Education: పిల్లలు వెళ్లిపోయారు! పథకాలు ఆకర్షించలేకపోయాయి!

ABN , First Publish Date - 2023-09-23T11:26:52+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల విషయంలో వైసీపీ సర్కారు (YCP Government) ప్రచారార్భాటం చూస్తే ప్రైవేటు బడులు మూసేసుకోవాలేమో అన్నంత హడావుడి కనిపిస్తుంది!.. కానీ అది కేవలం ప్రచారం మాత్రమేనని, వాస్తవంగా పథకాలన్నీ ఉత్తుత్తివేనని విద్యార్థుల సంఖ్యను చూస్తే

Education: పిల్లలు వెళ్లిపోయారు! పథకాలు ఆకర్షించలేకపోయాయి!

ప్రభుత్వ బడుల నుంచి వలస బాట..

తగ్గిన విద్యార్థుల సంఖ్య 3లక్షలు

పాఠశాలల విలీనం తెచ్చిన తంటా

ఎన్ని పథకాలున్నా ప్రైవేటు బడికే

విద్యార్థుల సంఖ్యపై నోరు మెదపని ప్రభుత్వం

9,602కు పెరిగిన ఏకోపాధ్యాయ బడులు

విద్యార్థుల్లేక మిగులు టీచర్ల సర్దుబాటు

ప్రభుత్వ పాఠశాలల విషయంలో వైసీపీ సర్కారు (YCP Government) ప్రచారార్భాటం చూస్తే ప్రైవేటు బడులు మూసేసుకోవాలేమో అన్నంత హడావుడి కనిపిస్తుంది!.. కానీ అది కేవలం ప్రచారం మాత్రమేనని, వాస్తవంగా పథకాలన్నీ ఉత్తుత్తివేనని విద్యార్థుల సంఖ్యను చూస్తే అర్థమవుతుంది!. ప్రభుత్వం ఎన్నిపథకాలు అమలుచేసినా అంతిమంగా విద్యార్థుల సంఖ్య పెరగడమే లక్ష్యం కావాలి. కానీ ఇన్ని పథకాలు అమలుచేస్తున్నామని చెబుతున్నా విద్యార్థుల సంఖ్య ఏటా పడిపోవడమే ఇందుకు తార్కాణం. ఈ ఏడాది ఏకంగా 3లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వలసబాట పట్టారు. అందినకాడికి అప్పులతో పాలన గడుపుతున్న ప్రభుత్వం.. కేవలం ప్రపంచ బ్యాంకు రుణం కోసం అడ్డగోలుగా పాఠశాలలను విలీనం చేయడంవల్లే ఈ దుస్థితి దాపురించిందన్నది విస్పష్టం!.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సర్కారు బడుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఏటా విద్యార్థుల సంఖ్య పెరగడానికి బదులుగా తగ్గుతూ వస్తోంది. అమ్మఒడి (Amma odi), విద్యా కానుక, ట్యాబ్‌లు, నాడు-నేడు, గోరుముద్ద అంటూ పథకాలపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ బడులను విశ్వసించలేకపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వ బడుల నుంచి వలస వెళ్లిపోతున్నారు. ఇది ప్రైవేటు పాఠశాలలకు అనుకూలంగా మారింది.

విద్యార్థుల సంఖ్యపై గోప్యత!

గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 41,38,322 మంది విద్యార్థులుంటే ఈ ఏడాది ఆ సంఖ్య 39లక్షలు దాటలేదు. వారిలోనూ ప్రస్తుతం ఎంత మంది బడుల్లో ఉన్నారనే సంఖ్యపై స్పష్టత లేదు. తర్వాత తరగతులకు ప్రమోట్‌ అయినవారిలోనూ పలువురు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో సుమారు 3లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారని అర్థమవుతోంది. గతేడాది వరకూ తరగతుల వారీగా విద్యార్థుల సంఖ్యను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శించిన పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది వాటిని పూర్తిగా తొలగించింది. విద్యార్థుల సంఖ్య పెరగడం, లేదా అంతేస్థాయిలో కొనసాగడం ఉంటే ఇంత గోప్యత ఎందుకోమరి అంతుబట్టని విషయం. దీనిపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు.

అన్ని తరగతుల్లో అంతే..

