AP Education: రెండు రోజులే ఆఫీస్‌లో.. ఆన్‌లైన్‌లో చక్కబెట్టేస్తున్న ఉన్నతాధికారి!

ABN , First Publish Date - 2023-10-06T11:07:21+05:30 IST

ఫెయిల్‌ అయిన విద్యార్థులను తిరిగి కాలేజీల్లో చేర్చుకుని రీఅడ్మిషన్‌ కల్పించే ప్రక్రియ ఇంటర్‌లోనూ చేపట్టారు. టెన్త్‌లో రీఅడ్మిషన్ల విధానం ఈ ఏడాది కొత్తగా ప్రారంభించారు.

AP Education: రెండు రోజులే ఆఫీస్‌లో.. ఆన్‌లైన్‌లో చక్కబెట్టేస్తున్న ఉన్నతాధికారి!

  • ఆఫీసు తాడేపల్లిలో.. విధులు ఢిల్లీలో!

  • ఫైళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే క్లియర్‌

  • వారంలో రెండ్రోజులే ఇక్కడ

  • ఇంటర్‌ బోర్డులో ఓ ఉన్నతాధికారి తీరు

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యామండలిలో ఓ ఉన్నతాధికారి తీరు చర్చనీయాంశంగా మారింది. ఇంటర్‌ బోర్డు కార్యాలయం తాడేపల్లిలో ఉంటే, ఆయన మాత్రం ఢిల్లీ నుంచి పనిచేస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిన ఆయన రెండు రోజులు మాత్రమే రాష్ట్రంలో ఉంటున్నారు. శని, ఆదివారాలతో కలిపి ఐదు రోజులు ఢిల్లీలోనే గడుపుతున్నారు. ఇప్పుడంతా ఈ-ఆఫీసు కావడంతో మొత్తం ఫైళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే క్లియర్‌ చేస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి పనిచేయడం వల్ల ఇంటర్‌ బోర్డు, ఇంటర్మీడియట్‌ కమిషనరేట్‌లో సమావేశాల ఊసు లేకుండా పోయింది. మరోవైపు సర్టిఫికెట్లు, కాలేజీలకు సంబంధించిన విషయాలపై కమిషనరేట్‌కు వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధనా సిబ్బంది, ప్రైవేటు కాలేజీల ప్రతినిధులు సదరు ఉన్నతాధికారి అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు సంబంధించిన కొన్ని విషయాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ఇప్పటివరకూ ఒరిజినల్‌ మార్కుల మెమోలు జారీ చేయలేదు. ఏటా ఆగస్టు, సెప్టెంబరుల్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ముద్రించి విద్యార్థులకు ఇచ్చేవారు. ఈ ఏడాది అక్టోబరు వచ్చినా సర్టిఫికెట్ల జాడ లేకుండా పోయింది. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న షార్ట్‌ మెమోలతోనే విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సుల్లో చేరారు. కానీ కొన్ని జాతీయ విద్యాసంస్థలు ఒరిజినల్స్‌ కోసం ఒత్తిడి చేస్తున్నాయి.

ఇంటర్‌లోనూ రీఅడ్మిషన్లు

ఫెయిల్‌ అయిన విద్యార్థులను తిరిగి కాలేజీల్లో చేర్చుకుని రీఅడ్మిషన్‌ కల్పించే ప్రక్రియ ఇంటర్‌లోనూ చేపట్టారు. టెన్త్‌లో రీఅడ్మిషన్ల విధానం ఈ ఏడాది కొత్తగా ప్రారంభించారు. ఇంటర్‌లోనూ రీఅడ్మిషన్‌ పొందవచ్చని, అలా చేరిన విద్యార్థులు ఫెయిల్‌ అయినవాటితో పాటు అన్ని సబ్జెక్టులు తిరిగి రాయాల్సి ఉంటుందని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పాసైన సబ్జెక్టుల్లో రెండు పరీక్షల్లో ఎక్కువగా వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రీఅడ్మిషన్‌ పొంది ఉత్తీర్ణులైన విద్యార్థులకు రెగ్యులర్‌ విద్యార్థుల తరహాలోనే సర్టిఫికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఫెయిల్‌ అయిన, ప్రైవేటు విద్యార్థులు నవంబరు 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సౌరభ్‌ గౌర్‌ ప్రకటించారు.

డిజీ లాకర్‌లో ఇంటర్‌ సర్టిఫికెట్లు

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల సర్టిఫికెట్లు డిజీ లాకర్‌లో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ మరో ప్రకటనలో తెలిపారు. 2014 నుంచి 2023 వరకు ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్లు డిజీ లాకర్‌లో ఉంటాయని పేర్కొన్నారు. అలాగే మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు, తత్సమాన(ఈక్వెలెన్సీ) సర్టిఫికెట్లు, అర్హత పత్రాలు కూడా అందులో ఉంటాయని, విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు.

Updated Date - 2023-10-06T11:07:21+05:30 IST