Schools: ఎక్కడి బడి అక్కడే! ఈ ఏడాది అవస్థలే!
ABN , First Publish Date - 2023-06-12T12:06:33+05:30 IST
విద్యా రంగంపై ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పాఠశాలల తీరుకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్భాటంగా అన్ని పనులు ఒకేసారి ప్రారంభించి
సగం కూడా పూర్తికాని నాడు-నేడు పనులు
అదనపు తరగతుల నిర్మాణానికి మరో ఏడాది?
పాఠశాలల్లో అడ్డదిడ్డంగా నిర్మాణ సామగ్రి
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
వడగాడ్పులతో వారంపాటు ఒంటిపూట బడులు
అమరావతి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): విద్యా రంగంపై ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పాఠశాలల తీరుకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్భాటంగా అన్ని పనులు ఒకేసారి ప్రారంభించి లక్ష్యాలు నిర్దేశించుకున్న ప్రభుత్వం వాటిని ఎప్పటికి పూర్తిచేస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బడులు తెరిచే నాటికి మొత్తం పనులు పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకోగా చివరికి సగం పనులు కూడా కాలేదు. కనీసం మరో ఏడాదికి అయినా అదనపు తరగతి గదులు పూర్తిచేస్తారా? అనేలా నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నాడు-నేడు పనులు చేపట్టిన బడుల ప్రాంగణాలన్నీ నిర్మాణ సామగ్రితో నిండిపోయాయి. మరోవైపు డిజిటల్ విద్య అంటూ హడావిడి చేసినా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటుచేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకూ ఒక్కటి కూడా ఇన్‌స్టాల్ చేయలేకపోయింది.
30వేల ఐఎ్‌ఫపీలకు 5వేలు, 10వేల స్మార్ట్ టీవీలకు 70 మాత్రమే ఇప్పటివరకూ సరఫరా అయ్యాయి. దీంతో డిజిటల్ రూపంలో విద్య ఇప్పట్లో లేదని అర్థమవుతోంది. దీంతో ప్రభుత్వ బడులు గతేడాది ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. నాడు-నేడు పథకం తొలిదశలో భాగంగా ప్రభుత్వం 4,903 పాఠశాలల్లో పనులు పూర్తి చేసింది. గత విద్యా సంవత్సరంలో రెండో విడత పనులు ప్రారంభించింది. గతేడాదే ఈ దశ కూడా పూర్తికావాలి. కానీ నిధులు లేకపోవడంతో కనీసం ఈ ఏడాది బడులు తెరిచే నాటికి వందశాతం పనులు పూర్తిచేయాలన్నది లక్ష్యం. అయితే అందులో సగం కూడా పూర్తికాలేదు. 22వేలకు పైగా పాఠశాలల్లో నాడు- నేడు, అదనపు తరగతులు పనులను రూ.8వేల కోట్ల అంచనాతో ప్రారంభించింది. ఇప్పటివరకూ చేసిన ఖర్చు కేవలం రూ.2,425 కోట్లే. ఇక 33,285 అదనపు తరగతి గదులు నిర్మిస్తామని చెప్పగా వాటిలో ఇప్పటివరకూ 500 కూడా కట్టలేకపోయింది. 60 పాఠశాలల్లో గ్రౌండ్ ఫ్లోర్, 51 పాఠశాలల్లో మొదటి అంతస్తు, 5 పాఠశాలల్లో రెండో అంతస్తు వరకు నిర్మాణాలు పూర్తిచేసింది. ఈ లెక్కన ఇప్పట్లో అదనపు తరగతి గదులు పూర్తయ్యే అవకాశం లేదు. ఇక ఇటీవల కొన్ని మెటీరియల్స్ సరఫరా చేయలేమంటూ కాంట్రాక్టు సంస్థలు చేతులెత్తేశాయి. దీంతో ఎలక్ర్టికల్, టైల్స్ లాంటివి స్థానికంగా కొనుగోలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
ఏకోపాధ్యాయ బడులెన్ని?
వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో 7వేలుగా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు 9వేలకు చేరిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే 13వేల వరకు ఉన్నాయని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో కూడా ఇవి 13 వేలు ఉన్నట్లు తెలిపింది. గతంలో ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు టీచర్లు ఉండేవారు. కానీ హేతుబద్ధీకరణ పేరుతో తెచ్చిన జీవో 117 కారణంగా కిలోమీటరు పరిధిలోని హైస్కూల్‌లో తరగతులను విలీనం చేశారు. 3, 4, 5 తరగతులు తరలిపోవడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20కంటే దిగువకు పడిపోయింది. జీవో 117 ప్రకారం 20 మంది వరకు విద్యార్థులకు ఒక్కరే టీచర్ ఉండాలి. దీంతో ఏకోపాధ్యాయ పాఠశాలలు విపరీతంగా పెరిగిపోయాయి.
నేటినుంచే బడి గంట!
వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండటంతో ఈ నెల 17వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సోమవారం నుంచి వారం రోజుల పాటు ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు బడి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురే్‌షకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ప్రైవేటు సహా అన్ని మేనేజ్‌మెంట్లలోని పాఠశాలలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. 8.30 నుంచి 9గంటల మధ్య రాగి జావ పంపిణీ చేయాలని, బడి విడిచిపెట్టాక 11.30 నుంచి 12 గంటల మధ్యలో మధ్యాహ్న భోజనం అందించాలని తెలిపారు. అలాగే అధిక ఉష్ణోగ్రతల తీవ్రతను తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మిట్టమధ్యాహ్నం వెళ్లేదెలా?
పాఠశాలల పునఃప్రారంభంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్ణయంపై విమర్శలొస్తున్నాయి. కొద్దిరోజులు పూర్తిగా సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, వడగాడ్పుల నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించాలని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్, ఎ.అశోక్ డిమాండ్ చేశారు.