కువగా వలసీకరణ జరిగింది. క్రమంగా గిరిజనుల కష్టాలు నక్సలైట్ల ఉద్యమానికి అవకాశాన్ని ఇచ్చాయి.
ఇంద్రవెల్లి సంఘటన
1981 ఏప్రిల్ 20న గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి. ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. అయినప్పటికీ ఆరోజు అంగడి కావడం వల్ల ఆదివాసీలు ఇంద్రవెల్లికి చేరుకున్నారు.
ఎటువంటి హెచ్చరికలు లేకుండా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు ప్రభుత్వ లెక్కలు పేర్కొంటుండగా, ప్రజా సంఘాలు మాత్రం 100 మంది మరణించినట్లు తెలిపాయి. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఈ క్రమంలోనే 1984లో సత్నాల ప్రాజెక్టు కోసం గిరిజనుల పోరాటం, 1988 ఆదివాసీల కరువు దాడులు...వంటివి ఆదివాసీల పోరాటాలకు కొన్ని ఉదాహరణలు. గిరిజనుల ప్రస్తుత నినాదం ‘మానాటే మారాజ్’(మా గ్రామంలో మా రాజ్యం)
గిరిజన ఉద్యమాలు లేవనెత్తిన ప్రశ్నలు
1. అటవీ ప్రాంతంపై హక్కులు
2. భూములు(కోల్పోయిన) తిరిగి స్వాధీనం చేయడం
3. గ్రామ స్వరాజ్యం
4. స్వతంత్ర జీవన విధానం
5. విద్యా వైద్య సౌకర్యాలు
6. అభివృద్ధిలో వాటా
వాస్తవానికి ఆదివాసీల అధ్యయనం సుదీర్ఘమైంది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశ అభివృద్ధి నేటికీ ఆదివాసీల సమస్యలను పరిష్కరించలేకపోయింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఆదివాసీల సమస్యలు, పోరాటాలు, రాజ్యాంగపరమైన పరిష్కారాలను పాలిటీ-గవర్నెన్స్, సమాజ నిర్మితి మొదలైన సబ్జెక్టుల్లో భాగంగా అధ్యయనం చేయాలి. తెలంగాణ ఆదివాసీ, గిరిజన అంశాలను తెలంగాణ ఉద్యమంలో భాగంగా అకడమిక్ కోణంలో చదవాలి.
తెలంగాణ రాష్ట్రం(Telangana)లో ఆదివాసీల పోడు భూముల సమస్య ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసిన చట్టాలకు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న చట్టాలను పోల్చి అధ్యయనం చేయాలి.
-డాక్టర్ రియాజ్
సీనియర్ ఫ్యాకల్టీ, అకడమిక్ డైరెక్టర్,
5 మంత్ర కెరీర్ పాయింట్, హైదరాబాద్