Share News

DSC: డీఎస్సీ డ్రామా ఆరంభం

ABN , First Publish Date - 2023-10-19T10:27:38+05:30 IST

ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జగన్‌ అన్నారు. తాము అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ వేసి ఆ పోస్టులన్నీ భర్తీ చేస్తామని పాదయాత్రలో ఊదరగొట్టారు. అధికారంలోకొచ్చి

DSC: డీఎస్సీ డ్రామా ఆరంభం

  • ఎన్నికల ముందు నోటిఫికేషన్ల హడావుడి

  • నాలుగున్నరేళ్లు మౌనంగా వైసీపీ ప్రభుత్వం

  • ఒక దశలో ఖాళీలే లేవని బుకాయింపు

  • మెగా డీఎస్సీ వేస్తామని అప్పట్లో జగన్‌ హామీ

  • ఆ హామీ తనకు తెలియదన్న మంత్రి బొత్స

  • వెయ్యి దాటితే ‘మెగా’నే అంటూ కొత్త భాష్యం

  • కేడర్లవారీగా ఖాళీల వివరాలు పంపండి

  • ఆర్జేడీ, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశం

ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జగన్‌ అన్నారు. తాము అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ వేసి ఆ పోస్టులన్నీ భర్తీ చేస్తామని పాదయాత్రలో ఊదరగొట్టారు. అధికారంలోకొచ్చి నాలుగున్నరేళ్లయినా ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు మళ్లీ డీఎస్సీ అంటూ వంచన రాజకీయాలకు తెర తీశారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి): అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్సీ.. అంటూ నాలుగున్నరేళ్లు మాటలతో మాయ చేసిన జగన్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు డీఎస్సీ నోటిఫికేషన్లు అంటూ డ్రామా మొదలుపెట్టింది. గత రెండేళ్లుగా ‘త్వరలో’ డీఎస్సీ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్ని ప్రకటనలు చేసినా అవి మాటలు దాటలేదు. ఒకదశలో అసలు ఖాళీలే లేవంటూ ప్రభుత్వం బుకాయించింది. చట్టసభల సాక్షిగా ఖాళీలు వెయ్యి లోపేనని ప్రకటించింది. దీంతో మెగా కాదు కదా సాధారణ డీఎస్సీ కూడా లేనట్లేనని నిరుద్యోగులు ఓ అభిప్రాయానికి వచ్చారు. కానీ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఉన్నట్టుండి డీఎస్సీ వేస్తామంటూ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కేడర్ల వారీగా ఖాళీల వివరాలు పంపాలంటూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఆర్జేడీలు, డీఈవోలకు ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 20నాటికే వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 5నెలలే మిగిలున్న తరుణంలో ఇప్పుడు ఈ చర్యలు చేపట్టడం వెనుక ఆంతర్యమేమిటి? ఈ తక్కువ కాలంలో నోటిఫికేషన్లు జారీచేసి, పరీక్షలు నిర్వహించి పోస్టులు భర్తీ చేయడం సాధ్యమేనా..? ఈ హడావిడి నిరుద్యోగుల కోసమా.. లేక ఎన్నికల్లో లబ్ధి పొందడానికా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

టీచర్‌ పోస్టులపై వైసీపీ ప్రభుత్వం అనేకసార్లు మాట మార్చింది. అధికారంలోకి రాకముందు 23వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పాదయాత్రలో జగన్‌ పదేపదే చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఆ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని మర్చిపోయారు. విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేశ్‌ ఉన్నంతకాలం డీఎస్సీ మాట వినిపించలేదు. బొత్స సత్యనారాయణ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి 2నెలలకోసారి ‘త్వరలో డీఎస్సీ’ అనే ప్రకటన చేస్తూ వచ్చారు. కాగా, ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో పోస్టులు 717 మాత్రమే ఉన్నాయంటూ శాసనమండలిలో ప్రకటించారు. పోస్టుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఆశలపై నీళ్లు చల్లారు. 6నెలల్లోనే మాట మార్చిన ప్రభుత్వం 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసింది. మంజూరైన వాటిలో ఆ మేరకు ఖాళీలున్నప్పటికీ అవసరమైన టీచర్లు 8,366 మాత్రమేనని తెలిపింది. ఈ ఒక్క ప్రకటనతోనే 10వేల పోస్టులు ఖాళీ చేయబోమని స్పష్టం చేసింది.

‘మెగా’కు కొత్త అర్థం

కొద్ది రోజుల కిందట సచివాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో మెగా డీఎస్సీకి మంత్రి బొత్స కొత్త భాష్యం చెప్పారు. దాదాపు 23వేల పోస్టులు భర్తీచేసే ఉద్దేశంతో మెగా డీఎస్సీ వేస్తామని అప్పట్లో జగన్‌ చెప్పారు. అయితే వెయ్యి పోస్టులు దాటితే మెగా డీఎస్సీనే అవుతుందని బొత్స చెప్పుకొచ్చారు. జగన్‌ ఇచ్చిన హామీ గురించే తనకు తెలీదన్నారు.

ఒక్క నోటిఫికేషన్‌ కూడా లేదు

వైసీపీ అధికారంలోకి వచ్చాక టీచర్‌ పోస్టుల భర్తీకి ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ భర్తీని ఈ ప్రభుత్వంలో పూర్తిచేశారు. 2008 డీఎస్సీలో ఎంపికై ఆగిపోయిన 1,910మందిని, 1998 డీఎస్సీకి సంబంధించి 4,534మందిని మినిమం టైమ్‌స్కేలు ద్వారా తీసుకున్నారు. వీరంతా రెగ్యులర్‌ టీచర్లే అన్నట్టు ప్రచారం చేసుకున్నారు. కాగా ఇటీవల తెలంగాణలోనూ 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వగా ఎన్నికల కారణంగా అవి ఆగిపోయాయి. ఎన్నికల వేళ పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-10-19T10:27:38+05:30 IST