TSPSC Paper Leakage: పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన కేంద్ర సంస్థ!

ABN , First Publish Date - 2023-04-11T11:00:13+05:30 IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC Paper Leakage) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంపై

TSPSC Paper Leakage: పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన కేంద్ర సంస్థ!
TSPSC Paper Leakage

టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసు.. రంగంలోకి ఈడీ

ప్రవీణ్‌, రాజశేఖర్‌ విచారణకు

అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్‌

శంకరలక్ష్మి, సత్యనారాయణకు నోటీసులు

రేపు, ఎల్లుండి విచారణకు పిలుపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC Paper Leakage) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంపై హైదరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా గతవారం ఈసీఐఆర్‌ నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) సోమవారం ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకు అనుమతించాలంటూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ ఇప్పటి వరకు 17 మంది నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గ్రూప్‌-1 పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన 121 మందిని, జగిత్యాల జిల్లా మల్యాలలో గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించిన 40 మంది విచారించింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి సహా.. పలువురు కీలక వ్యక్తుల వాంగ్మూలాలను సేకరించింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ను ముందుగానే అందుకుని, విదేశాల నుంచి వచ్చి, పరీక్షలు రాసినవారు ఉండడం, మనీలాండరింగ్‌ కోణం ఉండడంతో ఈడీ రంగంలోకి దిగింది. సిట్‌ సాక్షిగా పేర్కొన్న శంకర్‌లక్ష్మిపై ఈడీ ప్రధాన దృష్టి సారించినట్లు తెలిసింది. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ కస్టోడియన్‌గా ఉన్న ఆమె కంప్యూటర్‌ నుంచే ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఆమెతోపాటు.. టీఎస్‌పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో ఆదేశాలు జారీ చేసింది. వారిని విచారించగా లభించే సమాచారంతో తదుపరి చర్యలు తీసుకోనుంది.

సిట్‌ నుంచి వివరాలు..

ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితారామచంద్రన్‌ ఫిర్యాదుతో బేగంబజార్‌ పోలీసులు గత నెల 11న కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేశారు. జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో సిట్‌ దర్యాప్తును చేపట్టింది. 17 మందిని అరెస్టు చేసిన సిట్‌.. వందల మందిని ప్రశ్నించింది. ప్రవీణ్‌, రాజశేఖర్‌ను కస్టడీకి తీసుకున్న సమయంలో పూర్తిస్థాయిలో విచారించడంతోపాటు సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ నిర్వహించింది. సంచలనాత్మక కేసుకు సంబంధించి గత నెల రోజులుగా సిట్‌ నిర్వహించిన దర్యాప్తు, సేకరించిన వివరాలు, నమోదు చేసిన వాంగ్మూలాలు, ఫోరెన్సిక్‌ నివేదిక.. ఇలా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు తీసుకోనున్నారు. సిట్‌ ఇచ్చే సమాచారాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించడం, ప్రవీణ్‌, రాజశేఖర్‌ స్టేట్‌మెంట్‌, విచారణలో శంకర్‌లక్ష్మి, సత్యనారాయణ ఇచ్చే సమాచారం మేరకు ఈ కేసులో అవసరమైన వారందరికి ఈడీ నోటీ్‌సలు జారీ చేసి, విచారించనుంది.

Updated Date - 2023-04-11T11:00:13+05:30 IST