తెలంగాణ ‘దోస్త్’ దరఖాస్తు ఇలా..! అందుబాటులో ఉండే కోర్సు ఇదే..!
ABN , First Publish Date - 2023-05-13T12:38:14+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి - రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)’ 2023 నోటిఫికేషన్‌ను విడుదల
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి - రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)’ 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల అనుబంధ కళాశాలలతోపాటు నూతనంగా ఏర్పాటైన తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలోనూ అడ్మిషన్స్ ఇస్తారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే పాలిటెక్నిక్ డిప్లొమా ప్రోగ్రామ్‌లు పూర్తిచేసినవారు, కంపార్ట్‌మెంటల్ ద్వారా పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు విడతల్లో ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తారు. జేఎన్‌టీయూహెచ్ అందిస్తున్న బీబీఏ డేటా అనలిటిక్స్ కోర్సులో ఉన్న 60 సీట్లను కూడా ‘దోస్త్’ ద్వారానే భర్తీ చేయనున్నారు. ఈ సంవత్సరం నుంచి నాలుగేళ్ల వ్యవధి గల బీఎస్సీ ఆనర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కోర్సును నూతనంగా ప్రవేశపెడుతున్నారు. ఇందులో చేరినవారు మూడేళ్ల తరవాత డిగ్రీతో కోర్సు నుంచి వైదొలగే వీలుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు ప్రభుత్వ కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది.
ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉన్న మొబైల్ ద్వారా దోస్త్ వెబ్‌సైట్‌లో నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాలలో బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తిచేసి దోస్త్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫొటో అథెంటికేషన్‌తో టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా కూడా రిజిస్టర్ కావచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరవాత దోస్త్ ఐడీ, పిన్ వస్తాయి. వీటిని జాగ్రత్త చేసుకోవాలి.
ఈ సంవత్సరం దోస్త్ యాప్ అందుబాటులోకి వస్తుంది. దీనిని అభ్యర్థులు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌కు ఆధార్ ఎనేబుల్డ్ ఫేషియల్ రీడింగ్ తప్పనిసరి.
దోస్త్ ఐడీ, పిన్ లేదా పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయితే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. దీనిని నింపిన తరవాత విద్యార్థి ప్రయారిటీ ప్రకారం కోర్సు, కాలేజీ వివరాలను వెబ్ ఆప్షన్స్ కింద ఇవ్వాలి. విద్యార్థి మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్ అలాట్ అవుతుంది.
అభ్యర్థులు తమకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లను(ఎన్‌సీసీ/సీఏపీ/పీహెచ్/ ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్) దగ్గరలోని హెల్ప్ లైన్ సెంటర్‌లో వెరిఫై చేయించుకోవాలి.
ముఖ్య సమాచారం
ఫేజ్-1:
దరఖాస్తు ఫీజు: రూ.200
రిజిస్ట్రేషన్: మే 16 నుంచి జూన్ 10 వరకు
వెబ్ ఆప్షన్స్: మే 20 నుంచి జూన్ 11 వరకు
స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్: జూన్ 8, 9
సీట్ అలాట్‌మెంట్: జూన్ 16న
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 16 నుంచి 25 వరకు
ఫేజ్-2:
దరఖాస్తు ఫీజు: రూ.400
రిజిస్ట్రేషన్: జూన్ 16 నుంచి 26 వరకు
వెబ్ ఆప్షన్స్: జూన్ 16 నుంచి 27 వరకు
స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్: జూన్ 26
సీట్ అలాట్‌మెంట్: జూన్ 30న
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూలై 1 నుంచి 5 వరకు
ఫేజ్-3:
దరఖాస్తు ఫీజు: రూ.400
రిజిస్ట్రేషన్: జూలై 1 నుంచి 5 వరకు
వెబ్ ఆప్షన్స్: జూలై 1 నుంచి 6 వరకు
స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్: జూలై 5
సీట్ అలాట్‌మెంట్: జూలై 10న
ఆన్‌లైన్ సెల్ప్ రిపోర్టింగ్: జూలై 10 నుంచి 14 వరకు
అదనపు సమాచారం
కళాశాలల్లో అభ్యర్థుల రిపోర్టింగ్: జూలై 10 నుంచి 15 వరకు
స్టూడెంట్స్ ఓరియంటేషన్: జూలై 11 నుంచి 15 వరకు
మొదటి సెమిస్టర్ ప్రారంభం: జూలై 17 నుంచి
వెబ్‌సైట్: dost.cgg.gov.in