Universities Posts: నిరుద్యోగుల చెవిలో పూలు! నోటిఫికేషన్లు మళ్లీ వాయిదా
ABN , First Publish Date - 2023-10-17T11:03:52+05:30 IST
యూనివర్సిటీల్లో పోస్టుల (Universities Posts) భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం పదే పదే మాట తప్పుతూ నిరుద్యోగల చెవిలో పూలు పెడుతోంది. ముఖ్యమంత్రి జగన్ (Cm jagan), విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ఫలానా తేదీన నోటిఫికేషన్లు
యూనివర్సిటీల నోటిఫికేషన్లు మళ్లీ వాయిదా
సీఎం, మంత్రి చెప్పినా విడుదల కాని నోటిఫికేషన్లు
ఆగస్టు 23న అని మొదట జగన్ ప్రకటన
ఈనెల 16న ఇస్తామని ఇటీవలే వెల్లడించిన బొత్స
మూడు నెలలుగా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన
తాజాగా ఈ నెల 20న విడుదల చేయాలనే ఆలోచన
ఎన్నికల్లోపు భర్తీ చేస్తారా అని నిరుద్యోగుల్లో అనుమానం
(అమరావతి - ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లో పోస్టుల (Universities Posts) భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం పదే పదే మాట తప్పుతూ నిరుద్యోగల చెవిలో పూలు పెడుతోంది. ముఖ్యమంత్రి జగన్ (Cm jagan), విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ఫలానా తేదీన నోటిఫికేషన్లు వస్తాయని ప్రకటించినా అవి ఒట్టి మాటలుగానే మిగిలిపోతున్నాయి. దీంతో యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ వ్యవహారం అదిగో.. ఇదిగో.. అన్నట్టుగా మారింది. ఆగస్టు 23న విడుదల కావాల్సిన నోటిఫికేషన్లు ఇంతవరకూ అడ్రస్ లేకపోవడంతో ఎన్నికల్లోపు భర్తీ పూర్తిచేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోందని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత వారంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ నెల 16న నోటిఫికేషన్లు విడుదలవుతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించగా.. సోమవారం వాటి ఊసే కనిపించలేదు.
మరోసారి నిరాశే..
ఆగస్టు 3న సీఎం వద్ద జరిగిన సమీక్షలో ప్రభుత్వం ఏకంగా షెడ్యూల్‌నే ప్రకటించింది. 3,285 పోస్టుల భర్తీకోసం ఆగస్టు 23న నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎంవో తెలిపింది. సీఎం ఆమోదంతోనే ఈ షెడ్యూల్ బయటికొచ్చింది. కానీ అక్టోబరు వచ్చినా ఇంతవరకూ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఈలోగా రేషనలైజేషన్ జీవోల విడుదలతో కాలం గడిపారు. అలాగే ఈనెల 11, 12 తేదీల్లో యూనివర్సిటీల వారీగా ఖాళీల జీవోలను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఆ వెంటనే సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సోమవారం నోటిఫికేషన్లు వస్తాయని విద్యాశాఖ మంత్రి బొత్స ప్రకటించారు. దీంతో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూడగా మరోసారి వారికి నిరాశే ఎదురైంది. పోస్టుల భర్తీలో రిజర్వేషన్ల అంశం ఇంకా తేలకపోవడంతో ఉన్నత విద్యామండలి అన్ని యూనివర్సిటీల రిజిస్ర్టార్లతో సోమవారం సమావేశం నిర్వహించింది. సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల నుంచి ఇంకా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకు తుది వివరాలు రాలేదని, అందువల్ల ఈ నెల 20న నోటిఫికేషన్లు ఇద్దామని సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలిసింది. అలాగే నాన్ వెకేషన్ అకడమిక్ పోస్టులు.. అంటే ఫిజికల్ డైరెక్టర్లు, ఆర్ అండ్ డీ, లేబొరేటరీలకు సంబంధించి పోస్టులను ప్రస్తుతం భర్తీ చేయనక్కర్లేదని నిర్ణయించారు. ఇప్పటికే పలుమార్లు తేదీలు ప్రకటించి మాట తప్పడంతో 20వ తేదీనైనా నోటిఫికేషన్లు ఇస్తారా? అనేది అనుమానంగా మారింది.
ఎన్నికల్లోపు సాధ్యమేనా?
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు వెలువడిన రోజు నుంచి అభ్యర్థుల ఎంపిక పూర్తిచేయడానికి దాదాపు మూడున్నర నెలలు పడుతోంది. ఆగస్టు 23న నోటిఫికేషన్లు ఇస్తే, నవంబరు నెలాఖరుకి ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తామని మొదటి షెడ్యూలులో ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు ఈనెల 20న నోటిఫికేషన్లు ఇస్తే, జనవరి నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అది కూడా నోటిఫికేషన్ల జారీలో జాప్యం లేకపోతేనే. సాధారణంగానే ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ అయ్యాక నిరుద్యోగుల నుంచి అనేక రకాల అభ్యంతరాలు, డిమాండ్లు వస్తుంటాయి. ఈ క్రమంలో కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్లకు కూడా అలాగే జరిగితే ఈలోగా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలై, మొత్తం వాయిదా పడే ప్రమాదం ఉంది. నిజంగా పోస్టులు భర్తీ చేయాలనుకుంటే మొదట ప్రకటించినట్లుగా ఆగస్టులోనే నోటిఫికేషన్లు ఇచ్చి ఉండాల్సిందని నిరుద్యోగులు అంటున్నారు.
నిరుద్యోగులను మభ్యపెట్టడానికేనా..?
నోటిఫికేషన్ల విషయంలో ఎందుకింత జాప్యం జరుగుతోంది అనేదానిపై అనుమానాలు పెరుగుతున్నాయి. అంతా సిద్ధంగా ఉందని, ఇక నోటిఫికేషన్లు ఇవ్వడమే ఆలస్యం అన్నట్టుగా ఆగస్టులో సీఎంవో తెలిపింది. దీనిపై ప్రభుత్వం పెద్దఎత్తున అనుకూల ప్రచారం కూడా చేసుకుంది. ఉద్యోగాల్లో ఇదొక విప్లవమని అధికార పార్టీ హోరెత్తించింది. మరి అప్పుడే అంతా సిద్ధమైపోయుంటే ఇంతకాలం ఎందుకు ఆలస్యం చేశారు? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినా ఏపీపీఎస్సీ కామన్ పరీక్ష నిర్వహించాలి. ఆ తర్వాత యూనివర్సిటీలు ఇంటర్వ్యూలు పెట్టాలి. దీనికి చాలా సమయం కావాలని తెలిసి కూడా ఆలస్యం చేయడం నిరుద్యోగులను మభ్యపెట్టడానికేననే వాదన వినిపిస్తోంది.