Heart Attack: జిమ్ చేసిన యువకులకు గుండెపోటు.. కారణాలు ఇవేనా?
ABN , First Publish Date - 2023-07-10T15:10:13+05:30 IST
అధికంగా వ్యాయామం చేసినా, శారీరంగా అధికంగా కష్టపడినా గుండెపోటు రావడం అనేది అప్పటికే శరీరంలో ఉన్న అడ్డంకుల వల్ల జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. అప్పటివరకు శరీరంలో ఉన్న రోగాలను నిర్ధారణ చేసుకోపోవడం కూడా కారణమంటున్నారు. జిమ్ చేయడం వల్ల నష్టమేమీ ఉండదని.. అయితే అధికంగా వర్కవుట్లు చేసేవాళ్లు కోచ్ సలహాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇటీవల కాలంలో జిమ్ (Gym) చేస్తున్న యువకులు వరుసగా గుండెపోటు(Heart Attack)తో మరణిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. గతంలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ (Punith Rajkumar), బాలీవుడ్ సింగర్ కేకే (KK), హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ్ (Raju Srivastav) వంటి సెలబ్రిటీలు ఫిట్‌నెస్ (Fitness) కోసం కష్టపడి మరణించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఇద్దరు యువకులు కూడా జిమ్ చేసిన తర్వాత గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత రాధాకిషోర్ కుమారుడు 31ఏళ్ల శ్రీధర్ (Sridhar) జిమ్ చేసిన తర్వాత ఇంటికి రాగానే ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మరణించినట్లు కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఇటీవల ఖమ్మం నగరంలోని అల్లీపురంలో కూడా నాగరాజు అనే 33 ఏళ్ల యువకుడు జిమ్ చేసిన తర్వాత గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. తాజా ఘటనలతో జిమ్ చేసే అలవాటు ఉన్న యువకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. జిమ్ చేయడం ప్రమాదమా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
అయితే అధికంగా వ్యాయామం చేసినా, శారీరంగా అధికంగా కష్టపడినా గుండెపోటు రావడం అనేది అప్పటికే శరీరంలో ఉన్న అడ్డంకుల వల్ల జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. అప్పటివరకు శరీరంలో ఉన్న రోగాలను నిర్ధారణ చేసుకోపోవడం కూడా కారణమంటున్నారు. జిమ్ చేయడం వల్ల నష్టమేమీ ఉండదని.. అయితే అధికంగా వర్కవుట్లు చేసేవాళ్లు కోచ్ సలహాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. గుండె రక్తనాళాల్లో చీలిక ఏర్పడితే ఎలాంటి వ్యక్తులకు అయినా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. కొంతమందిలో బ్లాక్స్ లేకపోయినా అకస్మాత్తుగా రక్తం గడ్డ కడుతుందని.. అలాంటి వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. కొందరిలో క్లాట్స్ ఏర్పడే తత్వం సహజంగానే ఉంటుందని.. అలాంటి వాళ్లు వ్యాయామాలు చేసే సమయంలో తగుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు.
ఆరోగ్యం సహకరించనప్పుడు జిమ్ చేయడం ప్రమాదకరమని.. బీపీ, డయాబెటిస్ వంటి రోగాలతో బాధపడే వ్యక్తులు వైద్యుల సలహాతోనే జిమ్ చేయడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. గతంలో 40-50 ఏళ్లు దాటిన వ్యక్తులకే బీపీ, షుగర్ వంటి వ్యాధులు వచ్చేవి అని.. కానీ ప్రస్తుత కాలంలో ఆహారం విషయంలో శ్రద్ధ వహించకపోవడంతో యుక్త వయసులోనే రోగాలు దరిచేరుతున్నాయని.. దీంతో గుండెపోటు బారిన పడుతున్నారని వైద్యులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం యువత బాడీ షేప్‌లను దృష్టిలో పెట్టుుకుని వ్యాయామాలు చేస్తున్నారని.. జిమ్‌లో చేసే పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణం అవుతుందని వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో భారీ ఎక్సర్‌సైజులను తట్టుకునే సామర్ధ్యం శరీరానికి ఉండదు అని.. శరీర సామర్థ్యం ఆధారంగానే వర్కవుట్లు చేయాలని హితవు పలుకుతున్నారు.
ముఖ్యంగా కార్డియో ఎక్సర్‌సైజుల తరువాత 2-5 నిమిషాలు విరామం అవసరం అని.. దీనివల్ల గుండెకు కాస్త ప్రశాంతత లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఛాతి ఎడమ భాగంలో నొప్పిగా అనిపిస్తే వెంటనే వ్యాయామం చేయడం ఆపాలని.. వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. కొందరు యువకులు మొండిగా వ్యాయామాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ధూమపానం అలవాటు ఉన్నవాళ్లు, గుండెపోటు చరిత్ర ఉన్న కుటుంబీకులు జిమ్‌లో అతిగా శ్రమించకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి వ్యాయామం చేయడం కూడా మంచిది కాదని.. ప్రతిరోజు శరీరం సామర్థ్యం ఆధారంగా 30-45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుందని వైద్యులు చెప్తున్నారు.