Share News

Heart Health: కొవిడ్‌ బారిన పడ్డవారు బీ అలర్ట్! ఈ లక్షణాలు కనిపిస్తే..!

ABN , First Publish Date - 2023-11-07T10:53:02+05:30 IST

కొవిడ్‌ వచ్చింది, తగ్గింది. హమ్మయ్య! గండం గడిచి బయటపడిపోయాం అని ఊపిరి పీల్చుకున్నాం. కానీ నిజానికి కొవిడ్‌ ప్రభావంతో బలహీనపడిన గుండె అంతే సమర్థంగా మున్ముందు పని చేయకపోవచ్చు. అకస్మాత్తుగా

Heart Health: కొవిడ్‌ బారిన పడ్డవారు బీ అలర్ట్! ఈ లక్షణాలు కనిపిస్తే..!

కొవిడ్‌ వచ్చింది, తగ్గింది. హమ్మయ్య! గండం గడిచి బయటపడిపోయాం అని ఊపిరి పీల్చుకున్నాం. కానీ నిజానికి కొవిడ్‌ ప్రభావంతో బలహీనపడిన గుండె అంతే సమర్థంగా మున్ముందు పని చేయకపోవచ్చు. అకస్మాత్తుగా కొత్త సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి కొన్ని లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచి, వెంటనే అప్రమత్తమై వైద్య సహాయం తీసుకోవాలి అంటున్నారు వైద్యులు.

కొవిడ్‌ వైరస్‌ దాడి చేసినప్పుడు సహజసిద్ధంగానే రోగినిరోధక అప్రమత్తమైపోయింది. అయితే కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సమయంలో అది అవసరానికి మించి స్పందించే పరిస్థితి ఏర్పడింది. దాంతో గుండె కండరాల మీద ప్రభావం పడింది. శరీరంలో చోటు చేసుకున్న సైటోకైనిక్‌ స్టార్మ్‌ వల్ల గుండె కండరాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ తలెత్తి, దాని మూలంగా గుండె బలహీనపడింది. దాంతో ఆయాసం, హార్ట్‌ ఫెయిల్యూర్‌ సమస్యలు పెరిగాయి. అలాగే కొవిడ్‌ సోకిన వాళ్ల ఊపిరితిత్తులు ఎంతో కొంత బలహీనపడ్డాయి. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరకపోడానికీ, ఐసియులో అడ్మిట్‌ కాకపోవడానికీ దీనికీ సంబంధం లేదు. ఇంటి పట్టునే ఉంటూ చికిత్సతో కొవిడ్‌ను తగ్గించుకున్న వాళ్లకూ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం వల్ల ఎంతో కొంత గుండె, ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పడింది. ఫలితంగా కరొనరీ ఆర్టెరీలో రక్త సరఫరాకు, గుండె డిమాండ్‌కూ మధ్య సంతులనం దెబ్బతింటుంది. గుండెకు అవసరమైనంత రక్తాన్ని రక్తనాళాలు సరఫరా చేయలేకపోతాయి. ఫలితంగా హార్ట్‌ అటాక్‌ వస్తుంది. కొంతమందికి రక్తనాళాల్లో చిన్నపాటి ఎథెరెస్ల్కెరోటిక్‌ క్లాట్స్‌ ఉంటున్యాఇ. ఇవి అకస్మాత్తుగా పగలడం మూలంగా, కొవిడ్‌తో రక్తం చిక్కబడడం మూలంగా రక్తపు గడ్డలు త్వరత్వరగా ఏర్పడి గుండె పోటుకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇలా కొవిడ్‌ పాండమిక్‌ వల్ల హార్ట్‌ ఫెయిల్యూర్‌, హార్ట్‌ అటాక్స్‌ క్రమేపీ పెరిగాయి.

గుండెకు అండ అప్రమతత్తతే!

అన్ని వయసుల వాళ్లలో ఈ సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టే పెద్దలతో పాటు, యువత కూడా గుండెపోటుకు, హార్ట్‌ ఫెయిల్యూర్‌కూ గురవుతోంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే లక్షణాల పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్‌ చికిత్స పట్ల అందరికీ అవగాహన పెరిగింది. ఏ మందులు వాడుకోవాలో తెలిసింది. ఇది ఒక రకంగా మంచిదే! కానీ దీంతో చికిత్సలకు సంబంధించి అవసరానికి మించిన ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దాంతో ఏ చిన్న లక్షణం కనిపించినా సొంత వైద్యాన్ని ఆశ్రయించడం పరిపాటిగా మారింది. నొప్పికి పెయిన్‌ కిల్లర్స్‌ వాడేసుకోవడం, ఇతరత్రా చిన్నపాటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం కూడా అలవాటైపోయింది. సొంత వైద్యంతో లక్షణాలు అదుపులోకి రానప్పుడు మాత్రమే వైద్యులను కలిసే పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆలస్యంగా వైద్యులను కలవడం, అప్పటికే గుండెకు జరగవలసిన నష్టం జరిగిపోవడం, చికిత్స క్లిష్టం కావడం, అంతిమంగా గుండె మార్పిడి చేయవలసిన పరిస్థితి ఏర్పడడం... లాంటివి జరుగుతున్నాయి. అయితే అందరూ ఆలోచించవలసిన విషయం ఒకటుంది. ‘సాధారణ నొప్పికి వాడే పెయిన్‌ కిల్లర్స్‌ను గుండె నొప్పికి ఉపయోగించడం ఎంతవరకూ సమంజసం?’’ ఎటువంటి చిన్నపాటి లక్షణాలు కనిపించినా ఏమాత్రం అలక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రతించడం అవసరం.

