Amma odi scheme: అమ్మఒడిలో మళ్లీ కోత! ఈసారి ఎందుకంటే..!

ABN , First Publish Date - 2023-06-17T11:47:26+05:30 IST

అమ్మఒడి పథకంలో జగన్‌ సర్కారు కోతలు కొనసాగిస్తోంది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా తల్లులకు

Amma odi scheme: అమ్మఒడిలో మళ్లీ కోత! ఈసారి ఎందుకంటే..!
Amma odi scheme

ఖాతాల్లో వేసేది 15 వేలు కాదు.. 13 వేలే

టాయిలెట్లు, బడుల నిర్వహణ పేరుతో

సర్కారుకు రూ.870 కోట్ల నిధులు మిగులు

22న లబ్ధిదారుల జాబితా.. 28న నగదు జమ

జగన్‌ ఐదేళ్ల పాలనలో ఇదే చివరిది, నాలుగోది

ఓ విడత ఎగవేత.. మళ్లీ 2024 జూన్‌లోనే

3 విడతల్లో మొత్తం రూ.2,200 కోట్లు కట్‌

అయినా పూర్తిగా ఇస్తున్నట్టు గొప్పలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): అమ్మఒడి పథకంలో (Amma odi scheme) జగన్‌ సర్కారు (JAGAN Government) కోతలు కొనసాగిస్తోంది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా తల్లులకు రూ.15 వేలు ఇవ్వకుండా, ఈ ఏడాది కూడా రూ.13 వేలు మాత్రమే జమ చేయనుంది. 2023 అమ్మఒడి పథకంపై శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ అవుతాయని, మరో రూ.2 వేలు టాయిలెట్ల నిర్వహణ, పాఠశాలల భవనాల నిర్వహణ నిధికి వినియోగిస్తారని పేర్కొంది. ప్రైవేటు బడుల్లో చదివే విద్యార్థుల తల్లులకు కోత పెట్టే రూ.2 వేలు నగదులో రూ.1000 జిల్లా టాయిలెట్‌ నిర్వహణ నిధి(డీటీఎంఎ్‌ఫ)కి, మరో రూ.1000 జిల్లా పాఠశాలల నిర్వహణ నిధి(డీఎ్‌సఎంఎఫ్‌) ఖాతాలకు జమ చేస్తారని తెలిపింది. టెన్త్‌ తర్వాత ఇంటర్‌లో చేరే వారికి పథకం కొనసాగుతుందని పేర్కొంది. ఐటీఐ, పాలిటెక్నిక్‌, ట్రిపుల్‌ ఐటీల్లో చేరే వారికి విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు వర్తిస్తాయని, వారికి అమ్మఒడి ఉండదని స్పష్టం చేసింది. ఈ నెల 22న లబ్ధిదారుల జాబితా ప్రకటించి, 28న అమ్మఒడి నగదు ఖాతాల్లో జమ చేయనున్నట్టు వెల్లడించింది. 2022లో ఒకటి నుంచి ఇంటర్‌ వరకు 82,31,502 మంది విద్యార్థులు ఉండగా, 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి జమ చేశారు. ఒక్కొక్కరికి రూ.13 వేలు జమ చేశారు. ఈ ఏడాది కూడా అంతే మొత్తం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కోత పెట్టి.. ఇచ్చినట్టు ప్రచారం

ఇప్పటి వరకూ జగన్‌ ప్రభుత్వం మూడుసార్లు అమ్మఒడి నగదు ఇచ్చింది. ఇప్పుడు ఇవ్వబోయేది నాలుగో విడత. మొదటి విడతలో ఎలాంటి కోతలు లేకుండా రూ.15 వేలు జమ చేసింది. రెండో విడతలో టాయిలెట్ల నిర్వహణ నిధి అంటూ రూ.1000 కోత పెట్టింది. దీంతో ఆ ఏడాది ప్రభుత్వానికి రూ.445 కోట్లు మిగిలాయి. మూడో విడతలో గతేడాది టాయిలెట్ల నిర్వహణకు రూ.1000, పాఠశాలల నిర్వహణకు మరో రూ.1000 అంటూ మొత్తం రూ.2 వేలు కోత పెట్టింది. దీంతో రూ.879 కోట్లు ప్రభుత్వానికి మిగిలాయి. ప్రభుత్వం మాత్రం కోత పెట్టిన నగదు కూడా కలిపి అమ్మఒడి రూ.15 వేలు ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటోంది. మూడేళ్లలో తల్లులకు రూ.19,617 కోట్లు ఇచ్చినట్లు గొప్పలు చెప్పింది. కానీ తల్లుల ఖాతాల్లో పడింది రూ.18,293 కోట్లు మాత్రమే.

ఈ ఏడాది కూడా రూ.2 వేలు కోత పెడుతుండటంతో మరో రూ.870 కోట్లు మిగులుతాయి. కోతల వల్ల ప్రభుత్వానికి మొత్తం రూ.2200 కోట్ల నిధులు మిగులుతాయి. ఎన్నికల హామీ మేరకు నగదు ఇవ్వకుండా కోత పెట్టి, ఆ నిధులతో బడుల్లో టాయిలెట్ల నిర్వహణకు బ్రష్‌లు, క్లీనింగ్‌ వస్తువులు సరఫరా చేస్తున్నారు. అలాగే బడుల్లో తాగునీరు, ఇతరత్రా మరమ్మతులకు పాఠశాలల నిర్వహణ నిధులు వాడుతున్నారు. అయితే వాటి నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే. గతంలో వీటి నిర్వహణ ఖర్చులు ప్రభుత్వాలే భరించేవి. సీఎం జగన్‌ మాత్రం అమ్మఒడి నగదు ఇస్తేనే బడుల్లో బాతరూమ్‌లు పరిశుభ్రంగా ఉంటాయని స్వయంగా చెబుతున్నారు. అంటే.. అమ్మఒడి నగదు ఇవ్వకపోతే బాతరూమ్‌లు పరిశుభ్రంగా ఉంచలేరా? అంటూ తల్లులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-06-17T11:47:26+05:30 IST