TSPSC: గ్రూప్‌-4 పరీక్ష రాస్తున్నారా? ఎగ్జామ్ సెంటర్‌కు ముందుగా వెళ్లకపోతే..!

ABN , First Publish Date - 2023-06-30T12:01:21+05:30 IST

గ్రూప్‌-4 పరీక్షల్లో బయో మెట్రిక్‌ హాజరు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్పీఎస్సీ ) అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి కేంద్రం వద్ద అవసరమైన సంఖ్యలో యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. ఈ హాజరు నమోదుకు సమయం పడుతుంది కాబట్టి అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్దకు ముందుగా చేరుకోవాలని

TSPSC: గ్రూప్‌-4 పరీక్ష రాస్తున్నారా? ఎగ్జామ్ సెంటర్‌కు ముందుగా వెళ్లకపోతే..!

గ్రూప్‌-4కు బయోమెట్రిక్‌ హాజరు

టీఎస్పీఎస్సీ నిర్ణయం.. జూలై 1న 2,846 కేంద్రాల్లో పరీక్ష

పేరు, హాల్‌టికెట్‌ నంబరు, ఫొటో లేకుండా ఓఎంఆర్‌ షీట్‌

హైదరాబాద్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-4 పరీక్షల్లో బయో మెట్రిక్‌ హాజరు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్పీఎస్సీ ) అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి కేంద్రం వద్ద అవసరమైన సంఖ్యలో యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. ఈ హాజరు నమోదుకు సమయం పడుతుంది కాబట్టి అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్దకు ముందుగా చేరుకోవాలని సూచిస్తున్నారు. 2018లో జరిగిన గ్రూప్‌-4లో బయోమెట్రిక్‌ హాజరు తీసుకున్నారు. అయితే, పేపర్‌ లీకేజీ అనంతరం నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు మాన్యువల్‌ హాజరు నమోదు చేశారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. అక్రమాలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల రీత్యా జూలై 1న జరిగే గ్రూప్‌-4 పరీక్షలో బయోమెట్రిక్‌ హాజరు తీసుకుంటామని టీఎస్పీఎస్సీ స్పష్టత ఇచ్చింది. 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయగా 9.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు 2,846 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్‌-1ను ఉదయం 10- 12.30 మధ్య, పేపర్‌-2ను మధ్యాహ్నం 2.30 సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.

అభ్యర్థే ఓఎంఆర్‌ షీట్‌లో వివరాలు ఇవ్వాలి

గ్రూప్‌-4 పరీక్ష ఓఎంఆర్‌ షీట్‌లో అభ్యర్థి పేరు, హాల్‌ టికెట్‌ నంబరు లేదా ఫొటో ఇలాంటి వివరాలు వేటినీ ముద్రించడం లేదు. నిర్వహణలో సమస్యలు వస్తాయని అధికారులు భావిస్తుండడమే దీనికి కారణం. ఒక అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌ మరో అభ్యర్థికి వెళ్లే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దాంతో అభ్యర్థి వివరాలు లేకుండానే ఓఎంఆర్‌ షీట్‌ ముద్రిస్తున్నారు. తన వివరాలను అభ్యర్థే నమోదు చేయాల్సి ఉంటుంది. గతంలో నిర్వహించిన పరీక్షల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేశామని అధికారులు వివరిస్తున్నారు.

పరీక్షల పేరుతో మహిళలను అవమానించవద్దు

వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌

గ్రూప్‌-4 పరీక్షల సందర్భంగా మహిళలను అవమానించవద్దని టీఎస్పీఎస్సీ అధికారులకు విశ్వ హిందు పరిషత(వీహెచ్‌పీ), బజరంగ్‌ దళ్‌ గురువారం వినతి పత్రం అందజేశాయి. చెవి రింగులు, గాజులు, ముక్కు పుడకలతో పాటు తాళిబొట్టు, కాలి మెట్టెలు తొలగించిన తర్వాతనే పరీక్ష రాయడానికి అనుమతించడం సరైన పద్ధతి కాదని అందులో పేర్కొన్నాయి. అలా చేసి మహిళల మనోభావాలను కించపరచవద్దని, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అభ్యర్థించాయి. వినతిపత్రం సమర్పించిన వారిలో వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్‌, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్‌, ప్రచార ప్రముఖ్‌ పగుడాకుల బాలస్వామి, బజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ శివ రాములు ఉన్నారు.

Updated Date - 2023-06-30T12:05:38+05:30 IST