iStock-1325367903-path.jpg

థ్రాంబోసిస్‌ తలెత్తకుండా...

కొవిడ్‌ వల్ల రక్తం చిక్కబడింది. దాంతో తేలికగా రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశాలు కూడా పెరిగాయి. ఇది థ్రాంబోసి్‌సకు దారి తీయకుండా ఉండాలంటే, రక్తం పలుచనయ్యేలా సరిపడా నీళ్లు తాగాలి. ఎసిల్లో ఎక్కువ సమయాలు గడుపుతున్నాం. చలి కాలంలో ఉన్నాం. ఇలాంటప్పుడు దాహార్తి తగ్గడం సహజమే! అయినా డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండడం కోసం, గుండె ఆరోగ్యం కోసం తప్పనిసరిగా సరిపడా నీళ్లు తాగాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అనుసరిస్తూ, ఒత్తిడిని కూడా అదుపులో ఉంచుకుంటూ ఉండాలి.

లక్షణాల మీద ఓ కన్నేసి...

హార్ట్‌ ఫెయిల్యూర్‌ లక్షణాలు ఇలా ఉంటాయి.

ఆయాసం, ఊపిరి అందకపోవడం: రోజూ నాలుగు కిలోమీటర్లు వాళ్లు క్రమేపీ అంత దూరం నడవలేక, దూరాన్ని తగ్గించుకోవడం. కనీసం కిలోమీటరు దూరం కూడా నడవలేనంతగా గుండె రక్తాన్ని పంప్‌ చేయలేకపోతోంది అనడానికి సూచన ఇది.

కాళ్ల వాపు: ఇంతకు ముందెప్పుడూ కనిపించని ఈ లక్షణం హఠాత్తుగా తలెత్తుతుంది

ఛాతీ నొప్పి: ఛాతీలో సన్నని నొప్పి వేధిస్తూ ఉండవచ్చు.

హార్ట్‌ అటాక్‌ లక్షణాలు ఇలా ఉంటాయి

ఛాతీ నొప్పి: మధుమేహం లేని వాళ్లు, యువకుల్లో ఛాతీలో ఎడమ వైపు లేదా భుజం, లేదా వెన్ను, లేదా దవడలో మొదలైన నొప్పి చేతిలోకి పాకడం లాంటి లక్షణాలు మొదలవుతాయి. ఇవన్నీ హార్ట్‌ అటాక్‌ ప్రధాన లక్షణాలు.

మధుమేహులు, మహిళల్లో: వీళ్లలో సైలెంట్‌ హార్ట్‌ అటాక్స్‌ రావచ్చు. ఛాతీ నొప్పి లాంటి లక్షణాలు వీరిలో ఉండకపోవచ్చు. కానీ ఆయాసం కనిపించవచ్చు. రక్తపోటు పడిపోయి ఆస్పత్రికి చేరుకున్నప్పుడు, యాంజియోగ్రామ్‌లో బ్లాక్‌ కనిపించవచ్చు. కాబట్టి వీళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి.

గుండె నొప్పి లక్షణాలతో వచ్చిన రోగులకు సాధారణ రక్తపరీక్షతో పాటు, కొలెస్ట్రాల్‌ మోతాదులు, ఇసిజి, ఎకొ మొదలైన ప్రాథమిక పరీక్షలతో గుండె సమస్యను కొంత మేరకు అంచనా వేయవచ్చు. ఇలా కాకుండా అత్యవసర చికిత్స అవసరపడిన వాళ్లకు అడ్డాన్స్‌డ్‌ పరీక్షలు అవసరమవుతాయి. ఇసిజి, ఎకో పరీక్షలు అసాధారణంగా ఉంటే, యాంజియోగ్రామ్‌ చేసి, బ్లాక్స్‌ను పరీక్షించవలసి ఉంటుంది. హార్ట్‌ ఫెయిల్యూర్‌ లక్షణాలున్నవాళ్లకు గుండె పనితీరు నెమ్మదించిందని నిర్థారణ అయినప్పుడు కార్డియాక్‌ ఎమ్మారై అవసరపడుతుంది. సమస్య ఉంటే స్టెంట్స్‌, కొరొనరీ ఆర్టరీ బైపాస్‌ అవసరపడతాయి. అరుదుగా గుండె పనితీరు బాగా నెమ్మదించి హార్ట్‌ ఫెయిలయ్యే పరిస్థితి ఉన్నప్పుడు, గుండె మార్పిడి ఒక్కటే ప్రత్యామ్నాయం.

