Seasonal care: వర్షాకాలమంతా ఉల్లాసంగా సాగిపోవాలంటే..!
ABN , First Publish Date - 2023-07-11T11:30:38+05:30 IST
ఆయాసం, ధూమపానాలతో ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి వానాకాలంలో తేలికగా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. అలాగే వరుస పెట్టి తమ్ముతూ ఉండేవాళ్లు, ముక్కు వెంట నీరు కారుతూ ఉండే ‘అలర్జిక్ రైనైటిస్’ సమస్య ఉన్నవాళ్లు కూడా వర్షాకాలంలో రెట్టింపు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమంది అదే పనిగా దగ్గుతూ ఉంటారు.
‘‘హాచ్... హాచ్... హాచ్... ఛ... ఈ తుమ్ములతో చచ్చిపోతున్నాను. ఈ వానాకాలం వస్తే చాలు, తుమ్ములు, జలుబు వేధిస్తాయి’’ చికాకుపడ్డాడు 60 ఏళ్ల రాజేశ్వర రావు. ‘‘నా ఆయాసం కంటే నీ తుమ్ములే మేలు! ఈ కాలంలో ఆయాసంతో ఊపిరాడక ప్రాణాలు పోయినంత పనవుతోంది’’ భుజం తడుతూ తన బాధను వెళ్లబోసుకున్నాడు అదే వయసున్న రామారావు. వీళ్లిద్దరిలాగే వానా కాలం కొందరికి కొన్ని సమస్యలను తెచ్చి పెడుతుంది. వాటిని అప్రమత్తతతో అదుపులో పెట్టుకోవడమనేది మన చేతుల్లో పనే!
ఆయాసం, ధూమపానాలతో ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి వానాకాలంలో తేలికగా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. అలాగే వరుస పెట్టి తమ్ముతూ ఉండేవాళ్లు, ముక్కు వెంట నీరు కారుతూ ఉండే ‘అలర్జిక్ రైనైటిస్’ సమస్య ఉన్నవాళ్లు కూడా వర్షాకాలంలో రెట్టింపు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమంది అదే పనిగా దగ్గుతూ ఉంటారు. ఇలాంటి బ్రాంఖైటిస్ సమస్య ఉన్నవాళ్లు, మధుమేహం అదుపు తప్పిన వాళ్లు, దీర్ఘకాలంగా మధుమేహం కలిగి ఉన్న వాళ్లకు కూడా ఈ సీజన్‌లో ఇన్‌ఫెక్షన్లు తేలికగా సోకే అవకాశం ఉంటుంది. వీళ్లకు లంగ్ ఇన్‌ఫెక్షన్లు సోకడంతో పాటు, తీవ్రత కూడా పెరిగి ఆస్పత్రిలో చేరే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్య లేని ఆరోగ్యవంతులైన, 65 ఏళ్లు పైబడిన వాళ్లు కూడా వానాకాలం సమస్యలకు తేలికగా గురవుతూ ఉంటారు.
దోమలకు దూరంగా....
వానలతో దోమలు కూడా పెరుగుతాయి. మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉన్నా, నివసించే కమ్యూనిటీలో ఎక్కడ నీరు నిల్వ ఉన్నా, మురుగు పేరుకుపోయినా దోమలు విజృంభిస్తాయి. వీటితో డెంగ్యూ, మలేరియా జ్వరాలు మొదలవుతాయి. వయసుతో పరిమితం లేకుండా ఈ జ్వరాలు ఎవరికైనా సోకుతాయి. కాబట్టి పిల్లలు, 65 ఏళ్లు దాటిన పెద్దలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న వాళ్లు (హృద్రోగులు, మూత్రపిండాల సమస్యలు) ఈ కాలంలో దోమలకు అడ్డుకట్ట వేయాలి. పొగ వెలువడే కాయిల్స్‌కు బదులుగా దోమల బ్యాట్స్, దోమ తెరలు లాంటివి వాడుకోవడం మేలు.
నీటి కాలుష్యం
కాచి చల్లార్చిన నీళ్లు, శుభ్రమైన నీళ్లు తాగడం అన్ని సందర్భాల్లో సాధ్యపడకపోవచ్చు. ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఉద్యోగ విధుల్లో భాగంగా ఊళ్లు తిరుగుతూ ఉంటాం. హోటళ్లలో తింటూ ఉంటాం. దాంతో కలుషిత నీరు తాగడం, కలుషిత ఆహారం తినడం వల్ల టైఫాయిడ్ జ్వరాలు, కలరా, గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి జీర్ణకోశ సమస్యలు లాంటివి కూడా ఈ కాలంలో వేధించడం సహజం. కాబట్టి సాధ్యమైనంత వరకూ శుభ్రమైన నీళ్లు, ఆహారాలకే ప్రాధాన్యం ఇవ్వాలి.
