AP Education: ఉన్నత విద్యామండలి ‘సొంత చట్టం’!
ABN , First Publish Date - 2023-11-25T04:41:33+05:30 IST
రాష్ట్ర ఉన్నత విద్యామండలి సొంత చట్టాన్ని అమలు చేస్తోంది. హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టాలని అడ్డగోలు ఆదేశాలు జారీచేసింది.
దరఖాస్తుల పరిశీలనకు మౌఖిక ఆదేశాలు
దరఖాస్తులు స్వీకరించినా ప్రక్రియ చేపట్టొద్దన్న హైకోర్టు
అందుకు విరుద్ధంగా వర్సిటీల్లో కమిటీలు
జేఎన్టీయూ-విజయనగరంపై హైకోర్టు ఆగ్రహం
(అమరావతి, ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉన్నత విద్యామండలి సొంత చట్టాన్ని అమలు చేస్తోంది. హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టాలని అడ్డగోలు ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ ఆదేశాలు లిఖితపూర్వకంగా ఇస్తే ఇబ్బంది అవుతుందనుకున్న మండలి అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీచేశారు. దీంతో మండలి అధికారుల ఆదేశాలు పాటించాలా? లేక హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలా? అర్థంకాక యూనివర్సిటీల రిజిస్ర్టార్లు తలలు పట్టుకుంటున్నారు. ఇదే విషయంలో తమ ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రక్రియ ప్రారంభించిన విజయనగరం-జేఎన్టీయూ రిజిస్ర్టార్పై కేసు నమోదుచేయాలని హైకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించేలా ఉన్నతాధికారులు వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
నాలుగున్నరేళ్ల పాటు ఉద్యోగాల భర్తీపై మౌనం వహించిన వైసీపీ ప్రభుత్వం, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విద్యాశాఖ ద్వారా హడావుడిగా కొన్ని నోటిఫికేషన్లు జారీచేసింది. అందులోనైనా చిత్తశుద్ధి ఉందా అంటే అదీ లేదు! రోస్టర్ను గందరగోళం చేసి వివాదానికి తెరలేపింది. దీంతో అటు నోటిఫికేషన్లు జారీచేయగానే, ఇటు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విజయనగరం-జేఎన్టీయూ రిజిస్ర్టార్పై హైకోర్టు కేసు నమోదుకు ఆదేశాలు కూడా జారీ చేసింది. మొత్తంగా పోస్టులు భర్తీ చేసే ఉద్దేశం లేకే ప్రభుత్వం ఇలా రిజర్వేషన్ను ఇష్టారాజ్యంగా అమలు చేసి ప్రక్రియను సంక్లిష్టం చేస్తోందని ప్రొఫెసర్లు, అభ్యర్థుల ఆరోపణ!
ప్రక్రియ చేపట్టొద్దన్న హైకోర్టు
యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి యూనివర్సిటీలు ఈనెల మొదట్లో నోటిఫికేషన్లు జారీచేసి, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాయి. ఈనెల 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెట్టాయి. అనంతరం అవే హార్డ్ కాపీలను అభ్యర్థులు యూనివర్సిటీలకు పోస్ట్ ద్వారా పంపాలి. దీనికి ఈనెల 27 చివరి తేదీ. అయితే ఈలోగా కొందరు ప్రొఫెసర్లు, ఇతరులు రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. యూనివర్సిటీల్లో మొత్తం మంజూరైన పోస్టులకు రోస్టర్ అమలుచేయాల్సి ఉండగా, పనిచేస్తున్న పోస్టులను వదిలేసి, ఖాళీలకు మాత్రమే కొత్తగా రోస్టర్ వేశారని వారు న్యాయస్థానానికి తెలిపారు. ఈ కారణంగా వర్సిటీల్లో కొందరికి నష్టం జరుగుతుందని, రిజర్వేషన్ విషయంలో వివాదాలు ఏర్పతాయని పేర్కొన్నారు. ఇలా తప్పుడు రోస్టర్ ప్రకారం ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దుచేయాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. దరఖాస్తులు స్వీకరణను కొనసాగించాలని, అయితే అనంతర ప్రక్రియను చేపట్టొద్దని స్పష్టంచేస్తూ ఆదేశాలు జారీచేసి, విచారణను డిసెంబరుకు వాయిదా వేసింది.
హైకోర్టు వద్దన్నా పరిశీలనకు కమిటీలు
దరఖాస్తులు స్వీకరించి అనంతర ప్రక్రియ చేపట్టొద్దని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినా దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాలను రూపొందించేందుకు యూనివర్సిటీలన్నీ అంతర్గతంగా కమిటీలను నియమించాయి. ఇది కోర్టు ఆదేశాలకు విరుద్ధం కావడంతో జేఎన్టీయూ-విజయనగరంపై కొందరు హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తమ ఆదేశాలకు విరుద్ధంగా ప్రక్రియ ప్రారంభించిన వర్సిటీ రిజిస్ర్టార్పై కేసు నమోదుచేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో విక్రమ సింహపురి వర్సిటీ దరఖాస్తుల పరిశీలన కమిటీ ఆదేశాలను రద్దు చేసుకుంది. కొన్ని వర్సిటీలు మాత్రం దరఖాస్తులు కవర్లు తెరిచి ప్రక్రియ ప్రారంభించాయి. పోస్టుల భర్తీ అంశంపై ఉన్నత విద్యామండలిలోని ఉన్నతాధికారులు గురువారం సాయం త్రం అన్ని యూనివర్సిటీల రిజిస్ర్టార్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలన చేపట్టాలని వారు మౌఖికంగా ఆదేశించినట్లు రిజిస్ర్టార్లు తెలిపారు. ఇలా చేస్తే కోర్టు ధిక్కరణ అవుతుందని ఓ రిజిస్ర్టార్ సందే హం లేవనెత్తగా ‘మేం చూసుకుంటాం’ అని ఓ ఉన్నతాధికారి అభయమిచ్చినట్లు తెలిసింది. కాగా, దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు కూడా జారీచేశారని, వాటిని రహస్యంగా ఉంచారని వర్సిటీల్లో చర్చ సాగుతోంది.