Conjunctivitis: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అడ్డుకట్ట ఇలా వేయండి
ABN , First Publish Date - 2023-08-01T16:47:23+05:30 IST
‘పింక్ ఐ’ అనే పేరున్న కళ్లకలక బడి ఈడు పిల్లలో అత్యంత సహజమైన సమస్య. కంట్లోని కనుగుడ్డు లోపలి భాగాన్నీ, తెల్ల గుడ్డును కప్పి ఉంచే కంజెక్టైవా వాపు వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.
‘పింక్ ఐ’ అనే పేరున్న కళ్లకలక బడి ఈడు పిల్లలో అత్యంత సహజమైన సమస్య. కంట్లోని కనుగుడ్డు లోపలి భాగాన్నీ, తెల్ల గుడ్డును కప్పి ఉంచే కంజెక్టైవా వాపు వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.
కళ్లకలకకు వేర్వేరు కారణాలున్నప్పటికీ, సాధారణంగా ఇన్‌ఫెక్షన్, అలర్జీల వల్లే ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. కళ్లకలకను అనుకరించే ఇతరత్రా కంటి సమస్యలు కూడా ఉన్నాయి. రుమటలాజికల్ సమస్య వల్ల కంట్లోని కణజాలంలోని మధ్య పొర ఇన్‌ఫ్లమేషర్‌కు గురై కంజక్టివైటి్‌సను తలపిస్తుంది. అలాగే అరుదైన కొన్ని రసాయన కంజెక్టివైటిస్ అనే కళ్లకలకను తలపించే వ్యాధి కూడా పిల్లలను వేధిస్తూ ఉంటుంది.
ఇన్‌ఫెక్షన్ కారక కళ్ల కలక బ్యాక్టీరియా, లేదా వైర్‌సలా సోకుతుంది. విపరీతంగా వ్యాప్తి చెందే తత్వం కలిగిన ఈ సమస్య స్రావాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా బహిర్గతమైనవాళ్లకు తేలికగా సోకుతుంది. ఈ సమస్యకు గురైన పిల్లల కంటి స్రావాలు అంటుకున్న ప్రదేశాలను, వాళ్లు ఉపయోగించిన వస్తువులను తాకడం ద్వారా ఇతరులకు సోకుతూ ఉంటుంది. కలుషిత నీరు, దుస్తులు, కలిసి కళ్లకలక సోకిన వారితో కలిసి ఈతకొట్టడం వల్ల కూడా కండ్లకలక అంటుకుంటుంది. కంటి నుంచి స్రావం కారుతున్నంత కాలం ఇన్‌ఫెక్షన్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి.
వ్యాప్తికి అడ్డుకట్ట ఇలా...
కళ్ల కలక ఉన్న పిల్లల దుస్తులు, దుప్పట్లు, టవళ్లు ఇతరులు వాడకూడదు
కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి పింక్ ఐ సోకినప్పుడు, ఐ డ్రాప్స్‌ను పంచుకోకూడదు.
తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
కంటి స్రావం ఆగేవరకూ పిల్లలను బడికిపంపించకూడదు.
లక్షణాలు ఇవే...
కళ్లు వాచి, ఎరుపెక్కి, స్రావం కారడం, జిగటగా ఉండే స్రావం కంటి నుంచి వెలువడడం, నిద్రపోయి లేచినప్పుడు స్రావం గట్టిపడి, కనురెప్పలు అంటుకుపోవడం, కళ్ల దురద కంటికలక ప్రధాన లక్షణాలు. కొంతమంది పిల్లలు వెలుగును భరించలేని ఫొటోఫోబియాను కూడా కనబరుస్తూ ఉంటారు. స్రావానికి బహిర్గతమైన 24 నుంచి 48 గంటల్లోగా లక్షణాలు మొదలై కొన్ని రోజుల నుంచి వారం రోజుల వరకూ కొనసాగుతాయి. సొంత వైద్యంలో ఉపయోగించే మందులతో పరిస్థితి మరింత దిగజారుతుంది కాబట్టి పిల్లలను పీడియాట్రిషియన్‌కు చూపించి, సరైన మందులు వాడుకోవాలి.
పెద్దలకు చిట్కాలు
కళ్లను తుడవడానికి పొడిగా, గరుకుగా ఉండే వస్త్రాలను ఉపయోగించకూడదు. ఇలాంటి వాటి వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది.
కళ్లను తుడవడానికి శుభ్రమైన, మెత్తని వస్త్రాన్నే ఉపయోగించాలి.
రెండు కళ్లకూ వేర్వేరు వస్త్రాలు ఉపయోగించాలి.
కంటిని లోపలి నుంచి బయటకు శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల పక్క కంటికి ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉంటుంది.
కంటి లోపల శుభ్రం చేసే ప్రయత్నం చేయకూడదు. ఇలా చేస్తే కన్ను దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.
పిల్లలకు సరిపడా నీళ్లు తాగిస్తూ ఉండాలి.
ఒకవేళ లక్షణాలు వారం దాటినా తగ్గకపోయినా, పిల్లల్లో దృష్టి సమస్యలు తలెత్తినా, కంట్లో ఎరుపు, నొప్పి పెరిగినా, ఫొటోఫోబియా తలెత్తినా, జ్వరం, కంటి వాపు పెరుగుతున్నా వెంటనే పిడియాట్రీషియన్‌ను సంప్రతించాలి.
అలర్జీ కళ్ల కలక
హే ఫీవర్ లాంటి అలర్జీలున్న పిల్లలకు అలర్జిక్ కంజెక్టివైటిస్ తేలికగా సోకుతుంది. ముక్కు నుంచి నీరు కారడంతో పాటు, తుమ్ములు, కళ్లు ఎర్రబడడం, కళ్లు తరచూ రుద్దుకోవడం లాంటివి ఈ కళ్లకలక ప్రధాన లక్షణాలు. ఈ రుగ్మత ఒకరి నుంచి ఇంకొకరికి సోకదు.
-డాక్టర్. సురేష్ కుమార్ పానుగంటి,సీనియర్ పీడియాట్రీషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్.