AP Education: విద్యార్థుల సర్టిఫికెట్లు మార్చేశారు! పేర్లూ కనుమరుగు..!
ABN , First Publish Date - 2023-09-21T11:26:36+05:30 IST
పాఠశాల విద్యారంగాన్ని జగన్ ప్రభుత్వం చెడుగుడు ఆడుకుంటోంది. మొన్నటి వరకూ సీబీఎ్‌సఈ పాట పాడి... ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ బాకలారియేట్ ఆర్గనైజేషన్(ఐబీవో)తో కలసి ఇకపై రాష్ట్రంలో
ఇకపై ఐబీవోతో కలసి జాయింట్ సర్టిఫికేషన్
టెన్త్, ఇంటర్మీడియట్ పేర్లూ కనుమరుగు
అన్ని సర్టిఫికెట్లపైనా ఐబీవో లోగో తప్పనిసరి
అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యారంగాన్ని జగన్ ప్రభుత్వం చెడుగుడు ఆడుకుంటోంది. మొన్నటి వరకూ సీబీఎ్‌సఈ పాట పాడి... ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ బాకలారియేట్ ఆర్గనైజేషన్(ఐబీవో)తో కలసి ఇకపై రాష్ట్రంలో జాయింట్ సర్టిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ సమక్షంలో బుధవారం వెలగపూడి సచివాలయంలో ఒప్పందం జరిగింది. అయితే ఈ విధానాన్ని కచ్చితంగా ఎప్పటినుంచి, ఎన్ని దశల్లో అమలు చేస్తారనే విషయాన్ని స్పష్టం చేయలేదు. కానీ తాజా ఒప్పందంతో ఇప్పటివరకూ ఎస్‌ఎ్‌ససీ బోర్డు జారీచేసే టెన్త్ సర్టిఫికెట్, ఇంటర్ బోర్డు జారీచేసే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ల రూపం మారిపోనుంది. ఇప్పటివరకూ ఆయా బోర్డుల పేరుతో జారీ అయ్యే సర్టిఫికెట్లపై ఐబీవోకు చెందిన లోగో తప్పనిసరిగా ఉంటుంది. అలాగే పదో తరగతి, ఇంటర్మీడియట్ అనే పేర్లు కూడా ఇకపై కనిపించవని ప్రభుత్వం చెబుతోంది. కొత్త విధానంలో నాలుగు రకాల కోర్సులుంటాయని... 1 -5 వరకు ప్రైమరీ ఇయర్స్ ప్రొగ్రామ్(పీవైపీ), 6- 10 వరకు మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్(ఎంవైపీ), 11, 12 తరగతుల్లో డిప్లొమా ప్రోగ్రామ్(డీపీ) ఒకటి, ఐబీ కెరీర్ రిలేటెడ్ ప్రోగ్రామ్(ఐబీసీపీ) ఉంటాయని వివరించింది. సర్టిఫికెట్లు కూడా అలాగే జారీచేస్తారు. అయితే 1- 5 వరకు సర్టిఫికెట్లు ఇచ్చే అంశంపై స్పష్టత లేదు. మార్కుల స్థానంలో ఇకపై అన్నీ గ్రేడ్ పాయింట్లే ఉంటాయి. అలాగే కొత్త విధానంలో మాతృభాషను పూర్తిగా ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తోంది. ఐబీ విధానం వల్ల విద్యార్థి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడతాడని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ సిలబ్‌సను ఇక్కడ అమలు చేయడం సాధ్యమేనా? బోధనా సామర్థ్యాలు, అర్థం చేసుకోగలిగే సామర్థ్యం అనే అంశాలను గాలికొదిలేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 224 పాఠశాలల్లోనే ఐబీ సిలబస్ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 45వేల ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అమలుచేయాలని నిర్ణయించింది. అలాగే ప్రైవేటు పాఠశాలల్లోనూ అమలుచేయాలని ఒత్తిడి చేస్తోంది. రాష్ట్రంలో 40లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుతున్నారు. అంతమందికి సర్టిఫికేషన్ ఎలా చేస్తుందనే అనుమానాలు ఉన్నాయి. కాగా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాక పాఠశాలల పేర్ల ముందు ‘ఇంటర్నేషనల్’ అనే పదాన్ని చేర్చనున్నారు. వచ్చే ఏడాది ఎన్ని పాఠశాలల్లో ఐబీని అమలుచేస్తారనేది స్పష్టత లేకపోయినా మొత్తంగా 12 ఏళ్ల లక్ష్యం అని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఏడాది ఒక తరగతి చొప్పున 12ఏళ్లలో 1 నుంచి 12వ తరగతి వరకు ఐబీ అమలుచేసే అవకాశం ఉండొచ్చని అర్థమవుతోంది. అయితే సీఎం జగన్ మాత్రం తొలుత 10, 12 తరగతులపై ఎక్కువ దృష్టి పెట్టాలని చెబుతున్నారు. మరోవైపు దీనిని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పదేళ్ల తర్వాత ఫలితాలు: సీఎం
బుధవారం సచివాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఐబీవో ప్రతినిధులు, పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఐబీ వల్ల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడతారన్నారు. ఇప్పుడు ఈ చేపట్టిన ఈ చర్యల ఫలితాలు పదేళ్ల తర్వాత కనిపిస్తాయన్నారు. ఐబీవో డైరెక్టర్ జనరల్ ఒల్లి-పెక్క హైనొనెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఐబీ అందించాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం భారతదేశంలో 224 పాఠశాలల్లో ఐబీ అమలవుతోందన్నారు. సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్‌రెడ్డి, ఐబీ సీడీఓ మ్యాట్ కోస్టెల్లో తదితరులు పాల్గొన్నారు.