Food: ఫ్రిజ్‌లో ఆహారాన్ని నిల్వ చేస్తున్నారా? అయితే ఇలా చేయండి

ABN , First Publish Date - 2023-08-23T10:54:28+05:30 IST

పదార్థాల నిల్వకు సంబంధించి మనకు కొన్ని అపోహలుంటాయు. కానీ వాటిలో నిజమెంతో తెలుసుకుందాం!

Food: ఫ్రిజ్‌లో ఆహారాన్ని నిల్వ చేస్తున్నారా? అయితే ఇలా చేయండి

పదార్థాల నిల్వకు సంబంధించి మనకు కొన్ని అపోహలుంటాయు. కానీ వాటిలో నిజమెంతో తెలుసుకుందాం!

అపోహ: వేడి పదార్థాలు చల్లారాకే ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి.

సాధారణ ఉష్ణోగ్రత వద్ద పాడైపోయే వీలున్న పదార్థాలను ఎక్కువ సమయంపాటు బయటే ఉంచకూడదు. 5 నుంచి 60డిగ్రీల ఉష్ణాగ్రత మధ్య పదార్థాల్లోని సూక్ష్మక్రిముల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి మరీ చల్లబడేవరకూ ఆగకుండా పదార్థాలు పొగలు కక్కటం ఆపిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో పెట్టేయాలి. అంటే పొయ్యి నుంచి దింపిన 30 నిమిషాల తర్వాత ఫ్రిజ్‌లో పెట్టొచ్చు.

అపోహ: మంచి వాసనేస్తే తినేయొచ్చు

పదార్థం పాడైందో లేదో తెలుసుకోవటం కోసం వాసన చూస్తాం. ఒకవేళ బాక్టీరియా, ఈస్ట్‌, మౌల్డ్‌లు పదార్థాల్లో చేరితే నురగలు రావటం, జారుడుగా తయారవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దుర్వాసన కూడా ఉంటుంది. ఇలాంటి పదార్థాలు తినటం ప్రమాదకరమే! అయితే పాథోజెనిక్‌ బ్యాక్టీరియా పదార్థాల్లో చేరితే ఎలాంటి దుర్వాసన వెలువడదు. పదార్థం కూడా పాడైనట్టు కనిపించదు. ఈ బ్యాక్టీరియాను కనిపెట్టలేం కాబట్టి పదార్థాల్లోకి బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే వాటిని ఫ్రిజ్‌లో ఉంచి తినటమే మేలు.

అపోహ: ఎక్కువ నూనెతో పదార్థాలు పాడవకుండా ఉంటాయి

నూనె చేర్చటం వల్ల పదార్థాల్లోని సూక్ష్మక్రిములు చనిపోవు. పైగా అవసరానికి మించి నూనె చేర్చటం ద్వారా క్లాస్ట్రిడియం బాట్యులిజం అనే బ్యాక్టీరియ వృద్ధికి అలాంటి పరిస్థితి మరింత సహకరిస్తుంది. ఈ బ్యాక్టీరియా నూనెలో మగ్గే కూరగాయల్లోకి చేరి విపరీతంగా వృద్ధి చెందుతుంది. నూనెలో నిల్వ ఉన్న వెల్లుల్లి, ఆలివ్స్‌, పుట్టగొడుగులు, బీన్స్‌లను నిల్వ ఉంచేటప్పడు శుభ్రత పాటించకపోతే వాటిలో ఈ బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది.

అపోహ: ఒకసారి మాంసాన్ని డీఫ్రాస్ట్‌ చేస్తే తిరిగి ఫ్రీజ్‌ చేయకూడదు.

అంతకంటే తక్కువ సెంటీగ్రేడ్‌ వద్ద నిల్వ ఉంచిన వాటిని తిరిగి రిఫ్రీజ్‌ చేయొచ్చు. అయితే ఇలా చేయటం వల్ల క్వాలిటీలో తేడా వచ్చే విషయం వాస్తవమే! ఇలా జరగకుండా ఉండాలంటే డీఫ్రాస్ట్‌ చేసిన పదార్థాలను ఉడికించి పొగలు కక్కటం తగ్గాక తిరిగి రీఫ్రీజ్‌ చేసుకోవచ్చు.

అపోహ: వండేముందు మాంసాన్ని కడగాలి.

వండేముందు మాంసాల్ని కడగటం సరైన పద్ధతి కాదు. పచ్చి మాంసంలో బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని కడిగిన నీళ్లు ఇతర పదార్థాల మీద పడితే ఆ బ్యాక్టీరియా వాటిలోకి కూడా చేరిపోతుంది. కాబట్టి ఎలాంటి మాంసాన్పైనా నిమ్మరసం, వెనిగర్‌ కలిపిన నీళ్లతో శుభ్రం చేసి ఆ నీళ్లను జాగ్రత్తగా బయట పారబోయాలి. మాంసాన్ని టిష్యూ పేపర్‌ లేదా శుభ్రమైన బట్టతో తుడిచి నేరుగా వండుకోవచ్చు.

Updated Date - 2023-08-23T10:55:43+05:30 IST