అలర్జీలు ఉంటే...
తెల్లవారుతూనే వాకింగ్‌కు బయల్దేరే అలవాటు చాలా మందికి ఉంటుంది. చల్లని వాతావరణంలో వాకింగ్‌కు బయల్దేరితే అలర్జీలు ఉన్న వాళ్లకు ఆ సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఉదయం నడక మానేసి, సాయంత్రాలు నడవడం అలవాటు చేసుకోవాలి. లేదంటే ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు, ముక్కుకు మాస్క్ పెట్టుకుని వాకింగ్‌కు వెళ్లాలి. ఆస్తమా, అలర్జీలు ఉన్నవాళ్లు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే పెద్దలు ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. తుమ్ములు, ముక్కు, కళ్ల నుంచి నీరు కారడం, ఆయాసం లాంటి అలర్జీలు ఉన్నవాళ్లు దుమ్ము, చల్లదనాలకు దూరంగా ఉండాలి. మాస్క్ అలవాటు చేసుకోవాలి. అలాగే చల్లని పదార్థాలకు దూరంగా ఉంటూ ఆహారంతో, విటమిన్ డితో ఇమ్యూనిటీని పెంచుకోవాలి. అలాగే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. దీంతో అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు తీవ్రం కాకుండా ఉంటాయి.
ఆహారం రక్ష
సీజనల్ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్న వాళ్లు ఆహారంలో ప్రొటీన్‌ను పెంచాలి. శాకాహారులు పప్పుధాన్యాలు, మాంసాహారులు గుడ్లు తీసుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే తాజా పండ్లు తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. అయితే ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాలు, ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్ లాంటివి తీసుకోకూడదు.
వ్యాక్సిన్లు ఉన్నాయి
కొవిడ్‌తో వ్యాక్సిన్ల ప్రాముఖ్యాన్ని తెలుసుకున్నాం. అదే పనిగా ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్లకు గురవడం, ఉబ్బసం, అలర్జీలకు గురయ్యే వాళ్లు ఏడాదికోసారి ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే బ్యాక్టీరియల్ న్యుమోనియాకు కూడా వ్యాక్సిన్ ఉంది. ధూమపానం అలవాటు ఉన్న వాళ్లు, కొవిడ్‌తో ఊపిరితిత్తులు బలహీనపడిన వాళ్లు, అలర్జీలు ఉన్న వాళ్లు ఐదేళ్లకోసారి ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ఈ సమస్యకు అడ్డుకట్ట పడకపోయినా, తీవ్రత పెరగకుండా ఉంటుంది.
స్వీట్లు తగ్గించాలి
స్వీట్లు తింటే జలుబు చేయడం, గొంతు పట్టేయడం లాంటి పరిస్థితి ఉంటే, దాన్ని ఒక రకమైన అలర్జీగా భావించాలి. స్వీట్లు తిన్నప్పుడు కఫం పేరుకుంటున్నా, దగ్గు పెరుగుతున్నా అలర్జీగానే పరిగణించాలి. కొందరికి స్వీటు తిన్న వెంటనే అసిడిటీ మొదలవుతుంది. లేదంటే పొట్ట ఉబ్బరం వేధిస్తుంది. ఇవి కూడా అలర్జీ లక్షణాలే! వీటిలో ఏ లక్షణం వేధించినా స్వీట్లను పరిమితం చేయాలి. మరీ ముఖ్యంగా అలర్జీని కలిగించే పదార్థాలను ఎవరికి వారు కనిపెట్టడమే కీలకం.
వానాకాలం జాగ్రత్తలు
కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి
పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి
తరచూ చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి
వేడి పదార్థాలు తినాలి
చల్లగాలి, చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి
తాజా పండ్లు తినాలి
ఆహారంలో ప్రొటీన్ ఎక్కువ తీసుకోవాలి.
-డాక్టర్ శివ రాజు
సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్,
హెచ్‌ఒడి మెడిసిన్ డిపార్ట్‌మెంట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్.