TS TET Special: ఏ సబ్జెక్టును ఎలా చదవాలి? నిపుణులు ఏమంటున్నారంటే..!

ABN , First Publish Date - 2023-08-21T12:58:23+05:30 IST

భారతదేశంలో సీటెట్‌, రాష్ట్రస్థాయిలో టెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి ప్రధాన అర్హత. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలు కేవలం టెట్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా గుర్తించాలి. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ నోటిఫికేషన్స్‌లో టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలని పేర్కొంటారు.

TS TET Special: ఏ సబ్జెక్టును ఎలా చదవాలి? నిపుణులు ఏమంటున్నారంటే..!

‘‘తమసోమ జ్యోతిర్గమయ- అసతోమ సద్గమయ’’ అంటే చీకట్ల నుంచి వెళుతురులోకి ప్రయాణం. సమాజంలోని నూతన తరాలను అజ్ఞానం నుంచి జ్ఞాన ప్రపంచంలోకి తీసుకొని రావడంలో ఉపాధ్యాయ పాత్ర అద్వితీయం. భారతదేశంలో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రతిభ, నైపుణ్యం ప్రాతిపదికగా అభ్యర్థులను రప్పించడం కోసం, నాణ్యతతోకూడిన గుణాత్మక విద్యను అందించడం కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించాలని దశాబ్దకాలం క్రితం సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర స్థాయిలో సీటెట్‌, రాష్ట్ర స్థాయిలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెట్‌లో ఒక్కసారి పాసయితే జీవితకాలం అర్హత కొనసాగుతుంది.

భారతదేశంలో సీటెట్‌, రాష్ట్రస్థాయిలో టెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి ప్రధాన అర్హత. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలు కేవలం టెట్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా గుర్తించాలి. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ నోటిఫికేషన్స్‌లో టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలని పేర్కొంటారు.

సిలబస్‌

విద్యా హక్కు చట్టం-2009 స్పష్టంగా ఉపాధ్యాయులు టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంది. సమగ్ర అవగాహన, బోధన అంశాలపై నైపుణ్యాన్ని పరీక్షిస్తుంది.

సిలబస్‌లో సబ్జెక్టుల వారీగా కేటాయించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ కొనసాగించాలి. ఈ పరీక్షల్లో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. అర్హత మార్కులు 60 శాతం రావాలి. అంటే 150 మార్కులకు గాను 90 మార్కులు సాధించాలి. ఓబీసీ అభ్యర్థులకు 50 శాతం; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు. టెట్‌లో సాధించే మార్కులకు టీఆర్‌టీ(టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌)లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

ఏ సబ్జెక్టును ఎలా చదవాలి?

శిశు వికాసం- బోధన శాస్త్రం:- శిశు వికాసం విభాగాన్ని సాధారణంగా సైకాలజీ సబ్జెక్టుగా పిలుస్తారు. కానీ దీనిలో కొన్ని సమాజ శాస్త్ర అంశాలు, తాత్విక అంశాలు కూడా కలిపి సమగ్ర శిశు వికాసం సిలబ్‌సను తయారు చేశారు. అభ్యర్థుల విజయంలో ఈ సబ్జెక్ట్‌ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రధానంగా వికాస దశలు దానికి అన్వయించే అభ్యసన సిద్ధాంతాలు సిలబస్‌లో కీలకమైనవి. వ్యక్తి జీవితంలో బాల్యం ప్రధానమైంది. ఈ దశ పూర్తిగా పాఠశాలలోనే నిర్దేశితమవుతుంది. వివిధ వికాస దశల ద్వారా కొనసాగే ఈ కాలంలో విద్యార్థికి ఉపయోగపడే అభ్యసన సిద్ధాంతాలకు సిలబ్‌సలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత సిలబ ్‌సలో ‘జాన్‌ పియాజె’ ప్రతిపాదించిన నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాలపై అవగాహన అత్యవసరం. శిశు కేంద్రీకృత విద్య అనంతరం ప్రశ్నల సరళిలో ప్రధాన మార్పులు వచ్చాయి. తరగతి అన్వయంతో అధ్యయనం జరగాలి.

పెడగాగిగా పిలిచే అధ్యయన శాస్త్రం మొత్తం తరగతి గది నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. తరగతి బోధనలో నూతన పోకడలు, విద్యార్థి-ఉపాధ్యాయ పరస్పర చర్యలు, బోధనలో నూతన సిద్ధాంతాలు, విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, అభ్యసనపై వాటి ప్రభావం తదితరాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.

విద్యార్థులకు తాము చదివిన డీఈడీ, బీఈడీ పాఠ్యపుస్తకాలు, ఇంతకు ముందు నిర్వహించిన పరీక్ష పత్రాలు మిక్కిలి ఉపయోగకరంగా ఉంటాయి.

భాషా శాస్త్రాలు:- సిలబస్‌ పేపర్‌-1లో ప్రాంతీయ భాషలు, పేపర్‌-2లో ఇంగ్లీ్‌షను అంతర్భాగంగా చేశారు. నిర్ధిష్టమైన సిలబ్‌సను దీనికోసం కేటాయించారు. ఎక్కువ మంది విద్యార్థులు తెలుగును ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు నిర్దేశించిన సిలబస్‌ను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాఠశాల స్థాయి భాషా శాస్త్ర పుస్తకాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. గత ప్రశ్న పత్రాల అధ్యయనం కూడా అవసరమని అభ్యర్థులు గ్రహించాలి. పేపర్‌-2లో ఇంగ్లీష్‌ ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు లేదా తెలుగు మీడియం విద్యార్థులకు చాలెంజింగ్‌గా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గత ప్రశ్న పత్రాలను పరిశీలించి, ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవాలి.

సబ్జెక్టు అంశాలు

పేపర్‌-1లో మేథ్స్‌, పరిసరాల విజ్ఞానం ప్రధాన సబ్జెక్టు అంశాలు. 1 నుంచి 5వ తరగతి వరకు ఈ అంశాలపై పట్టు సాధించాలి. టెక్స్‌ట్‌ బుక్స్‌తో పాటు ఉపాధ్యాయ కరదీపిక, వర్క్‌బుక్‌, ముందుమాట మొదలైన అంశాలపై కూడా అభ్యర్థులు ఫోకస్‌ చేయాలి.

పేపర్‌-2 వివిధ మెథడాలజీలకు సంబంధించింది. అభ్యర్థులు తాము చదివిన డిగ్రీ, బీఎడ్‌ మెథడాలజీల నుంచి తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. సిలబ్‌సలో 6 నుంచి 8 వరకు అని నిర్దేశించినప్పటికీ, 9, 10 తరగతులు కూడా చదవడం అవసరం. సబ్జెక్టులోనే భాగంగా పెడగాగి కూడా అధ్యయనం చేయాలి. పెడగాగి కోసం ప్రత్యేకంగా నోట్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి.

డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ డైరెక్టర్‌,

5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌

Updated Date - 2023-08-21T12:58:23+05:30 IST