Share News

Counselling: ప్రసవం జరిగాక ఈ సమస్య తలెత్తింది! బయటపడేదెలా?

ABN , First Publish Date - 2023-11-23T12:09:30+05:30 IST

ఇది కొంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇలా కూడా ఉంటుందా? అని అనిపించవచ్చు. కానీ గర్భిణి లేదా బాలింత డిప్రెషన్‌కు లోనవడం

Counselling: ప్రసవం జరిగాక ఈ సమస్య తలెత్తింది! బయటపడేదెలా?

డాక్టర్‌! నాకు ఇటీవలే ప్రసవమైంది. అప్పటి నుంచి మానసిక కుంగుబాటుకు లోనవుతున్నాను. ఇలా ఎందుకు జరుగుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేదెలా?

- ఓ సోదరి, హైదరాబాద్‌.

ఇది కొంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇలా కూడా ఉంటుందా? అని అనిపించవచ్చు. కానీ గర్భిణి లేదా బాలింత డిప్రెషన్‌కు లోనవడం సర్వసాధారణం. ఇందుకు మానసిక కారణాలు ఉండొచ్చు. మానసిక రుగ్మతల పూర్వ చరిత్ర ఉండి ఉండవచ్చు. ప్రసవంతో హార్మోన్ల స్రావాలు హఠాత్తుగా తగ్గడం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చు. విపరీతమైన ఒత్తిడి వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఉదాహరణకు.....

  • అప్పటిదాకా సాధారణ ప్రసవమే జరుగుతుందని అనుకున్నా, ఊహించని కారణాల వల్ల సి - సెక్షన్‌ జరిగినప్పుడు

  • ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తినప్పుడు

  • భర్త, కుటుంబీకుల తోడ్పాటు లోపించినప్పుడు

  • ప్రసవం గురించి విపరీతమైన భయాలు ఉన్నప్పుడు

  • చెప్పుడు మాటలు విని పెంచుకున్న అపోహల వల్ల

  • చనుపాలు రాకపోయినా

  • న్యూక్లియర్‌ ఫ్యామిలీ (భార్య, భర్త తప్ప ఇతరులు ఎవరూ లేని కుటుంబం)

ఇలా.. కారణం ఏదైనా నిరాశకు లోనవుతున్నట్టు అనిపించినా, ఆ లక్షణాలను కుటుంబసభ్యులు గమనించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ‘అలా అనిపించడం మామూలేలే! మేమంతా పిల్లల్ని కన్నవాళ్లమేగా?’ అంటూ తేలికగా తీసిపారేయకుండా వెంటనే అప్రమత్తమవడం మంచిది. డిప్రెషన్‌ ప్రసవం తర్వాతే కాదు, ముందూ రావచ్చు. ప్రసవమై బిడ్డకు 4 నెలల నుంచి ఏడాది వయసొచ్చేవరకూ కొనసాగవచ్చు. ఇది వ్యక్తికీ వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది.

చికిత్సలున్నాయి!

ప్రసవం ముందైనా, తర్వాతైనా డిప్రెషన్‌ తాలూకు లక్షణాలు కనిపిస్తే మొదట కౌన్సిలింగ్‌ ఇవ్వవలసి ఉంటుంది. మెడికల్‌ హిస్టరీ ఆధారంగా డిప్రెషన్‌ గురించి లోతైన అవగాహన ఏర్పరుచుకుని, తదనుగుణంగా చికిత్స అందించవలసి ఉంటుంది. ప్రారంభంలో కౌన్సిలింగ్‌ ఉంటుంది. దీంతో చాలావరకూ లో ఫీలింగ్‌, పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌లు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే యాంటీ డిప్రెసెంట్లు వాడుకోవలసి ఉంటుంది. వీటితో కూడా అదుపు కాకుండా సైకోటిక్‌ దశకు చేరుకుంటే ఆ సమస్యకు తగిన చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. ఏదేమైనా గర్భిణుల్లో, బాలింతల్లో ఈ భావోద్వేగాలను అలక్ష్యం చేయకూడదు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలవాలి. కొందరికి కొన్ని నెలలపాటు చికిత్స చేస్తే డిప్రెషన్‌ పూర్తిగా పోతుంది. కొందరికి అరుదుగా జీవితాంతం మందులు వాడవలసిరావొచ్చు.

-డాక్టర్‌ భావన కాసు

అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌,

రెయిన్‌బో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-11-23T12:09:38+05:30 IST