ఆ పరికరమే ప్రత్యామ్నాయం

గుండె, ఊపిరితిత్తులు పనిచేయడం మానేసినప్పుడు, ఆ పనిని భుజానికెత్తుకునే సాంకేతిక పరికరమే ఎక్మో. గుండె మార్పిడి దశకు క్షీణించిన వాళ్లకు, తిరిగి గుండె కోలుకునే వరకూ తాత్కాలికంగా ఎక్మోతో ఆసరాను అందించవచ్చు. అయితే ఈ పరికరం నాలుగు నుంచి ఐదు వారాల వరకే పనికొస్తుంది. ఆలోగా రోగి గుండె మెరుగుపడాలి. లేదా ‘లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ అసిస్ట్‌ డివైజ్‌’ను అమర్చాలి లేదా గుండె మార్పిడి చేయాలి. గుండె మార్పిడి కోసం గుండె వెనువెంటనే దొరకడం కష్టం కాబట్టి లెఫ్ట్‌ వెంట్రికల్‌ అసిస్ట్‌ డివైజ్‌తో ఎంత కాలం పాటైనా ఆరోగ్యాన్ని కాపాడుకునే వీలుంది. గుండె మార్పిడి కోసం గుండె దొరికే వరకూ కూడా ఈ పరికరాన్ని వాడుకోవచ్చు. ఛాతీని తెరచి, గుండెకు అనుసంధానించే ఈ పరికరంతో ఎలాంటి అసౌకర్యం ఉండదు. విపరీతమైన శారీరక శ్రమకు గురికి లోను చేయని రోజువారీ పనులన్నీ చేసుకోవచ్చు. డివైజ్‌ నుంచి బయటకు వచ్చే వైరు బ్యాటరీకి కనెక్ట్‌ అయి ఉంటుంది. దాన్ని పాకెట్‌లో పెట్టుకోవాలి. అయితే ఈ పరికరాన్ని అమర్చుకున్న వాళ్లు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా చూసుకోవాలి. ఇందుకోసం రద్దీతో కూడిన జనసమ్మర్థంతో కూడిన ప్రదేశాలకు దూరంగా ఉండాలి. డివైజ్‌ నుంచి వైను బయటకు వచ్చే ప్రదేశానికి ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా చూసుకోవాలి. ఈ పరికరంలాగే రైట్‌ వెంట్రిక్యులర్‌ అసిస్ట్‌ డివైజ్‌ కూడా ఉంటుంది. ఇది ఆ కుడి కవాటం ఫెయిల్‌ వాళ్లకు ఉద్దేశించినది.

భవిష్యత్తు ఆశాజనకం

మన దేశంలో దాదాపు 40 లక్షల మంది వ్యక్తులు గుండె ఫెయిల్యూర్‌కు చేరువగా ఉన్నారు. వీళ్లలో 20ు మందికి అత్యవసర గుండె మార్పిడి అవసరం. అయితే అంతమందికి సరిపడా గుండెలు దొరికే పరిస్థితి లేదు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి మాత్రమే గుండెను సేకరించే వీలుంది. అలాంటప్పుడు అన్ని బ్రెయిన్‌ డెత్స్‌ జరగవు. ఒకవేళ బ్రెయిన్‌ డెత్స్‌ అయినా, గుండెను దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించాలి. అన్నీ అనుకూలించి, గుండె సేకరించి అమర్చినా, దాత శరీరం కొత్త గుండెను తిరస్కరించకుండా ఉండాలి. అలా జరగకుండా ఉండడం కోసం ఇచ్చే ఇమ్యునో సప్రెసెంట్లతో ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు సోకకుండా ఉండాలి. ఇలా గుండె మార్పిడితో ముడిపడి ఉండే సమస్యలెన్నో. అందుకే ఈ సమస్యలను అధిగమించడం కోసం ప్రపంచంలో కొన్ని చోట్ల పంది గుండెను కూడా అమరుస్తున్నా, అది పూర్తిగా విజయవంతం కావడం లేదు. కాబట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టడంలో భాగంగా రోగి నుంచి సేకరించిన మూల కణాలతో జెనెటిక్‌ క్లోనింగ్‌ ద్వారా ప్రయోగశాలలో గుండెను అభివృద్ధి చేసే ప్రయోగాల వైపు శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తున్నారు.

ee.jpg

-డాక్టర్ గిరిధర్ హరిప్రసాద్

సీనియర్ కార్డియో థొరాసిక్ అండ్ హార్ట్ ట్రాన్స్‌ప్లాండ్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్.

Updated Date - 2023-11-07T10:54:46+05:30 IST