Telugu language: తెలుగు భాషపై జగన్ సర్కార్ కక్ష! ఇకపై కేజీబీవీల్లో..!
ABN , First Publish Date - 2023-06-08T12:36:05+05:30 IST
జగన్ ప్రభుత్వం తెలుగు భాషపై కక్షగట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం తాజాగా
రోజు మార్చి రోజు పాఠాలు!
కేజీబీవీల్లో తెలుగు టీచర్ల తగ్గింపు
ఇకపై సీఆర్‌టీ, పీజీటీల్లో ఒక్కరికే అవకాశం
6 నుంచి ఇంటర్ వరకు ఒక్కరితోనే బోధన
రేషనలైజేషన్ పేరుతో సర్దుబాటు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వం తెలుగు భాషపై కక్షగట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం తాజాగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో తెలుగు భాషను అప్రాధాన్య జాబితాలోకి నెట్టే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ 6 నుంచి 10వ తరగతి వరకు కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్(సీఆర్‌టీ)లు, ఇంటర్మీడియట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)లు తెలుగు బోధిస్తున్నారు. ఇకపై వారిద్దరిలో ఒకరు చాలని, మరొకరు ఇతర కేజీబీవీలకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. రేషనలైజేషన్ పేరుతో చేపట్టిన ఈ చర్యలు వివాదాస్పదమయ్యాయి. ఒక్కరే టీచర్ 6 నుంచి ఇం టర్ వరకు బోధించాలనే నిబంధన తేవడంతో ఒ క్క రోజులో ఏడు తరగతులకు బోధన సాధ్యమేనా అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, సమయం చాలకపోతే కొన్ని తరగతులకు ఒకరోజు, మరికొన్ని తరగతులకు మరొక రోజు చొప్పున బోధన చేయాలని అధికారులు చెబుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇలా ఒక్కసారే సగం మంది టీచర్లను తగ్గిస్తే మంచి ఫలితాలు ఎలా వస్తాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
జీతం పెంచినట్టే పెంచి..
మొదట్లో కేజీబీవీల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే ఉండేది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి వాటిలో ఇంటర్మీడియట్‌ను ప్రారంభించారు. అప్పటివరకూ పాఠశాల విద్యార్థులకు బోధించేవారు సీఆర్‌టీలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉంటే, ఇంటర్‌కు బోధించే పీజీటీలు పార్ట్‌టైమ్ టీచర్లుగా కొనసాగుతున్నారు. పీజీటీలకు గత ఐదేళ్లుగా రూ.12వేల వేతనం ఇస్తున్నారు. ఇంత తక్కువ వేతనాలతో ఎలాగని వారు అనేకసార్లు విన్నవించుకోగా ఇటీవల వారి జీతాన్ని సీఆర్‌టీలతో సమానంగా రూ.26వేలకు పెంచారు. అలా జీతాలు పెంచడం వల్ల పడిన ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం రేషనలైజేషన్‌కు తెరతీసింది. ఇంటర్మీడియట్ గ్రూపు సబ్జెక్టులకు మాత్రమే పోస్టులు మంజూరయ్యాయని, భాషా సబ్జెక్టులకు పోస్టులే లేవనే వాదనను అధికారులు ఇప్పుడు తెరపైకి తెచ్చారు. అయితే, తెలుగు పోస్టులు లేనప్పుడు ఇంతకాలం ఎలా పనిచేయించుకున్నారని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.
గ్రూపులకు పోస్టులు ఇచ్చినప్పుడు తెలుగుకు ఎందుకు ఇవ్వరని నిలదీస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అవసరం ఉన్నందున వారిని కొనసాగించి, తెలుగు టీచర్లను మాత్రం ఒకరిని తొలగించాలని సర్కారు నిర్ణయించింది. అప్పుడు తెలుగు సీఆర్‌టీ, తెలుగు పీజీటీ ఉన్న కేజీబీవీల్లో ఒక్కరు ఇతర కేజీబీవీకి వెళ్లాలి. ఒకవేళ ఆ జిల్లాలో ఖాళీలు లేకపోతే ఏంచేయాలనే దానిపై స్పష్టత లేదు. ఉదాహరణకు ఒక జిల్లాలో ఎనిమిది మంది తెలుగు టీచర్లు అదనంగా ఉంటే, ఖాళీలు రెండే ఉన్నాయి. మిగిలిన ఆరుగురు ఏం చేయాలో స్పష్టత లేదు. రాష్ట్రంలో మొత్తం 352 కేజీబీవీలుంటే దాదాపుగా అన్నిట్లోనూ తెలుగుకు ఒక సీఆర్‌టీ, ఒక పీజీటీ ఉన్నారు. అందులో కొందరిని తెలుగు టీచర్లు లేనిచోట్ల సర్దుబాటు చేస్తారు. మిగిలిన వారిని ఏంచేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎవరినీ తొలగించబోం అని అధికారులు చెబుతున్నా, మిగిలిన వారు ఎక్కడ పాఠాలు చెప్పాలో ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు.
తెలుగు సబ్జెక్టుపై తీవ్ర ప్రభావం..
సాధారణంగా కొత్త తరగతులు ప్రారంభించినప్పుడు అన్ని సబ్జెక్టులకు టీచర్లను కేటాయిస్తారు. 2019లో కేజీబీవీల్లో ఇంటర్ ప్రారంభించిన సమయంలోనూ ఇదే విధానంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి పీజీటీలను కూడా తీసుకున్నారు. కాగా, రేషనలైజేషన్ విధానం వల్ల తెలుగు సబ్జెక్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రతి క్లాసుకూ రోజూ తెలుగు పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కరే ఏడు పీరియడ్లు చెప్పాలంటే సాధ్యం కాదు.