1 నుంచి 10 వరకు అన్ని తరగతుల్లోనూ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్య మరీ దయనీయంగా మారింది. ముందూ వెనుకా చూడకుండా ప్రపంచ బ్యాంకు రుణం కోసం జగన్‌ ప్రభుత్వం చేసిన అడ్డగోలు పాఠశాలల విలీనం బడులను తీవ్రంగా దెబ్బకొట్టింది. ఒకటో తరగతి విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఏటా 6లక్షల మంది విద్యార్థులు ఒకటిలో చేరుతుంటే ఈ ఏడాది 5లక్షల వద్దే ఆ సంఖ్య ఆగిపోయింది. రెండో తరగతిలో కొత్తగా చేరకపోగా, ఉన్నవారిలో చాలా మంది ప్రైవేటు బడులకు వెళ్లిపోయారు. ఐదు, ఆరు, ఎనిమిదవ తరగతుల్లోనూ భారీగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ బడుల నుంచి టీసీలు తీసుకుని వెళ్లిపోవడమే తప్ప, కొత్తగా వచ్చి చేరతామన్నవారు కనిపించడం లేదు. జగన్‌ ప్రభుత్వం గతేడాది చేసిన విలీన ప్రక్రియ ప్రాథమిక పాఠశాలలను దారుణంగా దెబ్బతీసింది. 4200 బడుల్లోని 3 నుంచి 5 తరగతులను తీసుకెళ్లి సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఇక, ఆ బడుల్లో 1, 2 తరగతులే మిగలడంతో ఆ పాఠశాలల్లో చాలావరకు సింగిల్‌ టీచర్‌గా మిగిలిపోయాయి. విద్యార్థుల సంఖ్య 20 దాటితేనే రెండో టీచర్‌ను ఇస్తారు. గతేడాది వరకూ రాష్ట్రంలో 7వేల సింగిల్‌ టీచర్‌ బడులుంటే ఈ ఏడాది ఆ సంఖ్య 9,602కు పెరిగింది. అంటే దాదాపుగా పదివేల పాఠశాలల్లో 20 మంది పిల్లలు కూడా లేని దయనీయ పరిస్థితి నెలకొంది. దీంతో ఆ బడుల్లో బోధనతో పాటు మిగిలిన అన్ని పనులనూ ఆ ఒక్క టీచరే చేయాల్సి వస్తోంది.

ఫెయిల్‌ వారికీ అడ్మిషన్లు

ఒకసారి ఫెయిల్‌ అయిన విద్యార్థి సప్లిమెంటరీ రాసుకోవడం తప్ప తిరిగి బడుల్లో చేరే విధానం దేశంలో ఎక్కడా లేకపోయినా జగన్‌ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అమలుచేస్తూ విద్యార్థుల సంఖ్య బాగుందన్నట్టుగా చూపించుకుంటోంది. ఇలా ఈ ఏడాది పదోతరగతి ఫెయిలైన 7వేల మంది విద్యార్థులు తిరిగి బడుల్లో కొనసాగుతుండగా, విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.

ప్రచారానికే పథకాలు

నాడు- నేడు, డిజిటల్‌ తరగతి గదులు, ట్యాబ్‌లు, విద్యా కానుక కిట్లు అంటూ ఏటా వేల కోట్లు వెచ్చిస్తున్నా ప్రయోజనం శూన్య. కాగా, కొవిడ్‌ సమయంలో ఫీజులు దండగ అని పిల్లలు ప్రభుత్వ బడుల్లో చేరితో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి మొహమాటం లేకుండా దానిని తన ఖాతాలో వేసుకుంది. తమ పథకాల వల్లే విద్యార్థులు పెరిగారని, ఇదీ తమ ప్రభుత్వ సత్తా అంటూ గొప్పలు చెప్పుకొంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకొన్ని పథకాలు పెరిగాయి. అంటే విద్యార్థుల సంఖ్య ఇంకా పెరగాలి. కానీ పెరగకపోగా తగ్గిపోయింది. ప్రభుత్వ బడుల్లో 2020-21లో 4234322 మంది విద్యార్థులుంటే, 2021-22లో అది 4571051కు పెరిగింది. 2022-23లో అది 4138322కు పడిపోయింది. ఇక ఈ ఏడాది ఇంకా దారుణంగా 39లక్షల వద్దే ఆగిపోయింది.

టీచర్ల సర్దుబాటు

ఇటీవల పాఠశాల విద్యాశాఖ టీచర్ల సర్దుబాటు చర్యలు చేపట్టింది. అంటే ఒక పాఠశాలలో టీచర్లు మిగులుగా ఉంటే వారికి కొరత ఉన్న చోటకు పంపే ప్రక్రియ. విద్యార్థుల సంఖ్య యథాతథంగా ఉంటే మిగులు అన్న మాటే తలెత్తదు. కానీ దాదాపు 10వేల మంది టీచర్లను ఇప్పుడు సర్దుబాటు చేస్తున్నారు. చాలాచోట్ల అవసరానికి మించి ఉన్నారని గుర్తించారు. అంటే గతేడాది ఆగస్టు నాటికి ఉన్న స్థాయిలో విద్యార్థులు ఇప్పుడు లేరని పరోక్షంగా పాఠశాల విద్యా శాఖే చెబుతోంది. అయితే ఎక్కువ చోట్ల టీచర్లు మిగులుగా ఉంటే చాలా తక్కువ చోట్ల మాత్రమే కొరత కనిపిస్తోంది. దీంతో పూర్తిగా మిగిలిపోయే టీచర్లను ఏంచేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.

Updated Date - 2023-09-23T11:26:52+05:30 IST