Heart disease: మధుమేహం, గుండెజబ్బులకు మూలాలు ఎక్కడ?
ABN , First Publish Date - 2023-10-13T11:03:40+05:30 IST
మధుమేహం (Diabetes), గుండెజబ్బులు (Heart disease), మానసిక రుగ్మతలు వంటి అసాంక్రమిక వ్యాధుల మూలాలపై జరుగుతున్న అంతర్జాతీయ అధ్యయనంలో హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ
జన్యు, పర్యావరణ ప్రభావాలపై సీసీఎంబీ అధ్యయనం
హైదరాబాద్, అక్టోబరు 12: మధుమేహం (Diabetes), గుండెజబ్బులు (Heart disease), మానసిక రుగ్మతలు వంటి అసాంక్రమిక వ్యాధుల మూలాలపై జరుగుతున్న అంతర్జాతీయ అధ్యయనంలో హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు భాగస్వాములయ్యారు. ఈ వ్యాధులకు జన్యుపరమైన, పర్యావరణ పరమైన అంశాలతో పాటు మరేవైనా కారణాలున్నాయా అనే దానిపై అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం జరుపుతున్నారు. ‘డైవర్స్ ఎపిజెనిటిక్ ఎపిడమాలజీ పార్ట్‌నర్‌షిప్’ (డీప్) ప్రాజెక్టులో భాగంగా ఇది జరుగుతోంది. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లోని పలు దేశాల్లో 20కి పైగా పరిశోధనా సంస్థలు ఈ అధ్యయనాన్ని చేపట్టాయి. దీంట్లో సీసీఎంబీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గిరిరాజ్ ఆర్ ఛాందక్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం కూడా పాలుపంచుకుంటోంది. వాస్తవానికి గిరిరాజ్ బృందం ఈ రంగంలో దాదాపు రెండు దశాబ్దాలుగా పరిశోధనలు జరుపుతోంది.
మధుమేహం, గుండెజబ్బులకు జన్యుపరమైన, పర్యావరణపరమైన అంశాలు ప్రధాన కారణమని సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేల్చారు. మన దేశ ప్రజానీకంలో విటమిన్ బీ 12 చాలా తక్కువగా ఉండటం, డీఎన్‌ఏ-ఎం వంటి జన్యుపరమైన మార్పులు, పర్యావరణ ప్రభావం.. అన్నీ కలిపి ఈ వ్యాధుల తీవ్రతను పెంచుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై విస్తృత అధ్యయనం కోసం డీప్ ప్రాజెక్టులో సీసీఎంబీతోపాటు బ్రిటన్ శాస్త్రవేత్తలు నాలుగు ఖండాల్లో పరిశోధనలు చేపట్టారు. ప్రజల జన్యు నమూనాలను అధ్యయనం చేయడం ద్వారా అసాంక్రమిక వ్యాధుల మూలాలను కనుగొని, వాటిని నివారించే చర్యలు చేపట్టవచ్చని డాక్టర్ గిరిరాజ్ పేర్కొన్నారు.